Penganga River
-
హోరు గోదావరి.. భద్రాచలం వద్ద మళ్లీ అప్రమత్తం!
సాక్షి, హైదరాబాద్/ సాక్షి నెట్వర్క్: ఎగువన శ్రీరాంసాగర్ నుంచి దిగువన భద్రాచలం ఆవలిదాకా గోదావరి నది హోరెత్తి ప్రవహిస్తోంది. ప్రధాన నది పొడవునా జలకళ ఉట్టిపడుతోంది. ప్రాణహిత నుంచి ప్రవాహం కాస్త తగ్గినా.. ఎగువ నుంచి వస్తున్న నీరు, కడెం, ఇతర వాగులు, వంకలు కలసి మళ్లీ వరద పోటెత్తుతోంది. భద్రాచలం వద్ద నీటి మట్టం మెల్లగా పెరుగుతూ వస్తోంది. ఎగువ గోదావరి ఉరకలేస్తూ.. శనివారం రాత్రి 7 గంటలకు శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి 1,57,496 క్యూసెక్కుల వరద చేరుతోంది. ప్రాజెక్టులో నీటి నిల్వ 56.94 టీఎంసీలకు పెరిగింది. మరో 34 టీఎంసీలు చేరితే ఈ ప్రాజెక్టు నిండిపోతుంది. శ్రీరాంసాగర్ దిగువన ఉన్న ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి 1,92,529 క్యూసెక్కుల ప్రవాహాలు వస్తున్నాయి. నీటి నిల్వ గరిష్ట స్థాయికి చేరుకోవడంతో 20గేట్లు ఎత్తి 2,55,320 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. ఈ వరదకు ప్రాణహిత జలాలు కలసి.. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ (లక్ష్మి) బ్యారేజీలోకి 6,10,250 క్యూసెక్కులు చేరుతున్నాయి. ఇక్కడ వచ్చిన నీటిని వచ్చినట్టు దిగువకు వదులుతున్నారు. మధ్యలో ఇంద్రావతి ఉపనది నీరూ తోడై.. తుపాకులగూడెం వద్ద ఉన్న సమ్మక్క బ్యారేజీలోకి 8,79,450 క్యూసెక్కుల భారీ ప్రవాహం వస్తోంది. ఈ నీటిని అలాగే మొత్తంగా దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ జలాలు, మధ్యలో ఉప నదులు, వాగుల నుంచి కలుస్తున్న జలాలు మొత్తం భద్రాచలం, పోలవరం ప్రాజెక్టు, ధవళేశ్వరం బ్యారేజీ మీదుగా సముద్రంలో కలుస్తున్నాయి. భద్రాచలం వద్ద మళ్లీ అప్రమత్తం శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం దాకా ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. ఆ నీరంతా వాగులు, వంకల ద్వారా ప్రాణహితలోకి చేరి గోదావరికి వరద పెరగనుంది. దీనితోపాటు, ఎగువ నుంచి వస్తున్న ప్రవాహాలు కలసి.. సోమవారం నాటికి భద్రాచలం వద్ద వరద 11 లక్షల క్యూసెక్కులకు పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే గోదావరిలో నీటి మట్టం మెల్లగా పెరుగుతూ వస్తోంది. భద్రాచలంలో శనివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు 39 అడుగుల వద్ద నిలిచిన నీటిమట్టం.. రాత్రి 8 గంటలకు 41.01 అడుగులకు చేరింది. మంత్రి పువ్వాడ అజయ్, ఎంపీ మాలోత్ కవిత, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, ఇతర నేతలు గోదావరి వరద పరిస్థితిని