రైతు కంట్లో ఇసుక | sand loot in chittoor district | Sakshi
Sakshi News home page

రైతు కంట్లో ఇసుక

Published Mon, May 1 2017 10:04 AM | Last Updated on Tue, Sep 5 2017 10:08 AM

రైతు కంట్లో ఇసుక

రైతు కంట్లో ఇసుక

► బరితెగించిన మాఫియా
► జిల్లాలో యథేచ్ఛగా ఇసుక దోపిడీ
► రోజూ తమిళనాడుకు 200 పైగా లారీలు
► మరో 150 లారీలకు పైనే కర్ణాటక రాష్ట్రానికి
► అధికారులకు నెలకు రూ.30 లక్షల మామూళ్లు
► ఇసుక దొంగలతో అధికార పార్టీ నేతల కుమ్మక్కు

జిల్లాలో ఇసుక బకాసురుల అవతారమెత్తిన టీడీపీ నేతల ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. నదులు, చెరువులు, కుంటలు.. ఇలా దేన్నీ వదలడం లేదు. ‘ఉచితం’ మాటున అందిన కాడికి అడ్డంగా తోడేస్తున్నారు. ఎదురు తిరిగిన వారికి నరకం చూపిస్తున్నారు. అనేక రకాలుగా ఇబ్బందుల పాలు చేసి కక్ష తీర్చుకుం టున్నారు.

వీరితో కుమ్మక్కయిన పోలీసు, రెవెన్యూ, మైనింగ్‌ అధికారులు రెండు చేతులా సంపాదిస్తున్నారు. ఇందులో పోలీసులదే పెద్ద చేయిగా కనిపిస్తోంది. స్వర్ణముఖినది పరీవాహక ప్రాంతం ఎక్కువగా ఉన్న శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గాల్లో పనిచేసే సీఐలు, ఎస్‌ఐలకు నెలకు రూ. 30 లక్షల మేర మామూళ్లు అందుతున్నట్లు సమాచారం. 

సాక్షి ప్రతినిధి, తిరుపతి : జిల్లాలో ఇసుక మాఫియా అరాచకాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. అధికారులతో చేతులు కలిపి రైతుకు చుక్కలు చూపిస్తున్నారు. సాగు, తాగునీరులేకుండా వారి నోట్ల ఇసుక కొడుతున్నారు. జిల్లాలోని శ్రీకాళహస్తి, ఏర్పేడు, సత్యవేడు, చిత్తూరు, నగరి, కుప్పం, పలమనేరు, పూతలపట్టు ప్రాంతాల్లో ఇసుక దోపిడీ మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది.

ఏర్పేడు సంఘటనతో ఆరు రోజులు ఆగినా ఆపై యథాతథంగా కొనసాగుతోంది. ఇసుకాసురుల ఆగడాలకు జిల్లాలోని నదులన్నీ వాటి స్వరూపాన్ని  కోల్పోతున్నాయి. చెరువులు, బావులు బావురమంటున్నాయి. జిల్లాలోని స్వర్ణముఖి, పాలారు, నీవా, కాళంగి, కౌండిన్య నదుల్లో దాదాపు 70 శాతం ఇసుక దోపిడీకి గురైనట్లు అంచనా.
ఆ ఉదంతంతో మరింత దోపిడీ

కృష్ణా జిల్లా ముసునూరు తహసీల్దార్‌ వనజాక్షిపైదెందలూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ దాడి చేశాడు. ఇసుక అక్రమ తరలింపును అడ్డుకున్న వనజాక్షిని సీఎం అభినందించక పోగా  ఆమె మానసిక స్థైర్యాన్ని దెబ్బతీశారు. దీంతో జిల్లాలోని అధికారులందరూ ఇసుక దందాను అరికట్టే విషయంలో వెనుకంజ వేయడం మొదలు పెట్టారు. చిత్తూరు జిల్లాలో నిన్నా మొన్నటి వరకూ పనిచేసిన కలెక్టర్‌ ఇసుక దోపిడీపై ఏ మాత్రం దృష్టి పెట్టలేదన్నది బహిరంగ సత్యం.

పోలీసులు, మైనింగ్‌ శాఖలను అప్రమత్తం చేయకపోగా, నోరు తెరవలేని రెవెన్యూ అధికారులను ఇసుక తరలింపు మండలాలకు తహసీల్దార్లుగా నియమించారు. దీనికి తోడు కొంత మంది సీఐలు, ఎస్‌ఐలు మాఫియా నేతలతో మైత్రీబంధాలను బలపర్చుకుని నెలసరి మామూళ్లకు అలవాటు పడ్డారు. దీంతో రెండేళ్లుగా ఇసుక తరలింపు ఊపందుకుంది.

ఎక్కడెక్కడి నుంచి ఎటు వైపు..
జిల్లాలోని శ్రీకాళహస్తి, ఏర్పేడు, సత్యవేడు, తొట్టంబేడు, వరదయ్యపాళెం మండలాల్లో ఎక్కువ ఇసుకను తోడేస్తున్నారు. ప్రభుత్వం ఉచితమని ప్రకటించాక ఇక్కడి దోపిడీ మరింత ఎక్కువైంది. శ్రీకాళహస్తి మండలలోని చుక్కలనిడిగల్లు, పుల్లారెడ్డి కండ్రిగ, అమ్మపాళెం, తొండమనాడులోనూ,  ఏర్పేడు మండలం మునగలపాలెం, గోవిందాపురం  సరిహద్దుల్లో స్వర్ణముఖిని కేంద్రంగా చేసుకుని రోజూ వందల ట్రక్కుల్లో ఇసుకను తరలిస్తున్నారు.

