Society for Elimination of Rural Poverty
-
మంత్రి పెద్దిరెడ్డి, అధికారులకు సీఎం జగన్ అభినందనలు
సాక్షి, తాడేపల్లి: ముఖ్యంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, సెర్ప్ సీఈఓ ఇంతియాజ్ అహ్మద్ సీఎం క్యాంపు కార్యాలయంలో మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా.. గ్రామీణ ప్రాంతాల్లో వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఆసరా పథకాల ద్వారా పేదల సుస్ధిరాభివృద్ధి కోసం సెర్ప్ (గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్ధ) చేపడుతున్న కార్యక్రమాలను ప్రశంసిస్తూ.. స్కోచ్ అందించిన గోల్డ్ అవార్డులను సీఎం వైఎస్ జగన్‌కు చూపించారు. ఈ మేరకు గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రిపెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పంచాయతీరాజ్‌శాఖ ముఖ్య కార్యదర్శి, సెర్ప్ సీఈఓలను సీఎం జగన్ అభినందించారు. చదవండి: రిజిస్ట్రేషన్ సేవలను ప్రారంభించిన సీఎం జగన్ -
3.80 లక్షల మహిళా గ్రూపులకు రూ.12,070 కోట్లు
సాక్షి, హైదరాబాద్: 2021–22 ఏడాదికి గ్రామీణ దారిద్య్ర నిర్మూలన మిషన్ (సెర్ప్) ద్వారా 3,80,162 లక్షల స్వయం సహాయక సంఘాలకు రూ.12,070 కోట్ల బ్యాంక్ లింకేజీ కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా సంక్షోభంలో ఆర్థిక ఇబ్బందులున్నప్పటికీ మహిళా స్వయం సహాయక సంఘాలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ ఆర్థిక సంవత్సరంలో సీఎం కేసీఆర్ రూ.200 కోట్లు మొదటి విడతగా మంజూరు చేశారని పంచాయతీరాజ్ శాఖమంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. మహిళా సంఘాలు తీసుకునే వడ్డీని ప్రభుత్వం చెల్లిస్తుందని, అందులో భాగంగానే ఈ మొత్తాన్ని సీఎం విడుదల చేసినట్లు చెప్పారు. గతంలో మహిళలు ప్రతి చిన్న ఖర్చుకు భర్తపై ఆధారపడే పరిస్థితినుంచి డ్వాక్రా సంఘాలు ఏర్పడిన తర్వాత వారు ఆర్థికంగా అభివృద్ధి చెందారన్నారు. -
‘డబుల్’ పింఛన్లపై వేటు!
సాక్షి, హైదరాబాద్: ఆసరా వృద్ధాప్య పింఛన్లలో అక్రమాలు జరిగినట్లు ప్రభుత్వం నిర్ధారించింది. నిబంధనలకు విరుద్ధంగా 14,975 మంది పింఛన్లను కాజేసినట్లు తేలింది. పండుటాకులకు ఆపన్నహస్తం అందించాలనే లక్ష్యంతో ప్రవేశపెట్టిన ఈ పథకంలో దంపతుల్లో ఒకరు మాత్రమే పింఛన్‌కు అర్హులు కాగా, అధికారుల కళ్లుగప్పి ఇరువురు పింఛన్ పొందుతున్నట్లు అంతర్గత విచారణలో పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) తేల్చింది. ఈ మేరకు మే నెలకు సంబంధించి దాదాపు 30 వేల (దంపతుల) మంది పింఛన్లను నిలిపివేసింది. నిబంధనలకు విరుద్ధంగా ఇన్నాళ్లూ పొందిన పింఛన్ సొమ్మును రికవరీ కూడా చేయాలని నిర్ణయించింది. అక్రమంగా పింఛన్ తీసుకున్నవారి జాబితాను తయారుచేసి మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, మున్సిపల్ కమిçషనర్లకు పంపింది. లబ్ధిదారుల జాబితాను క్షేత్రస్థాయిలో మరోసారి పరిశీలించి అర్హులు/అనర్హుల వివరాలను ప్రభుత్వానికి నివేదించాలని ఆదేశించింది. ఈ నివేదిక అనంతరం అర్హులుగా తేలితే వారి పింఛన్‌ను విడుదల చేయాలని, అనర్హులుగా గుర్తిస్తే సొమ్మును రికవరీ చేయాలని స్పష్టం చేసింది. సామాజిక భద్రత చట్టం కింద రాష్ట్ర ప్రభుత్వం వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ, చేనేత, గీత కార్మికులు, ఫైలేరియా, ఎయిడ్స్ బాధితులకు రూ.2,016, వికలాంగులకు ప్రతి నెలా రూ.3,016 పింఛన్‌ను అందజేస్తోంది. అయితే ఈ పథకానికి కుటుంబసభ్యుల్లో ఒకరు మాత్రమే అర్హులు కాగా.. చాలాచోట్ల భార్యాభర్తలు లబ్ధి పొందుతున్నట్లు ఆరోపణలు రావడంతో విచారణ జరిపిన సెర్ప్ యంత్రాంగం జాబితాను తయారు చేసింది. ఇందులో అత్యధికంగా హైదరాబాద్‌లో 1,766, నల్లగొండ 763, మంచిర్యాల 756, కరీంనగర్ 674, రంగారెడ్డి 643, జగిత్యాల 626, నారాయణపేట 623, మేడ్చల్ 585, ఖమ్మం 558, వరంగల్ అర్బన్ జిల్లాలో 546 మంది ఉన్నారు. ఈ మేరకు మే నెలకు సంబంధించి డబుల్ పింఛన్లను ఆపేసింది. ప్రభుత్వోద్యోగుల కుటుంబాలకు కూడా.. నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబ సభ్యులెవరైనా వృద్ధాప్య పింఛన్ తీసుకున్నట్లు తేలితే తక్షణమే నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రభుత్వ ఉద్యోగి ఉన్న కుటుంబసభ్యులు పింఛన్ పొందేందుకు అనర్హులు. అయితే, గ్రామీణ ప్రాంతాల్లో వృద్ధ తల్లిదండ్రులను పట్టించుకోకుండా వదిలేయడంతో నెలానెలా వచ్చే పింఛన్ సొమ్మే వారికి ఆసరా అవుతోంది. ఈ పరిస్థితుల్లో తల్లిదండ్రుల పోçషణాభారం భరించని ఉద్యోగుల వేతనాల నుంచి కట్ చేసి.. నేరుగా వారి ఖాతాలో జమ చేయాలని చట్టం చెబుతుంది. ఈ నేపథ్యంలో వృద్ధుల పింఛన్ కట్ అయిన పక్షంలో నెలవారీ కొంత మొత్తాన్ని ఉద్యోగులు తమ తల్లిదండ్రులకు ఇచ్చేలా చూడాలని క్షేత్రస్థాయి అధికారులకు సూచించింది. అదేవిధంగా ఇప్పటివరకు అక్రమంగా పొందిన పింఛన్ సొమ్మును ఆయా ఉద్యోగుల నుంచి రికవరీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబసభ్యులు పొందుతున్న లబ్ధిదారుల జాబితాను స్వయంగా తనిఖీ చేసి నివేదికలు పంపాలని ఎంపీడీవోలు, పురపాలకసంఘాల కమిషనర్లను ఆదేశించింది. -
మీరే ఉంటారు తల్లీ : సీఎం జగన్
సాక్షి, అమరావతి : గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) ఆధ్వర్యంలో పనిచేస్తున్న కల్యాణ మిత్రలకు అందించే ప్రోత్సాహకం పెంచుతామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారు. శుక్రవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎంను కల్యాణ మిత్రలు కలిశారు. ఈ సందర్భంగా కల్యాణ మిత్రల ప్రతినిధులు ఎం.స్వప్న, కె.విజయదుర్గలు తమ సమస్యలను ముఖ్యమంత్రికి వివరించారు. వైఎస్సార్ పెళ్లి కానుక కార్యక్రమానికి తమనే కల్యాణ మిత్రలుగా ఉంచాలని విన్నవించారు. తమకిచ్చే ప్రోత్సాహకం ఎంతమాత్రం సరిపోవట్లేదని వాపోయారు. అదే సమయంలో కల్యాణ మిత్రలను తొలగిస్తారనే ప్రచారం జరుగుతోందని తెలిపారు. దీనిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పందిస్తూ.. తాను ముఖ్యమంత్రిగా కొనసాగినంతకాలం మీరే కల్యాణ మిత్రలుగా ఉండి పెళ్లిళ్లు నిర్వహిస్తారంటూ వారికి భరోసానిచ్చారు. పగలు జరిగే పెళ్లికి ఇచ్చే రూ.250 ప్రోత్సాహకం మొత్తాన్ని రూ.500కు, రాత్రి జరిగే పెళ్లికిచ్చే మొత్తాన్ని రూ.500 నుంచి రూ.1000కి, ఫీల్డ్ వెరిఫికేషన్‌కు ఇచ్చే మొత్తాన్ని రూ.300 నుంచి రూ.600కి పెంచుతామని హామీ ఇచ్చారు. దీంతో కల్యాణ మిత్ర ప్రతినిధులు సీఎంకు తమ కృతజ్ఞతలు తెలియజేశారు. మండల మహిళా సమాఖ్య అకౌంటెంట్లకు ఉద్యోగ భద్రత... మండల మహిళా సమాఖ్య అకౌంటెంట్లకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ సీఎం వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రిని మండల మహిళా సమాఖ్య అకౌంటెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు జెలినా, సమతలు శుక్రవారం కలసి 15 ఏళ్లుగా తాము పనిచేస్తున్నామని, కానీ కనీస వేతనం లేదని వాపోయారు. తమకు హెచ్ఆర్ పాలసీ, ఉద్యోగ భద్రత లేవని తెలిపారు. దీనిపై స్పందించిన సీఎం.. మహిళా సమాఖ్య అకౌంటెంట్లందరికీ ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. కాల్ సెంటర్ ఇన్సూరెన్స్ ఉద్యోగులు కూడా ముఖ్యమంత్రిని కలసి తమ సమస్యలను విన్నవించారు. -
ఇసుక మాఫియాకు మరింత ఊతం
రీచ్‌ల నిర్వహణ సెర్ఫ్ నుంచి మైనింగ్ శాఖకు అప్పుడే రీచ్‌లపై కన్నేసిన టీడీపీ నేతలు వేలం పాటలవైపే సర్కార్ మొగ్గు విశాఖపట్నం: మళ్లీ ఇసుక మాఫియా రెచ్చిపోనుంది. గతంలో మాదిరిగానే సిండికేట్లు చక్రం తిప్పనున్నారు. డ్వాక్రా సంఘాల ముసుగులో ఇన్నాళ్లు ఇసుక రీచ్‌లు, డిపోలను తమ గుప్పెట్లో పెట్టుకుని రెండుచేతులా ఆర్జించిన టీడీపీ నేతలు ఇప్పుడు నేరుగా రీచ్‌లను తమపరం చేసుకునేందుకు చాపకింద నీరులా ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇసుక రీచ్‌ల నిర్వహణను సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ (సెర్ఫ్) నుంచి మైనింగ్ శాఖకు బదలాయిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మాఫియాకు మళ్లీ ఊతమిచ్చి నట్టర ుు్యంది. వివాదాలు చుట్టుముట్టినా.. అవినీతి ఆరోపణలు వెల్లువెత్తినా ఉన్నంతలో ఇసుక రీచ్‌ల నిర్వహణ..అమ్మకాల్లో మాఫియా ఆగడాలకు కొంత గండిపడిందనే చెప్పాలి. ఏడాదిన్నర క్రితం డ్వామా నుంచి సెర్ఫ్‌కు అప్పగించగా, డ్వాక్రా రుణ మాఫీ విషయంలో చేతులెత్తేసిన సర్కార్ వారిని శాంతపరిచేందుకు ఇసుకరీచ్‌ల నిర్వహణను అప్పగిస్తున్నట్టు గొప్పగా చెప్పుకుంది. పైగా వచ్చే ఆదాయంలో 25 శాతం డ్వాక్రా సంఘాలకే ఇస్తామని నమ్మబలికింది. కాని ఆచరణలో వారిని కూలీల కంటే హీనంగా చూస్తూ కేవలం క్యూబిక్ మీటర్‌కు రూ.25 మాత్రమే ముట్టజెప్పింది. ఈ మొత్తాన్ని పూర్తి స్థాయిలో చెల్లించిన పాపాన పోలేదు. డ్వాక్రా సంఘాల మాటున టీడీపీ నేతలు రీచ్‌లను తమ గుప్పెట్లో పెట్టుకుని కోట్లకు పడగలెత్తారు. పేరు డ్వాక్రా మహిళలది.. పెత్తనం పచ్చనేతలది అన్నట్టుగా ఇన్నాళ్లు రీచ్‌ల నిర్వహణ సాగింది. గతంలో సిండికేట్లుగా అవతారమెత్తి ప్రభుత్వాదాయానికి భారీగా గండికొట్టిన ఇసుకాసురులు సంఘాల మాటున చక్రం తిప్పేవారు. వీరి ఆగడాల ముందు రీచ్‌ల వద్ద సీసీ కెమెరాలు, లారీలకు జీపీఎస్‌లు ఏవీ పనిచేయలేదు. దీంతో లక్షాలాది టన్నుల ఇసుక గుట్టుచప్పుడు కాకుండా జిల్లాలు, రాష్ట్రాలు దాటిపోయేది. జన్మభూమి కమిటీల పర్యవేక్షణలో టీడీపీ ఎమ్మెల్యేలు తమ పరిధిలోని రీచ్‌లపై పెత్తనం సాగించేవారు. జిల్లాలో పదేళ్ల తర్వాత డీ నోటిఫై చేసిన 25 రీచ్‌ల్లో మూడు లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక వెలికితీయగా, అనధికారికంగా మరో మూడులక్షల క్యూ.మీ. వరకు పిండేశారు. ఇసుకకు కృత్రిమ కొరత సృష్టిస్తూ మూడు యూనిట్ల లారీ ఏకంగా పాతిక వేలు పలికేలా చేశారు. దీంతో సామాన్యులకు ఇసుక గగనంగా మారింది. లక్షలాది మంది నిర్మాణ రంగ కూలీలు పనుల్లేకుండా అల్లాడిపోయారు. పొరుగు జిల్లాల నుంచి రప్పించిన ఇసుకను కూడా తమ గుప్పెట్లో పెట్టుకుని సొమ్ము చేసుకున్నారు. అమ్మకాల ద్వారా ప్రభుత్వ ఖజానాకు రూ.25కోట్ల ఆదాయం వస్తే పచ్చనేతల జేబుల్లోకి మరో పాతిక కోట్ల వరకు చేరినట్టు అంచనా. తొలుత సర్కార్ క్యూ.మీ. ఇసుక ధర రూ.500లగా ప్రకటిస్తే ప్రస్తుతం ప్రభుత్వ దరే రూ.1700 పలుకుతోంది. ఇక బ్లాక్మార్కెట్లో ఇసుక రేటు ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇలా మొత్తమ్మీద ఆది నుంచి సెర్ఫ్ ఆధ్వర్యంలో ఇసుక రీచ్‌ల నిర్వహణను వివాదాలు చుట్టుముట్టాయి. ఎట్టకేలకు సెర్ఫ్ నుంచి ఇసుకను పూర్తిగా మైనింగ్ శాఖకు బదలాయిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు జీవో.154ను బుధవారం రాత్రి జారీ చేశారు. ఈ నిర్ణయంతో గ్రామీణాభివృద్ధి శాఖాధికారులు కాస్త ఊపిరి పీల్చుకున్నప్పటికీ మాఫియా కు మాత్రం మరింత ఊతమిచ్చింది. రీచ్‌ల నిర్వహణను డ్వాక్రా సంఘాల నుంచి తప్పించి వేలం పాటలు నిర్వహించాలనే యోచనలో సర్కార్ ఉన్నట్టు తెలుస్తోంది.