పరిశీలించారు. ముంపు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. కృష్ణాలో పెరుగుతున్న ప్రవాహం పశ్చిమ కనుమల్లో వర్షాలతో కృష్ణా ప్రధాన పాయలో వరద మెల్లగా పెరుగుతోంది. ఆల్మట్టి డ్యామ్‌లోకి 83,945 క్యూసెక్కుల ప్రవాహం ఉండగా, నీటి నిల్వ 45.50 టీఎంసీలకు చేరింది. మరో 84 టీఎంసీలు వస్తే ఈ డ్యామ్ నిండుతుంది. ఆల్మట్టి దిగువన ఉన్న నారాయణపూర్‌లోకి ఇన్‌ఫ్లో ఏమీ లేదు. ఇక కృష్ణా ఉప నది అయిన తుంగభద్రలో వరద కొంత పెరిగింది. తుంగభద్ర డ్యామ్‌లోకి 34,071 క్యూసెక్కులు చేరుతుండగా.. నీటి నిల్వ 16.65 టీఎంసీలకు పెరిగింది. ఆల్మట్టి, తుంగభద్ర జలాశయాలు నిండితే.. దిగువకు వరద రానుంది. ఈ నెలాఖరులోగా శ్రీశైలం జలాశయానికి ప్రవాహాలు మొదలయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దిగువన వరద మొదలు పులిచింతలకు దిగువన కృష్ణా నదిలో ప్రవాహం ప్రారంభమైంది. ఖమ్మం జిల్లాలో కురుస్తున్న వర్షాలతో మున్నేరు పరవళ్లు తొక్కుతోంది. ఆ నీరంతా కృష్ణాలోకి చేరుతుండటంతో.. శనివారం ప్రకాశం బ్యారేజీలోకి 17,377 క్యూసెక్కులు వరద వస్తోంది. దీంతో కృష్ణా డెల్టాకు 7,087 క్యూసెక్కులను విడుదల చేస్తూ.. మిగతా నీటిని సముద్రంలోకి వదిలేస్తున్నారు. సింగరేణికి వాన దెబ్బ భారీ వర్షాలతో సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలిగింది. 14 ఓపెన్ కాస్ట్‌లలో బొగ్గు ఉత్పత్తి, ఓవర్ బర్డెన్ (బొగ్గుపొరలపై ఉన్న మట్టి) వెలికితీత పూర్తిగా నిలిచిపోయాయి. దీనితో రోజుకు 2 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఓసీపీల్లో చేరుతున్న వరద నీటిని తోడిపోసేందుకు భారీ మోటార్లను వినియోగిస్తున్నారు. కోతకు గురైన కాళేశ్వరం అంతర్రాష్ట్ర వంతెన తెలంగాణ–మహారాష్ట్రల మధ్య జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం సమీపంలో ఉన్న అంతర్రాష్ట్ర వంతెన కోతకు గురైంది. శుక్రవారం అర్ధరాత్రి వచ్చిన భారీ వరద తాకిడికి మహారాష్ట్ర వైపు ఉన్న చివరిభాగం దెబ్బతిన్నది. అక్కడ వంతెనకు ఆనుకుని పోసిన గ్రావెల్, ఎర్రమట్టి కుంగిపోయింది. గత ఏడాది జూలైలో కూడా ఇదే ప్రాంతంలో కోతకు గురై 20 రోజుల పాటు రాకపోకలు నిలిచిపోవడం గమనార్హం. -
పెన్ గంగ కాలువ వద్ద పులుల సంచారం.. టెన్షన్లో గ్రామస్తులు
సాక్షి, హైదరాబాద్: ఆదిలాబాద్ జిల్లాలోని పెన్‌గంగ కాలువలో పెద్ద పులులు సంచరించడం చుట్టుపక్కల గ్రామాల ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. జైనత్ మండలంలోని గూడ గ్రామ శివారులో ఉన్న పెన్‌గంగ కాలువలో మంగళవారం ఉదయం రెండు పెద్ద పులులు కనిపించాయి. కాలువ మధ్యలో పెద్ద పులులు నడుచుకుంటూ వెళ్లడం స్థానికులు గమనించారు. ఈ సందర్భంగా కొందరు యువకులు పులులు తిరుగుతుండటాన్ని తమ సెల్ఫోన్లతో వీడియో తీశారు. అయితే, ఈ పులులు మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ వైల్డ్ లైఫ్ సంక్చూరీ నుంచి వచ్చి ఉంటాయని అనుమానిస్తున్నారు. పులుల సంచారంపై ప్రాజెక్టు ఇంజనీర్లు.. అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. పులి సంచారం నేపథ్యంలో చుట్టపక్కల గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు వారిని అప్రమత్తం చేశారు. కాగా, ఇటీవలి కాలంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని పలు ప్రాంతాల్లో పెద్ద పులుల సంచారం పెరిగింది. పలుచోట్ల పశువులపై దాడి చేసిన ఘటనలు స్థానికంగా కలకలం సృష్టించాయి. -
గంగను మళ్లించి.. ఇసుకను తరలించి
ఆదిలాబాద్ జిల్లాలో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. జిల్లా సరిహద్దులో పారుతున్న పెన్‌గంగ నుంచి అక్రమంగా ఇసుక తరలించుకుపోతున్నారు. ప్రస్తుతం వేసవి కావడంతో నదిలో నీటి ప్రవాహం తగ్గింది. దీంతో ఏకంగా ప్రొక్లెయిన్‌తో నదిని తోడేస్తున్నారు. నదిలోని నీటిపాయకు అడ్డుకట్ట వేసి ప్రవాహాన్ని మళ్లించి పగలు, రాత్రి తేడా లేకుండా వందలాది ట్రాక్టర్లతో ఇసుకను తరలించుకుపోతున్నారు. జైనథ్, బేల మండలాల పరిధిలోని సాంగ్వి, అనంతపూర్, సాంగిడి, బెదోడ గ్రామాల శివారు నుంచి ఇసుక దోపిడీ జోరుగా సాగుతోంది. అయినా అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదు. ఇసుక అక్రమ రవాణా వెనుక అధికారులు, ప్రజాప్రతినిధుల హస్తం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. – చింతల అరుణ్‌రెడ్డి, సాక్షి ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్ -
కింద నది.. పైన కాలువ
సాక్షి, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో సాత్నాల నదిపై నుంచి కాలువ ప్రవహించేందుకు వీలుగా కొత్త పద్ధతిలో వంతెన నిర్మిస్తున్నారు. సాగునీటిని నదికి అవతలివైపు తరలించేందుకు ఆర్సీసీ షెల్ఫ్‌తో పిల్లర్లపై కాలువను కడుతున్నారు. ఈ మధ్యే నిర్మాణం పూర్తవడంతో అధికారులు, ఇంజనీర్లు కలిసి కాలువ లోపల పరిశీలించారు. వాహనంలో తీసుకొచ్చి.. ఒక్కొక్కటిగా బిగించి.. ఆదిలాబాద్ జిల్లాలో చనాఖా–కొరాటా బ్యారేజీ కింద లోయర్ పెన్‌గంగ ప్రాజెక్టు మెయిన్ కెనాల్‌ను 42 కిలోమీటర్ల పరిధిలో రూ.207.32 కోట్లతో నిర్మిస్తున్నారు. ఇందులో భాగంగా జైనథ్, బేల మండలాలకు కాలువ నీటిని మళ్లించే మధ్యలో సాత్నాల నది ఉంది. దీంతో నదిపై 1.675 కిలోమీటర్ల మేర పిల్లర్లు నిర్మించి కాలువ కడుతున్నారు. సిమెంట్ కాంక్రీట్‌తో చేసిన షెల్ఫ్‌లను (ఒక్కొక్కటి 250 టన్నుల బరువు ఉంటుంది) ఓ వాహనంలో తీసుకొచ్చి ఒక్కొక్కటిగా బిగిస్తున్నారు. పిల్లర్ల ఎత్తు 35 మీటర్ల నుంచి 40 మీటర్ల వరకు ఉంటుంది. కాలువ ద్వారా రెండు మండలాల్లోని 37 వేల ఎకరాలకు సాగునీరు అందించనున్నారు. కాలువ లోపల నడిచి.. ఎలాగుందో చూసి.. 