కోరుమిల్లిలో తవ్వకాలు జరిగిన ప్రదేశంలో ఆందోళన చేస్తున్న స్థానిక రైతులు
ఇసుక అక్రమార్కులు కొత్త పుంతలు తొక్కి తమ పనులను కానిచ్చుకుంటున్నారు. సొంత భూముల్లో ఇసుక మేటలను తొలగించుకుంటామని అధికారుల నుంచి అనుమతులు తెచ్చుకొని అక్రమంగా ఇసుక తరలింపునకు పాల్పడుతున్నారు. దీన్ని కోరుమిల్లి లంక రైతులు అడ్డుకున్నారు.
కోరుమిల్లి (కపిలేశ్వరపురం): ఇసుక భారీ ఎత్తున కోరుమిల్లి నుంచి ఇతర ప్రాంతాలకు తరలిపోతోంది. తమ భూముల్లో ఇసుక మేటలు వేశాయని, భూములను సాగుకు అనుకూలంగా చేసుకొనేందుకు ఇసుకను తొలగించుకుంటామంటూ జిల్లా ఉన్నత స్థాయి అధికారుల నుంచి కొందరు అనుమతి పొందారు. ఆ అనుమతులను అడ్డం పెట్టుకుని వందలాది వాహనాల్లో ఇసుకను అక్రమంగా జిల్లాలోని పలు ప్రాంతాలకు తరలిస్తున్నారంటూ కోరుమిల్లి లంక రైతులు ఆదివారం ఆందోళన బాట పట్టారు. ఇసుక తవ్వకాలు జరుగుతున్న ప్రదేశానికి చేరుకుని ఆ తవ్వకాలను అడ్డుకున్నారు. ఆ సందర్భంగా రైతులు విలేకరులతో మాట్లాడుతూ కోరుమిల్లి గోదావరి నదిని ఆనుకుని తమకు భూములున్నాయన్నారు. తమ భూముల సమీపంలోని సుమారు 16 ఎకరాల భూములకు సంబంధించిన కొందరు రైతులు అనుమతులు సంపాదించి అక్రమ ఇసుక తవ్వకాలను ప్రారంభించారన్నారు. నిబంధనలకు విరుద్ధంగా మనిషి ఎత్తు లోతున తవ్వుతున్నారని వారు ఆరోపించారు.
పగలు కూలీలతో, రాత్రి వేళ యంత్రాలతో తవ్వేస్తున్నారని, దీనిపై చర్యలు తీసుకోవాలంటూ ఇటీవల తహసీల్దారు బి.సాయి సత్యనారాయణ దృష్టికి తీసుకెళ్లామన్నారు. అయినప్పటికీ అధికారులెవ్వరూ పట్టించుకోవడం లేదంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక తవ్వకాలు ఇదే రీతిలో కొనసాగితే సమీపంలోని తమ లంక భూములు గోదావరి నది కోతకు గురవుతాయని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. తమ భూములను రక్షించుకునేందుకు ఆందోళన చేపట్టాల్సి వచ్చిందని రైతులు స్పష్టం చేశారు. రైతులు అడ్డుకోవడంతో ఇసుక తరలింంచేందుకు వచ్చిన సుమారు 70 వాహనాలు వెనుతిరిగాయి. తవ్వకాలు నిలుపుదల చేయకపోతే ఉన్నతా« ధికారుల దృష్టికి తీసుకెళ్తామని, ఆందోళన ఉధృతం చేస్తామని రైతులు తెలిపారు. కోరుమిల్లికి చెందిన సుంకర సూ ర్యనారాయణ, వింటి విష్ణుమూర్తి, కాకులపాటి సత్యనారా యణ, తాడాల ఆదినారాయణ, వింటి దుర్గారావు, వింటి ఏసు, జొన్నకంటి సత్యనారాయణ, బక్కి సూర్యనారాయణ, రామారావు, నాగేశ్వరరావు, సత్తిబాబు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment