Government regulation
-
ఇసుక రీచ్‌లు..దేవగుడి, పోట్లదుర్తి నేతలకేనా?
ప్రొద్దుటూరు: ‘దేవగుడితోపాటు చుట్టుపక్కల పలు క్వారీలు మంజూరు చేశారు.. మరోవైపు నంగనూరుపల్లె క్వారీని పోట్లదుర్తి నేతలు ఆక్రమించుకున్నా రు.. ఇసుక క్వారీలు దేవగుడి, పోట్లదుర్తి అధికార పార్టీ నేతలకేనా?’ అని ప్రొద్దుటూరు ప్రాంతానికి చెందిన పలు వురు ట్రాక్టర్ల యజమానులు మంగళవారం ఆందోళనకు దిగారు. అటు నం గనూరుపల్లె క్వారీ, ఇటు దేవగుడి క్వా రీలకు వెళ్లేందుకు తమను అనుమతిం చకపోవడంతో నిరసన వ్యక్తం చేసిన ట్రాక్టర్ యజమానులు ఉదయాన్నే జమ్మలమడుగు రోడ్డులోని వైఎస్సార్ విగ్రహం వద్ద దేవగుడి ప్రాంతం నుంచి వస్తున్న ఇసుక ట్రాక్టర్లను అడ్డుకున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎవరైనా వెళ్లి ఇసుక తెచ్చుకునే వీలుండగా మంత్రి ఆది నారాయణరెడ్డి అనుచరులమంటూ తమను రానివ్వడం లేదని, వెళ్లిన వారి పై దౌర్జన్యానికి పాల్పడుతున్నారని ఈ సందర్భంగా వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రొద్దుటూరు ప్రాంతానికి చెం దిన ట్రాక్టర్లను దేవగుడి ప్రాంతానికి వెళ్లనీయకుండా అడ్డుకున్నప్పుడు, అక్కడి ట్రాక్టర్లను తాము పట్టణంలోకి ఎలా అనుమతిస్తామని అడ్డుకున్నారు. వారి కారణంగా తామంతా జీవనోపాధి కోల్పోయామని పేర్కొన్నారు. చాలా రోజులుగా ఇదే పరిస్థితి ఉందన్నారు. వ్యాపారకేంద్రమైన ప్రొద్దుటూరుకు ఇసుక అవసరం తప్పనిసరని, అధికార పార్టీ నేతలు ఉద్దేశపూర్వకంగానే ఇక్కడ క్వారీలు లేకుండా చేశారని ఆరోపించారు. ప్రొద్దుటూరుకు ప్రత్యేకంగా క్వారీలు ఉంటే బయటి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ఇసుకకు డిమాండ్ ఉండదని, ఇక్కడ క్వారీ లేకుండా చేశారని చెప్పారు. రోజూ దేవగుడి ప్రాంతం నుంచి వెయ్యి ట్రాక్టర్ల ఇసుక వస్తోందన్నారు. పైగా జియోట్యాగ్ లేకుండానే ఇసుక రవాణా అవుతున్నా అధికారులు పట్టించుకోకుండా వదిలేశారని చెప్పారు. ప్రొద్దుటూరు మండలంలోని శంకరా పురంలో ఇసుక క్వారీ ఉన్నప్పుడు దేవగుడి, పోట్లదుర్తి తదితర ప్రాంతాల వారంతా యథేచ్ఛగా ఇసుకను తీసుకెళ్లారని, అలాంటప్పుడు తమకు ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని మండిపడ్డారు. భూపేష్ ట్రాక్టర్‌ను అడ్డుకోవడంతో పోలీసులకు ఫిర్యాదు మంత్రి ఆది కుటుంబానికి చెందిన భూపేష్ పేరుతో ఉన్న ఇసుక ట్రాక్టర్‌ను స్థానికులు అడ్డుకున్నారు. తమకొక న్యాయం, వారికొక న్యాయం ఏమిటని ట్రాక్టర్ డ్రైవర్‌తో వాగ్వాదానికి దిగారు. ఈలోపే అధికారపార్టీ నుంచి ఫోన్లు రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. రూరల్ ఎస్ఐ చంద్రశేఖర్‌తోపాటు సిబ్బంది వెంటనే వైఎస్ విగ్రహం వద్దకు చేరుకున్నారు. ఎవరు ట్రాక్టర్లను అడ్డుకుంటున్నారని స్థానికులపై లాఠీచార్జి చేసేందుకు ప్రయత్నించారు. ఎస్ఐ వేగాన్ని గమనించిన ఆందోళనకారులు అక్కడి నుంచి పక్కకువెళ్లారు. నిబంధనల ప్రకారం అనుమతి ఉన్న క్వారీ నుంచి ఇసుక తీసుకొస్తున్నారని, అలాంటప్పుడు ఎవరు అభ్యంతరం వ్యక్తం చేయడానికి వీలు లేదని ఎస్ఐ తెలిపారు. ఎవరికైనా అనుమానాలు ఉంటే పోలీస్‌స్టేషన్‌కు రావాలని సూచించారు. భయాందోళనకు గురైన ట్రాక్టర్ యజమానులు సమస్య తీవ్రతను ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డికి ఇంటికి వెళ్లి తెలిపారు. -
రేస్‌క్లబ్ సర్కారు నియంత్రణలోకి!