68 పిల్లర్లపై 67 షెల్ఫ్‌లను బిగించేందుకు చేపట్టిన పనులు తుది దశకు వచ్చాయి. 24.4 మీటర్ల పొడవు, 5.2 మీటర్ల వెడల్పు, 3.2 మీటర్ల ఎత్తుతో నిర్మితమైన ఈ షెల్ఫ్‌ల ద్వారా 420 క్యూసెక్కుల సాగునీటిని తరలించవచ్చని అధికారులు చెబుతున్నారు. పనులు తుది దశకు చేరుకోవడంతో జల వనరుల శాఖాధికారులు, కాంట్రాక్టర్లు కలిసి ఈ వయాడక్ట్ మార్గంలో పయనించి పరిశీలించారు. -
చనాకా–కొరటకు వన్యప్రాణి సంరక్షణ అనుమతి
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెనుగంగ నదిపై మహారాష్ట్ర, తెలంగాణ సాగు, తాగునీటి అవసరాలు తీర్చేలా చేపట్టిన చనాకా–కొరట బ్యారేజీ నిర్మాణానికి కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ పరిధిలోని వన్యప్రాణి సంరక్షణ బోర్డు స్టాండింగ్ కమిటీ శుక్రవారం అనుమతినిచ్చింది. ప్రాజెక్టు పర్యావరణ అనుమతుల్లో భాగంగా గతనెల 24న ప్రాజెక్టుపై పర్యావరణ శాఖమంత్రి ఆధ్వర్యంలోని స్టాండింగ్ కమిటీ ఈ ప్రాజెక్టు అనుమతులపై చర్చించింది. 0.80 టీఎంసీ సామర్థ్యంతో రూ.368 కోట్లతో బ్యారేజీ చేపట్టారు. 13,500 ఎకరాల ఆయకట్టు తెలంగాణలో, మరో 3 వేల ఎకరాల ఆయకట్టు మహారాష్ట్రలో దీనిద్వారా సాగు జరగనుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణం మహారాష్ట్రలోని తాపేశ్వర్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి దగ్గరగా ఉంది. దీనికి ఎకో సెన్సిటివ్ జోన్ పరిధిలో 213.48 హెక్టార్ల అటవేతర (నాన్ ఫారెస్ట్) భూమి అవసరం కానుండగా, మరో 5 వేల హెక్టార్ల అటవేతర భూమి రెండు రాష్ట్రాల్లోని బ్యారేజీ నిర్మాణం, ముంపు ప్రాంతంలోకి వస్తుంది. దీని పర్యావరణ అనుమతుల కోసం ప్రభుత్వం కమిటీకి పంపగా, అటవీ భూముల్లో ఎలాంటి నిర్మాణాలు జర గడం లేదని, ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతం వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి దూరంగా ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తూ అనుమతులు జారీచేసింది. అయితే సంరక్షణ కేంద్రానికి చుట్టు పక్కల పెద్ద శబ్దాలొచ్చే యంత్రాలను వాడరాదని, కెనాల్ పనుల నిమిత్తం ఉండే కార్మికుల క్యాంపులు సంరక్షణ కేంద్రానికి దూరంగా ఉండాలని, అటవీ శాఖకు కెనాల్ నీటిని పూర్తి ఉచితంగా అందించాలని షరతులు విధించింది. చదవండి: Sitarama project: ముంపు సంగతేంటి...? -
పెన్‌గంగను తోడేస్తున్నారు..
సాక్షి, తాంసి(ఆదిలాబాద్) : ఇసుక వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలు అనే చందంగా తయారైంది. ఇసుకను అక్రమంగా తరలిస్తూ వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. పట్టించుకోవాల్సిన అధికారులు ఆ వైపుగా చూడకపోవడంతో అక్రమార్కులు యథేచ్ఛగా ఇసుకను తరలిస్తూ కుబేరులుగా అవతారమెత్తుతున్నారు. వర్షాకాలం ప్రారంభమైనప్పటికీ పెన్‌గంగాను తోడేయం మానడం లేదు. రోజుకు 50 ట్రాక్టర్ ట్రిప్పులను తరలిస్తున్నా అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. నిత్యం రవాణా... భీంపూర్ మండలంలోని తాంసి(కె) వద్ద పెన్‌గంగా నదిలో నుంచి నిత్యం పదుల సంఖ్యల్లో ట్రాక్టర్లలో ఇసుకను తరలిస్తున్నా సంబంధిత అధి కారులు పట్టించుకోకపోవడంతో ఇష్టానుసారంగా ట్రాక్టర్ల ద్వారా పెన్‌గంగా నది నుంచి ఇసుకను తోడేస్తున్నారు. తాంసి (కె) సమీపంలో పె న్‌గంగా నది నుంచి నిత్యం పిప్పల్‌కోటి గ్రా మం మీదుగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంతో పాటు వివిధ మండలాలోని వివిధ గ్రామాలకు ట్రాక్టర్లలో పరిమితికి మించి ఇసుకను తరలిస్తున్నారు. యథేచ్ఛగా వ్యాపారం... ఇసుక రవాణాను అధికారులు చూసిచూడనట్లుగా వ్యవహరించడంతో అక్రమ వ్యాపారులు జోరుగా ఇసుక తరలిస్తూ నిల్వ చేసుకుంటున్నారు. పెన్‌గంగా నదితీరం నుంచి గంగాపై భాగంలో ఇసుకను రవాణా చేసే వ్యాపారులు ఇసుక డంప్పులను ఏర్పాటు చేసి ఇసుకను నిల్వ చేసుకుంటున్నారు. పెన్‌గంగా నది నుంచి నిత్యం పదుల సంఖ్యలో ట్రాక్టర్లలో ఇసుకను తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్న వ్యాపారులు ఇసుక కొరతను సృష్టించి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. వర్షాకాలం పెన్‌గంగా నదిలోకి వరదనీరు చేరితే ఇసుక తీసే అవకాశం ఉండది. ప్రస్తుతం గంగలో నుంచి కూలీల ద్వారా ఇసుకను తీసుకువచ్చి గంగనది తీరంలో మైదాన ప్రాంతంలో డంప్పులను ఏర్పాటు చేస్తున్నారు. ఇసుక రవాణా ఇలా.... భీంపూర్ మండలంలోని అంతర్గాం, వడూర్, తాంసి(కె) గ్రామాల పరిహక ప్రాంతాల నుంచి పెన్‌గంగా నది ప్రవహిస్తుంది. వడూర్, అంతర్గాం గ్రామాల సమీపంలో ప్రస్తుతం వరదనీరు గంగలోకి రావడంతో ఇసుక తీసే వీలులేక ప్రస్తుతం తాంసి(కె) నుంచి పిప్పల్‌కోటి మీదుగా కప్పర్ల, బండల్‌నాగాపూర్, పొచ్చేర, లేకపోతే సావర్గాం, జంధాపూర్ గ్రామాల మీదుగా జిల్లా కేంద్రానికి ఇసుకను తరలిస్తున్నారు. తాంసి(కె) వద్ద గంగాలోని ఇసుక బాగుండడంతో భారీ రేటు కూడా పలుకడంతో ట్రాక్టర్ల యాజమానులు, వ్యాపారులు పెన్‌గంగ నది నుంచి ఇసుకను యథేచ్ఛగా తరలిస్తున్నారు. రోజుకు ట్రాక్టర్ ద్వారా ఒక్కొ ట్రాక్టర్ ద్వారా రెండు ట్రిప్పుల ఇసుకను తరలిస్తున్నారు. ఒక్కో ట్రాక్టర్ ట్రింపు ఇసుకను రూ.3వేలకు విక్రయిస్తున్నారు. ఇలా నిత్యం పదుల సంఖ్యలో ట్రాక్టర్లలో ఇసుకను తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. కాసులు కురిపిస్తున్న ఇసుక దందా... ఇసుకకు ప్రస్తుతం డిమాండ్ పెరగడంతో వ్యాపారులకు కాసులు కురిపిస్తున్నాయి. గ్రామాలలోని ప్రతి ఒక్కరూ ట్రాక్టర్‌ను కొనుగోలు చేసి ఇసుక దందాను ఎంచుకుంటున్నారు. ఎటువంటి డబ్బులు చెల్లించకుండా ఇసుకను తోడుకుని అమ్ముకోవడంతో వ్యాపారులకు కాసుల వర్షం కురుస్తుంది. గ్రామాలలో స్థానికంగా ఉన్న చిన్నచిన్న అవసరాల మేరకు ఇసుకను వాడుకునేందుకు ఇచ్చిన అవకాశాన్ని దర్వినియోగం చేస్తూ కాంట్రాక్టర్లకు, ఇతర అవసరాలకు ఇసుకను రవాణా చేస్తూ కాసులు సంపాదించుకుంటున్నారు. కొరవడిన అధికారుల పర్యవేక్షణ ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టాలి. సంబంధిత అధికారుల పర్యవేక్షణ కోరవడడంతో ఇసుకు పెన్‌గంగా నది నుంచి యథేచ్ఛగా తరలిస్తున్నారు. ఇసుక తరలిస్తూ ట్రాక్టర్లు పట్టుబడితే నామమాత్రంగా జరిమానా విధిస్తూ చూసిచూడనట్లు వ్యవహరించడంతో ఇసుక వ్యాపారులు తమ పంథాను మార్చుకోకుండా ఇసుకను తరలిస్తున్నారు. కఠిన చర్యలు తీసుకుంటాం మండలంలోని తాంసి(కె) గ్రామం సమీ పంలో పెన్‌గంగా నది నుంచి వ్యాపారులు ఇసుకను అక్రమంగా తరలిస్తున్నట్టు తమ దృష్టికి వచ్చింది. ఇప్పటికే ఇసుక తరలి స్తున్న ట్రాక్టర్లను పట్టుకుని జరిమానా వి ధించడం జరిగింది. పెన్‌గంగ నుంచి ఇసుకను నిబంధనలకు విరుద్ధంగా రవాణా చే స్తే కేసులు నమోదు చేసి వాహనాలు సీజ్ చేస్తాం. – మల్లేష్, భీంపూర్ తహసీల్దార్ -
పెన్‌గంగకు పాలాభిషేకం
జైనత్ (ఆదిలాబాద్) : ఆదిలాబాద్ జిల్లాలోని జైనత్ మండలం డొల్లార గ్రామంలో పెన్‌గంగా నదికి సోమవారం ఘనంగా పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అటవీ శాఖ మంత్రి జోగు రామన్న ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనతో పాటు స్థానిక ఎమ్మెల్యే బాపూరావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. -
ఉధృతంగా పెన్‌గంగ
సిర్పూర్(టి) : నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దుల్లో ప్రవహిస్తున్న పెన్‌గంగా నది ఉప్పొంగుతోంది. సిర్పూర్(టి) మండలంతోపాటు సమీపంలోని మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షాలతోపాటు మహారాష్ట్రలోని వార్దా నదిపై ఉన్న ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయడంతో పెన్‌గంగ ఉప్పొంగి ప్రవహిస్తోంది. మంగళవారం పెన్‌గంగ నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో మండల ప్రజలతోపాటు సమీపంలోని మహారాష్ట్ర గ్రామాల ప్రజ లు భయాందోళనలకు గురయ్యారు. పెన్‌గంగ వంతెన పైకప్పుకు ఆనుకుని వరదనీరు ప్రవహిస్తుండటంతో ఏ క్షణమైనా రాకపోకలు స్తంభిస్తాయని సమీప గ్రామాల ప్రజలు తమ తమ గ్రామాలకు చేరుకుంటున్నారు.