ఇసుక రీచ్‌లు..దేవగుడి, పోట్లదుర్తి నేతలకేనా?
ప్రొద్దుటూరు: ‘దేవగుడితోపాటు చుట్టుపక్కల పలు క్వారీలు మంజూరు చేశారు.. మరోవైపు నంగనూరుపల్లె క్వారీని పోట్లదుర్తి నేతలు ఆక్రమించుకున్నా రు.. ఇసుక క్వారీలు దేవగుడి, పోట్లదుర్తి అధికార పార్టీ నేతలకేనా?’ అని ప్రొద్దుటూరు ప్రాంతానికి చెందిన పలు వురు ట్రాక్టర్ల యజమానులు మంగళవారం ఆందోళనకు దిగారు. అటు నం గనూరుపల్లె క్వారీ, ఇటు దేవగుడి క్వా రీలకు వెళ్లేందుకు తమను అనుమతిం చకపోవడంతో నిరసన వ్యక్తం చేసిన ట్రాక్టర్ యజమానులు ఉదయాన్నే జమ్మలమడుగు రోడ్డులోని వైఎస్సార్ విగ్రహం వద్ద దేవగుడి ప్రాంతం నుంచి వస్తున్న ఇసుక ట్రాక్టర్లను అడ్డుకున్నారు.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎవరైనా వెళ్లి ఇసుక తెచ్చుకునే వీలుండగా మంత్రి ఆది నారాయణరెడ్డి అనుచరులమంటూ తమను రానివ్వడం లేదని, వెళ్లిన వారి పై దౌర్జన్యానికి పాల్పడుతున్నారని ఈ సందర్భంగా వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రొద్దుటూరు ప్రాంతానికి చెం దిన ట్రాక్టర్లను దేవగుడి ప్రాంతానికి వెళ్లనీయకుండా అడ్డుకున్నప్పుడు, అక్కడి ట్రాక్టర్లను తాము పట్టణంలోకి ఎలా అనుమతిస్తామని అడ్డుకున్నారు. వారి కారణంగా తామంతా జీవనోపాధి కోల్పోయామని పేర్కొన్నారు. చాలా రోజులుగా ఇదే పరిస్థితి ఉందన్నారు.
వ్యాపారకేంద్రమైన ప్రొద్దుటూరుకు ఇసుక అవసరం తప్పనిసరని, అధికార పార్టీ నేతలు ఉద్దేశపూర్వకంగానే ఇక్కడ క్వారీలు లేకుండా చేశారని ఆరోపించారు. ప్రొద్దుటూరుకు ప్రత్యేకంగా క్వారీలు ఉంటే బయటి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ఇసుకకు డిమాండ్ ఉండదని, ఇక్కడ క్వారీ లేకుండా చేశారని చెప్పారు. రోజూ దేవగుడి ప్రాంతం నుంచి వెయ్యి ట్రాక్టర్ల ఇసుక వస్తోందన్నారు. పైగా జియోట్యాగ్ లేకుండానే ఇసుక రవాణా అవుతున్నా అధికారులు పట్టించుకోకుండా వదిలేశారని చెప్పారు. ప్రొద్దుటూరు మండలంలోని శంకరా పురంలో ఇసుక క్వారీ ఉన్నప్పుడు దేవగుడి, పోట్లదుర్తి తదితర ప్రాంతాల వారంతా యథేచ్ఛగా ఇసుకను తీసుకెళ్లారని, అలాంటప్పుడు తమకు ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని మండిపడ్డారు.
భూపేష్ ట్రాక్టర్‌ను అడ్డుకోవడంతో పోలీసులకు ఫిర్యాదు
మంత్రి ఆది కుటుంబానికి చెందిన భూపేష్ పేరుతో ఉన్న ఇసుక ట్రాక్టర్‌ను స్థానికులు అడ్డుకున్నారు. తమకొక న్యాయం, వారికొక న్యాయం ఏమిటని ట్రాక్టర్ డ్రైవర్‌తో వాగ్వాదానికి దిగారు. ఈలోపే అధికారపార్టీ నుంచి ఫోన్లు రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. రూరల్ ఎస్‌ఐ చంద్రశేఖర్‌తోపాటు సిబ్బంది వెంటనే వైఎస్ విగ్రహం వద్దకు చేరుకున్నారు. ఎవరు ట్రాక్టర్లను అడ్డుకుంటున్నారని స్థానికులపై లాఠీచార్జి చేసేందుకు ప్రయత్నించారు. ఎస్‌ఐ వేగాన్ని గమనించిన ఆందోళనకారులు అక్కడి నుంచి పక్కకువెళ్లారు. నిబంధనల ప్రకారం అనుమతి ఉన్న క్వారీ నుంచి ఇసుక తీసుకొస్తున్నారని, అలాంటప్పుడు ఎవరు అభ్యంతరం వ్యక్తం చేయడానికి వీలు లేదని ఎస్‌ఐ తెలిపారు. ఎవరికైనా అనుమానాలు ఉంటే పోలీస్‌స్టేషన్‌కు రావాలని సూచించారు. భయాందోళనకు గురైన ట్రాక్టర్ యజమానులు సమస్య తీవ్రతను ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డికి ఇంటికి వెళ్లి తెలిపారు.