ఇసుక మాఫియాకు మరింత ఊతం
రీచ్‌ల నిర్వహణ
సెర్ఫ్ నుంచి మైనింగ్ శాఖకు
అప్పుడే రీచ్‌లపై కన్నేసిన టీడీపీ నేతలు
వేలం పాటలవైపే సర్కార్ మొగ్గు
విశాఖపట్నం: మళ్లీ ఇసుక మాఫియా రెచ్చిపోనుంది. గతంలో మాదిరిగానే సిండికేట్లు చక్రం తిప్పనున్నారు. డ్వాక్రా సంఘాల ముసుగులో ఇన్నాళ్లు ఇసుక రీచ్‌లు, డిపోలను తమ గుప్పెట్లో పెట్టుకుని రెండుచేతులా ఆర్జించిన టీడీపీ నేతలు ఇప్పుడు నేరుగా రీచ్‌లను తమపరం చేసుకునేందుకు చాపకింద నీరులా ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇసుక రీచ్‌ల నిర్వహణను సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ (సెర్ఫ్) నుంచి మైనింగ్ శాఖకు బదలాయిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మాఫియాకు మళ్లీ ఊతమిచ్చి నట్టర ుు్యంది. వివాదాలు చుట్టుముట్టినా.. అవినీతి ఆరోపణలు వెల్లువెత్తినా ఉన్నంతలో ఇసుక రీచ్‌ల నిర్వహణ..అమ్మకాల్లో మాఫియా ఆగడాలకు కొంత గండిపడిందనే చెప్పాలి.
ఏడాదిన్నర క్రితం డ్వామా నుంచి సెర్ఫ్‌కు అప్పగించగా, డ్వాక్రా రుణ మాఫీ విషయంలో చేతులెత్తేసిన సర్కార్ వారిని శాంతపరిచేందుకు ఇసుకరీచ్‌ల నిర్వహణను అప్పగిస్తున్నట్టు గొప్పగా చెప్పుకుంది. పైగా వచ్చే ఆదాయంలో 25 శాతం డ్వాక్రా సంఘాలకే ఇస్తామని నమ్మబలికింది. కాని ఆచరణలో వారిని కూలీల కంటే హీనంగా చూస్తూ కేవలం క్యూబిక్ మీటర్‌కు రూ.25 మాత్రమే ముట్టజెప్పింది. ఈ మొత్తాన్ని పూర్తి స్థాయిలో చెల్లించిన పాపాన పోలేదు. డ్వాక్రా సంఘాల మాటున టీడీపీ నేతలు రీచ్‌లను తమ గుప్పెట్లో పెట్టుకుని కోట్లకు పడగలెత్తారు. పేరు డ్వాక్రా మహిళలది.. పెత్తనం పచ్చనేతలది అన్నట్టుగా ఇన్నాళ్లు రీచ్‌ల నిర్వహణ సాగింది. గతంలో సిండికేట్లుగా అవతారమెత్తి ప్రభుత్వాదాయానికి భారీగా గండికొట్టిన ఇసుకాసురులు సంఘాల మాటున చక్రం తిప్పేవారు. వీరి ఆగడాల ముందు రీచ్‌ల వద్ద సీసీ కెమెరాలు, లారీలకు జీపీఎస్‌లు ఏవీ పనిచేయలేదు. దీంతో లక్షాలాది టన్నుల ఇసుక గుట్టుచప్పుడు కాకుండా జిల్లాలు, రాష్ట్రాలు దాటిపోయేది. జన్మభూమి కమిటీల పర్యవేక్షణలో టీడీపీ ఎమ్మెల్యేలు తమ పరిధిలోని రీచ్‌లపై పెత్తనం సాగించేవారు. జిల్లాలో పదేళ్ల తర్వాత డీ నోటిఫై చేసిన 25 రీచ్‌ల్లో మూడు లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక వెలికితీయగా, అనధికారికంగా మరో మూడులక్షల క్యూ.మీ. వరకు పిండేశారు. ఇసుకకు కృత్రిమ కొరత సృష్టిస్తూ మూడు యూనిట్ల లారీ ఏకంగా పాతిక వేలు పలికేలా చేశారు. దీంతో సామాన్యులకు ఇసుక గగనంగా మారింది. లక్షలాది మంది నిర్మాణ రంగ కూలీలు పనుల్లేకుండా అల్లాడిపోయారు. పొరుగు జిల్లాల నుంచి రప్పించిన ఇసుకను కూడా తమ గుప్పెట్లో పెట్టుకుని సొమ్ము చేసుకున్నారు.
అమ్మకాల ద్వారా ప్రభుత్వ ఖజానాకు రూ.25కోట్ల ఆదాయం వస్తే పచ్చనేతల జేబుల్లోకి మరో పాతిక కోట్ల వరకు చేరినట్టు అంచనా. తొలుత సర్కార్ క్యూ.మీ. ఇసుక ధర రూ.500లగా ప్రకటిస్తే ప్రస్తుతం ప్రభుత్వ దరే రూ.1700 పలుకుతోంది. ఇక బ్లాక్‌మార్కెట్‌లో ఇసుక రేటు ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇలా మొత్తమ్మీద ఆది నుంచి సెర్ఫ్ ఆధ్వర్యంలో ఇసుక రీచ్‌ల నిర్వహణను వివాదాలు చుట్టుముట్టాయి. ఎట్టకేలకు సెర్ఫ్ నుంచి ఇసుకను పూర్తిగా మైనింగ్ శాఖకు బదలాయిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు జీవో.154ను బుధవారం రాత్రి జారీ చేశారు. ఈ నిర్ణయంతో గ్రామీణాభివృద్ధి శాఖాధికారులు కాస్త ఊపిరి పీల్చుకున్నప్పటికీ మాఫియా కు మాత్రం మరింత ఊతమిచ్చింది. రీచ్‌ల నిర్వహణను డ్వాక్రా సంఘాల నుంచి తప్పించి వేలం పాటలు నిర్వహించాలనే యోచనలో సర్కార్ ఉన్నట్టు తెలుస్తోంది.