మట్టి దందా | Sand Mafia In Anantapur | Sakshi
Sakshi News home page

మట్టి దందా

Published Mon, Aug 27 2018 11:58 AM | Last Updated on Tue, Aug 28 2018 8:41 PM

Sand Mafia In Anantapur - Sakshi

మట్టి తవ్వేందుకు ఉపయోగిస్తున్న హిటాచీ

డి.హీరేహాళ్‌(రాయదుర్గం): రాయదుర్గం నియోజకవర్గంలో అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు యథేచ్ఛగా మట్టి దందా కొనసాగిస్తున్నారు. అసైన్డ్,చుక్కల భూములు, వంకపోరంబోకు భూములను ఎంచుకుని ఇష్టానుసారంగా తవ్వి మట్టిని మెక్కేస్తున్నారు. ఈ అక్రమార్కులకు మంత్రి కాలవ శ్రీనివాసులు అండగా నిలుస్తుండటంతో రెవెన్యూ, పోలీస్‌ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు.  

పది మందితో గ్యాంగ్‌
డి.హీరేహాళ్‌ మండలంలోని ఓబుళాపురం ఐరన్‌ ఓర్‌కు దేశంలోనే పేరుగాంచింది. గత సర్పంచ్‌ ఎన్నికల్లో సీపీఐ తరఫున పోటీ చేసిన వెంకటేశులు విజయం సాధించారు. అయితే 2014 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడంతో ఆయన కూడా ఆ పార్టీలో చేరాడు. గ్రామ ప్రథమ పౌరుడిగా, పెద్దమనిషిగా ఆదర్శంగా ఉండాల్సిన ఆయనే ఆదాయం కోసం అక్రమ మార్గం ఎంచుకున్నాడు. చిదానందస్వామి, బసవరాజు, రాజ, రామి, తిప్పేస్వామి, మాజీ సర్పంచ్‌ తిమ్మప్ప తదితర పది మంది సభ్యులతో గ్యాంగ్‌ (ముఠా)ను ఏర్పాటు చేసుకుని మట్టి దందాకు తెరలేపాడు.  

రోజుకు 50–80 ట్రిప్పుల మట్టి తరలింపు
ఓబుళాపురం పంచాయతీ పరిధిలోని బీఐఓపీ ఫ్యాక్టరీ పక్కన, కొత్త సుగ్గులమ్మ దేవాలయ సమీపాన సర్వే నంబర్‌ 124ఏ లో ఉన్న నాలుగెకరాల వంకపోరంబోకు భూమిని ఎంచుకున్నాడు. నిరంతరం తన గ్యాంగ్‌తో నలువైపులా నిఘా పెట్టించాడు. రాత్రి 9 నుంచి తెల్లవారుఝామున 4.30 గంటల వరకు హిటాచీతో ఇష్టారాజ్యంగా మట్టితవ్వకాలు చేయిస్తున్నాడు. రోజుకు 50 నుంచి 80 ట్రిప్పుల వరకు మట్టిని కర్ణాటకకు తరలించి సొమ్ము చేసుకుంటున్నాడు. ఇదే ప్రదేశంలో గతంలో నీరు – చెట్టు కార్యక్రమం ద్వారా మట్టి తవ్వకం పనులు చేసినట్లు చూపి వెంకటేశులు రూ.20 లక్షలు నొక్కేసినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

రోజు ఆదాయం లక్ష పైమాటే
కర్ణాటకకు చెందిన వ్యాపారులతో టిప్పర్‌ మట్టిని రూ.1,500 ఇచ్చేలా బేరం కుదుర్చుకున్నాడు. రోజుకు 50 నుంచి 80 టిప్పర్ల మట్టిని అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటున్నాడు. అలా రోజుకు రూ.75 వేల నుంచి లక్షకు పైబడి అక్రమార్జన చేస్తున్నాడు.ఈ తతంగం గత సంవత్సర కాలంగా జరుగుతున్నా అధికారులు పట్టించుకోలేదు.  

ఎవరితోనైనా చెప్పుకోండి..
మట్టి దందా విషయం ఎవరైనా మాట్లాడితే ‘రెవెన్యూ గానీ, పోలీస్‌ అధికారులు గానీ ఎవరూ ఏమీ చేసుకోలేరు’ అంటూ మాజీ సర్పంచ్‌ వెంకటేశులు నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నాడు. అంతే కాదు ‘మంత్రి అండగా ఉన్నాడు. ఎవరితోనైనా  చెప్పుకోండి’ అంటూ రెచ్చిపోతున్నాడు. ఈ మట్టి దందాలో టీడీపీ నాయకులతో పాటు మంత్రికి కూడా వాటాలు ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.  

రాత్రి వేళ అక్కడకు వెళితే అంతే..
మట్టి తవ్వకాలు జరిపే ప్రదేశానికి ఎవరైనా వెళితే టిప్పర్లతో ఢీకొట్టించి మట్టుపెట్టే యత్నాలు కూడా గతంలో జరిగాయని బాధితులు వాపోతున్నారు. టిప్పర్‌ లైట్లు బంద్‌ చేసి వెనుక నుంచి వచ్చి గుద్ది చంపేందుకు కూడా వెనుకాడబోరని చెబుతున్నారు. అలా కొంతమంది తప్పించుకు వచ్చినట్లు తెలిపారు. మట్టిమాఫియా రెచ్చిపోవడానికి మంత్రి కాలవ శ్రీనివాసులే కారణమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఎంతటివారైనా ఉపేక్షించం
ఓబుళాపురం పంచాయతీ పరిధిలోని బీఐఓపీ ఫ్యాక్టరీ వద్ద వంక పొరంబోకు భూమిలో మట్టిని తవ్వి కర్ణాటకకు తరలిస్తున్నట్లు నా దృష్టికి వచ్చింది. మా సిబ్బందితో నిఘా పెట్టించాం. తాజామాజీ సర్పంచ్‌ వెంకటేశులు మట్టి దందాకు పాల్పడినట్లు తెలిసింది. అక్రమాలకు పాల్పడేవారు ఎంతటివారైనా ఉపేక్షించేది లేదు. చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం.    – ఖతిజిన్‌కుఫ్రా, తహసీల్దార్, డి.హీరేహాళ్‌   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement