చిన్నశంకరంపేట, న్యూస్‌లైన్: మండల కేంద్రమైన చిన్నశంకరంపేటలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 609 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇందులో 291 మంది విద్యార్థినులుంటారు. ఇక్కడ 21 మంది ఉపాధ్యాయులు పనిచేస్తుంటే అందులో ప్రాధానోపాధ్యాయురాలితో కలుపుకొని 11 మంది మహిళలున్నారు.
వీరి కోసం కనీసం నాలుగైదు టాయిలెట్స్ ఉండాలి. 120 మంది విద్యార్థులకు ఒక మరుగుదొడ్డి, రెండు మూత్రశాలలు ఉండాలనేది ప్రభుత్వ నిబంధన. కానీ ఇక్కడ వందల మంది విద్యార్థినీ, విద్యార్థులున్నా ఒకే మరుగుదొడ్డి ఉండడంతో అవస్థలు పడుతున్నారు.
అరగంటకుపైగా..
పాఠశాలలో ఒకే టాయిలెట్ ఉండడంతో విద్యార్థినులు నిత్యం నరకం అనుభవిస్తున్నారు. టాయిలెట్‌కు వెళ్లాలని భావిస్తే కనీసం అరగంట నుంచి గంట సేపు వేచి ఉండాల్సి వస్తుందంటున్నారు. తరగతి గది నుంచి వెళ్లి టాయిలెట్ వద్ద క్యూ కట్టాల్సి వస్తుంది. దీంతో వారు మానసికంగా కుంగిపోతున్నారు. టాయిలెట్‌కు వెళ్లే ఇబ్బంది నుంచి తప్పించుకునేందుకు కొందరైతే దాహం వేసినా మంచి నీళ్లు తాగడం మానేశారు. ఇంకొందరైతే బలవంతంగా ఆపుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈ రకమైన సమస్యను ఎదుర్కొంటుండడం వల్ల తరగతి గదిలో విద్యార్థినుల ఏకాగ్రత లోపిస్తున్నట్టు సమాచారం.
తరగతుల వారీగా ఇంటర్వెల్..
ఈ సమస్యను అధిగమించేందుకు ఉపాధ్యాయులు తరగతుల వారీగా ఇంటర్వెల్‌కు సమయాన్ని కేటాయిస్తున్నారు. ఈ రకంగానైనా విద్యార్థినులు తరగతి గదికి చేరుకునే సరికి అరగంట అవుతున్నట్టు తెలుస్తోంది. అదనపు గదులను నిర్మించేందుకుగాను ఏడాది కిందట నిర్వహించిన శంకుస్థాన కార్యక్రమంలో పాల్గొనేందుకు పాఠశాలకు వచ్చిన రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి సునీతారెడ్డి దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లారు.
అయినప్పటికీ సమస్య మాత్రం పరిష్కారానికి నోచుకోలేదు. జెండా పండుగలకు వచ్చినప్పుడల్లా గ్రామపెద్దలు, ఇతర ప్రజాప్రతినిధులు ఈ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చి వెళ్తున్నారే తప్ప ఏర్పాటు కావడం లేదని విద్యార్థినుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మరుగుదొడ్లు, మూత్రశాలలను నిర్మించి సమస్యను పరిష్కరించాలని విద్యార్థినులు కోరుతున్నారు.
అయ్యో.. ఇదేం నిరీక్షణ
Published Sun, Jan 26 2014 1:37 AM | Last Updated on Tue, Aug 28 2018 5:25 PM
Advertisement
Advertisement