ఈ ప్రాంతంలో ఇసుక దోపిడీకి నాయకత్వం వహిస్తోన్న టీడీపీ నేత ధనుంజయలునాయుడు గ్రామమైన గోవిందాపురంలో ఒక్కో ఇంట్లో మూడేసి ట్రాక్టర్లు ఉన్నాయి. ఇసుక తరలింపు కోసమే ఇక్కడ కొంత మంది ట్రాక్టర్లు కొన్నారు. ఇక్కడి టీడీపీ నాయకులు రెండేళ్లలో ఇసుక దోపిడీ ద్వారా వందల కోట్లు సంపాదించారని సమాచారం. ఆరోపణలు ఎదుర్కొంటున్న ధనుంజయలు నాయుడు రూ.2 కోట్లతో తిరుపతిలో ఇల్లు నిర్మించుకుంటున్నాడంటే  అధికార పార్టీ నేతల అక్రమ సంపాదన ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది.

పోలీసుల పాత్రే కీలకం
జిల్లాలో ఇసుక మాఫియాతో పోలీసులు మిలాఖత్‌ అయ్యారు. ప్రధానంగా శ్రీకాçళహస్తి, సత్యవేడు, ఏర్పేడు, రేణిగుంట స్టేషన్లలో పనిచేసే కొందరు పోలీస్‌ అధికారుల పేర్లు బాగా ప్రచారంలో ఉన్నాయి. ఏర్పేడు దుర్ఘటన బాధితులను పరామర్శించేందుకు మునగలపాలెం వచ్చిన ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఆ గ్రామ బాధితులు సీఐ సాయినాథ్‌పై ఎక్కువగా ఫిర్యాదు చేశారు. రాజీ చర్చల పేరిట సీఐ గ్రామస్తులను నిర్లక్ష్యం చేశాడని, ఇసుక మాఫియాకు సహకారం అందించారని చెప్పారు.

అదేవిధంగా ఏర్పేడు ఎస్‌ఐ రామకృష్ణపై కూడా ఆరోపణలున్నాయి.  దీన్ని గుర్తించిన ప్రభుత్వం ఈ మధ్యనే సీఐని వీఆర్‌కు పంపి, ఎస్‌ఐని సస్పెండ్‌ చేసింది. అయినప్పటికీ ఈ ప్రాంతాల్లో పనిచేసే పోలీస్‌ అధికారుల్లో  ఏ మాత్రం మార్పు కనిపించడం లేదు. శ్రీకాళహస్తి, సత్యవేడు, తొట్టంబేడు, వరదయ్యపాళెం పోలీసుల పాత్ర కీలకంగా ఉన్నట్లు తెలిసింది. తమిళనాడు వెళ్లే ఇసుక లారీలన్నీ వరదయ్యపాళెం స్టేషన్‌ మీదగానే వెళ్లాలి. ఈ నేపథ్యంలో ఇక్కడున్న పోలీసు అధికారులు మాఫియాతో కుమ్మక్కై ముడుపులు తీసుకుంటున్నారన్నది ఆరోపణ.

జిల్లా అంతటా ఇదే తంతు
 చిత్తూరు, పలమనేరు, కుప్పం, నగరి ప్రాంతాల్లోనూ ఇసుక భారీగా దోపిడీకి గురవుతోంది. పలమనేరు నియోజకవర్గం నుంచి నిత్యం 60కి పైగా లారీలోడ్లు రాష్ట్ర సరిహద్దులు దాటుతోంది. కృష్ణాపురం, సముద్రపల్లె, పెంగరకుంట, రామాపురం, ముసలిముడుగు గ్రామాలకు పక్కనే ఉన్న కౌండిన్య నది నుంచి ఇసుక తోడేస్తున్నారు. అధికార పార్టీకి చెందిన ఓ మండలస్థాయి టీడీపీ నేత నేరుగా ఇసుకను కర్ణాటకకు తరలిస్తున్నాడు.

చంద్రగిరి నియోజకవర్గంలోని స్వర్ణముఖి నుంచి రాత్రిపూట అధికార పార్టీ నాయకులు ఇసుకను తరలిస్తున్నారు. గాజులేరు, ఎర్రావారిపాలెం, కప్పలేరు ప్రాంతాల్లో భారీగా ఇసుక చోరీ జరుగుతోంది.  బహుదానది నుంచి ఎక్కువ మొత్తంలో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. శాంతిపురం మండలం సోగడబళ్లచెరువు, చేగడదిన్నెచెరువు, రెడ్డపల్లె, పాలారు వంకల నుంచి నిత్యం ఇసుక దోపిడీ జరుగుతుంది.

పరారీలో ఇసుకాసురులు
కాగా ఏర్పేడు సంఘటన తరువాత శాండ్‌ మాఫియాతో ప్రత్యక్ష సంబంధాలున్న టీడీపీ నేతల్లో వణుకు మొదలైంది. వ్యవహారం ఎటు తిరిగి తమ మెడకు చుట్టుకుంటుందోనన్న భయంతో ఎక్కువ మంది ఇసుకాసురులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. చాలా మంది బెంగళూర్, చెన్నై, హైదరాబాద్‌ నగరాల్లో తలదాచుకున్నట్లు సమాచారం. వీరిని వెతికి పట్టుకునే విషయంలో జిల్లా పోలీసులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement