సాక్షి, హైదరాబాద్: ఆదిలాబాద్ జిల్లాలోని పెన్‌గంగ కాలువలో పెద్ద పులులు సంచరించడం చుట్టుపక్కల గ్రామాల ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. జైనత్ మండలంలోని గూడ గ్రామ శివారులో ఉన్న పెన్‌గంగ కాలువలో మంగళవారం ఉదయం రెండు పెద్ద పులులు కనిపించాయి.
కాలువ మధ్యలో పెద్ద పులులు నడుచుకుంటూ వెళ్లడం స్థానికులు గమనించారు. ఈ సందర్భంగా కొందరు యువకులు పులులు తిరుగుతుండటాన్ని తమ సెల్‌ఫోన్లతో వీడియో తీశారు. అయితే, ఈ పులులు మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ వైల్డ్ లైఫ్ సంక్చూరీ నుంచి వచ్చి ఉంటాయని అనుమానిస్తున్నారు. పులుల సంచారంపై ప్రాజెక్టు ఇంజనీర్లు.. అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.
పులి సంచారం నేపథ్యంలో చుట్టపక్కల గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు వారిని అప్రమత్తం చేశారు. కాగా, ఇటీవలి కాలంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని పలు ప్రాంతాల్లో పెద్ద పులుల సంచారం పెరిగింది. పలుచోట్ల పశువులపై దాడి చేసిన ఘటనలు స్థానికంగా కలకలం సృష్టించాయి.
Comments
Please login to add a commentAdd a comment