దేవుడి పేరుతో ఇసుక దందా..!
కొత్తూరు: ఇన్నాళ్లూ ఇసుకను కిలోల లెక్కన విక్రయించిన టీడీపీ ప్రభుత్వం ప్రజల ఆందోళనతో దిగివచ్చింది. ఇసుక విక్రయ విధానానికి స్వస్తిపలికింది. ఎప్పటిలాగే నదుల్లో ప్రకృతి సిద్ధంగా లభించే ఇసుకను భవన నిర్మాణాలకు తరలించుకోవాలనుకున్నవారికి అధికార పార్టీ నేతలు అడ్డుతగులుతున్నారు. ఇసుక త రలించే ట్రాక్టర్ యజమానుల నుంచి దేవుడి పేరిట దందా చేస్తున్నారు. రెండు చేతులా ఆర్జిస్తున్నారు. దీనికి కొత్తూరు మండలం అంగూరు ర్యాంప్ వద్ద సాగుతున్న ఇసుక అక్రమ వసూళ్లే నిలువెత్తు సాక్ష్యం.
అంగూరు రెవెన్యూ పరిధిలోని సర్వేనంబర్ 1లో వంశధార నదిలోని సుమారు 458 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఇసుక మేటలు తరలించుకోవచ్చని అధికారులు సూచించారు. కొత్తూరు, భామిని, సీతంపేట, హిరమండలం, ఎల్.ఎన్.పేట, పాతపట్నం, టెక్కలి మండలాలకు ఈ ర్యాంపే ఆధారం. ఇదే అదునుగా భావించిన సోమరాజపురానికి చెందిన కొందరు వ్యక్తులు దందాకు పథకం వేశారు. అధికార పార్టీ నేతల అండదండలతో గ్రామంలోని ఆంజనేయ స్వామి ఆలయం పేరున ట్రాక్టర్‌కు రూ.50 వసూలు చేస్తున్నారు.
రోజుకు రూ.10వేల నుంచి రూ.15వేల వరకు వసూలవుతున్నట్టు సమాచారం. అక్రమ వసూళ్లపై ట్రాక్టర్ యజమానులు గగ్గోలు పెడుతున్నా రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. మరోవైపు అంగూరు-సోమరాజపురం మధ్యన ఉన్న శివాలయం వద్ద అనధికారిక తవ్వకాలు సాగుతున్నా నిలువరించేవారే కరువయ్యారు. అక్రమ వసూళ్ల విషయాన్ని స్థానిక డీటీ గణేష్, భీమారావులు వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా తమ దృష్టికి ఇంతవరకు రాలేదన్నారు. వీటిపై చర్యలు తీసుకుంటామని, వసూలు చేసేవారిపై కేసులు నమోదుచేస్తామని చెప్పారు.