సాక్షి, హైదరాబాద్: కొందరు వ్యక్తుల ప్రైవేటు సామ్రాజ్యంగా మారిన హైదరాబాద్ రేస్ క్లబ్‌పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. బుకీల సహకారంతో ఏటా రూ. వందల కోట్ల వ్యాపారం చేస్తూ నామమాత్రంగా పన్ను చెల్లిస్తున్న రేస్‌క్లబ్‌ను తన నియంత్రణలోకి తీసుకోవాలని నిర్ణయించింది. రేస్‌క్లబ్ నిర్వాహకులు చేస్తున్న బెట్టింగ్ వ్యాపారాన్ని క్రమబద్ధీకరించేందుకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా ‘హైదరాబాద్ రేస్‌కోర్స్ అండ్ బెట్టింగ్ యాక్ట్- 1939’లోని లొసుగులను సరిదిద్ది.. ప్రభుత్వ ప్రత్యక్ష పర్యవేక్షణలో గుర్రపు పందాలు సాగేందుకు మార్గాలను అన్వేషిస్తోంది. ఈ మేరకు ప్రభుత్వం ఆర్థిక, హోం శాఖల కార్యదర్శులు, వాణిజ్యపన్నుల శాఖ డిప్యూటీ కార్యదర్శి, ఎన్ఫోర్స్మెంట్ అదనపు కమిషనర్లతో కూడిన ఓ ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. హైదరాబాద్ రేస్క్లబ్తో పాటు ఇతర ప్రాంతాల్లో సాగుతున్న బెట్టింగ్‌ల తీరుతెన్నెలు, ముంబై, బెంగళూరు, పుణె, చెన్నైలోని రేస్కోర్సుల్లో ఉన్న పన్ను విధానాలను అధ్యయనం చేయనుంది. అలాగే ఆన్లైన్ బెట్టింగ్‌కు సంబంధించి కంప్యూటరైజేషన్ అవకాశాలపై కూడా ఈ కమిటీ వారంలోగా నివేదిక ఇవ్వనుంది. అనంతరం రేస్‌క్లబ్‌పై ప్రభుత్వ నియంత్రణ పెరిగే చర్యలను అధికారికంగా చేపట్టనున్నట్లు ఓ అధికారి ‘సాక్షి’కి తెలిపారు. బు‘కీ’లే కీలకం: ఏటా 300 రోజుల పాటు హైదరాబాద్ రేస్‌క్లబ్ ఆధ్వర్యంలో గుర్రపు పందాలు సాగుతాయి. మలక్‌పేట రేస్‌క్లబ్‌లో జరిగే పందాలతో పాటు బెంగళూరు, చెన్నై, ముంబై, మైసూర్, ఢిల్లీ, ఊటీ, కోల్‌కతా, పుణెల్లో జరిగే పందాలకు కూడా ఇంటర్వ్యూనర్ బెట్టింగ్ నిర్వహిస్తారు. హైదరాబాద్ రేస్‌క్లబ్ ద్వారా అధికారికంగా టికెట్లతో కూడిన బెట్టింగ్ జరుగుతుంది. అదే సమయంలో రేస్క్లబ్కు సమాంతరంగా 23 మంది బుకీలతో బెట్టింగ్ అసాధారణ రీతిలో సాగుతుంది. లెసైన్సుడ్ బుకీలుగా ఉన్న వీరి ద్వారా నల్లధనం చలామణి అవుతుంది. ఎలాంటి టికెట్లు లేకుండా కాగితం మీద రాసే అంకెల ఆధారంగా ఈ బెట్టింగ్ సాగుతుంది. రూ. 5వేలు బెట్టింగ్ కాసే వారికి రూ.500 అని రాసిన కాగితం ఇచ్చి వ్యాపారం నిర్వహిస్తారు. రోజు రూ.3 కోట్ల వరకు వ్యాపారం జరుగుతుంది. బెట్టింగ్ ద్వారా నిర్వాహకులు 12%పన్ను కింద వాణిజ్యపన్నుల శాఖకు నెలకు రూ. 5 కోట్ల వరకు చెల్లిస్తోంటే, 23 మంది బుకీలు సంవత్సరానికి రూ 5. కోట్ల వరకు చెల్లిస్తుండటం గమనార్హం. రేస్‌క్లబ్ అధికారికంగా చేసే వ్యాపారం కంప్యూటర్ బిల్లింగ్‌లో ఉండగా, బుకీల నల్ల వ్యాపారం మొత్తం చిత్తు కాగితాలపై సాగుతుంది. రెండు నెలల క్రితం అధికారులు రేస్‌క్లబ్‌పై దాడులు నిర్వహించగా, ఆరుగురు బుకీలురూ. 50 లక్షలు బెట్టింగ్ ద్వారా సమకూర్చుకొని రూ. 7 లక్షలకు అధికారికంగా లెక్కలు చూపించారు. ఈ నేపథ్యంలో బుకీలతో రేస్‌క్లబ్ పాలకమండలి కుమ్మక్కై బెట్టింగ్ దందా సాగిస్తున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. -
అయ్యో.. ఇదేం నిరీక్షణ
చిన్నశంకరంపేట, న్యూస్‌లైన్: మండల కేంద్రమైన చిన్నశంకరంపేటలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 609 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇందులో 291 మంది విద్యార్థినులుంటారు. ఇక్కడ 21 మంది ఉపాధ్యాయులు పనిచేస్తుంటే అందులో ప్రాధానోపాధ్యాయురాలితో కలుపుకొని 11 మంది మహిళలున్నారు. వీరి కోసం కనీసం నాలుగైదు టాయిలెట్స్ ఉండాలి. 120 మంది విద్యార్థులకు ఒక మరుగుదొడ్డి, రెండు మూత్రశాలలు ఉండాలనేది ప్రభుత్వ నిబంధన. కానీ ఇక్కడ వందల మంది విద్యార్థినీ, విద్యార్థులున్నా ఒకే మరుగుదొడ్డి ఉండడంతో అవస్థలు పడుతున్నారు. అరగంటకుపైగా.. పాఠశాలలో ఒకే టాయిలెట్ ఉండడంతో విద్యార్థినులు నిత్యం నరకం అనుభవిస్తున్నారు. టాయిలెట్‌కు వెళ్లాలని భావిస్తే కనీసం అరగంట నుంచి గంట సేపు వేచి ఉండాల్సి వస్తుందంటున్నారు. తరగతి గది నుంచి వెళ్లి టాయిలెట్ వద్ద క్యూ కట్టాల్సి వస్తుంది. దీంతో వారు మానసికంగా కుంగిపోతున్నారు. టాయిలెట్‌కు వెళ్లే ఇబ్బంది నుంచి తప్పించుకునేందుకు కొందరైతే దాహం వేసినా మంచి నీళ్లు తాగడం మానేశారు. ఇంకొందరైతే బలవంతంగా ఆపుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈ రకమైన సమస్యను ఎదుర్కొంటుండడం వల్ల తరగతి గదిలో విద్యార్థినుల ఏకాగ్రత లోపిస్తున్నట్టు సమాచారం. తరగతుల వారీగా ఇంటర్వెల్.. ఈ సమస్యను అధిగమించేందుకు ఉపాధ్యాయులు తరగతుల వారీగా ఇంటర్వెల్‌కు సమయాన్ని కేటాయిస్తున్నారు. ఈ రకంగానైనా విద్యార్థినులు తరగతి గదికి చేరుకునే సరికి అరగంట అవుతున్నట్టు తెలుస్తోంది. అదనపు గదులను నిర్మించేందుకుగాను ఏడాది కిందట నిర్వహించిన శంకుస్థాన కార్యక్రమంలో పాల్గొనేందుకు పాఠశాలకు వచ్చిన రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి సునీతారెడ్డి దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లారు. అయినప్పటికీ సమస్య మాత్రం పరిష్కారానికి నోచుకోలేదు. జెండా పండుగలకు వచ్చినప్పుడల్లా గ్రామపెద్దలు, ఇతర ప్రజాప్రతినిధులు ఈ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చి వెళ్తున్నారే తప్ప ఏర్పాటు కావడం లేదని విద్యార్థినుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మరుగుదొడ్లు, మూత్రశాలలను నిర్మించి సమస్యను పరిష్కరించాలని విద్యార్థినులు కోరుతున్నారు.