తుంగభద్రలో ‘మణి’కాసురుడు | Sand Smuggling In Kurnool | Sakshi
Sakshi News home page

తుంగభద్రలో ‘మణి’కాసురుడు

Published Mon, Oct 29 2018 2:11 PM | Last Updated on Mon, Oct 29 2018 2:11 PM

Sand Smuggling In Kurnool - Sakshi

దుర్గమ్మ ఆలయం ముందు ఇసుక డంప్‌ వేస్తున్న దృశ్యం

కర్నూలు సీక్యాంప్‌: నరకాసురుని కథ అందరూ వినే ఉంటారు.. అమ్మవారి వరగర్వంతో సకల లోకవాసులను...దేవతలనూ విడిచి పెట్టకుండా అందరినీ హింసించేవాడు..అది పురాణ గాథ. ప్రస్తుతం కర్నూలు మండంలోనూ ఓ ‘మణి’కాసురుడు అవతారమెత్తాడు. తుంగభద్ర నదిలో ఇసుకను దోచుకుంటూ అడ్డువచ్చిన వారిపై దాడులకు తెగబడుతున్నాడు. ఇదేమిటి అని అడిగిన ప్రజలను చిత్ర హింసలు పెడుతున్నాడు. అక్రమ సంపాదన కోసం ఆలయ స్థలాన్నే కబ్జాచేసేందుకు యత్నిస్తున్నాడు.  

కర్నూలు మండలంలోని మునగాలపాడు, నిడ్జూరు, జి.సింగవరం, పంచలింగాల గ్రామాల పరిధిలో తుంగభద్ర నది ప్రవహిస్తోంది. ఇక్కడ ఇసుకనిల్వలు అపారంగా ఉన్నాయి. వీటిపై అధికార పార్టీ ఎమ్మెల్యే సోదరుడు కన్నేశాడు. అనుమతులు లేకుండా రాత్రివేళల్లో టిప్పర్ల ద్వారా ఇసుకను కర్ణాటక, తెలంగాణ, రాష్ట్రాలకు తరలిస్తున్నాడు. ఒక్కో ఇసుక టిప్పర్‌ రూ.80వేల నుంచి రూ.90వేల వరకు అమ్ముతూ సొమ్ముచేసుకుంటున్నాడు. నది పక్కనే బళ్లారి దుర్గమ్మ దేవాలయం ఉంది. టీడీపీ నేత పొలం కూడా పక్కనే ఉండడంతో ఇసుక డంప్‌లు అక్కడే వేసుకుంటున్నారు. పొలం పక్కనే దుర్గమ్మ దేవాలయం సుమారు 7ఎకరాల్లో ఉంది. ఆ స్థలాన్ని కాజేయాలని ప్రయత్నం చేస్తున్నాడు.  దేవాలయం ముందు ఇసుక డంప్‌లు వేస్తూ.. ఆలయానికి వచ్చే భక్తులను బెదిరిస్తున్నాడు. కొందరిపై దాడులకు సైతం పాల్పడుతున్నాడు.

ఎండిపోయిన బోర్లు..
తుంగభద్ర నదిలో 2010 సంవత్సరంలో 200 క్యూబిక్‌ మీటర్ల ఇసుక ఉండేది. టీడీపీ నేత అక్రమ తవ్వకాలతో అది 30 క్యూబిక్‌ మీటర్లకు చేరింది.  కర్నూలు నగరానికి తాగునీటి అవసరాల కోసం తుంగభద్ర నదిలో 10 బోర్లు వేశారు. అక్రమ ఇసుక తవ్వకాలతో అందులో ఆరు బోర్లు ఎండిపోయాయి.

ఇసుక అక్రమ తరలింపు ఇలా..
పక్క రాష్ట్రాలకు చెందిన టిప్పర్ల యజమానులతో టీడీపీ నేత డీల్‌ కుదుర్చుకున్నాడు.  రాత్రివేళల్లో నదిలో దింపి ఇసుక వ్యాపారం చేస్తున్నాడు. ఇక్కో ఇసుక ట్రిప్పర్‌ ధర రూ.80వేల నుంచి రూ.90వేల వరకు నిర్ణయించాడు. ఇందులో రూ.40వేల కమీషన్‌ తీసుకొని మిగతాది లారీ యజమానులకు ఇస్తున్నాడు. టిప్పర్‌ సరిహద్దులు దాటించే బాధ్యత ఈయదే. తెలంగాణ ప్రాంతం నుంచి వస్తే తిమ్మప్ప కొట్టం, పంచలింగాల స్టేజి, ఇ.తాండ్రపాడు చెక్‌పోస్ట్, పుల్లూరు చెక్‌పోస్ట్‌ వంటి వాటిని దాటించేస్తాడు.  రోజు సుమారుగా 20 టిప్పర్లను రాష్ట్రం దాటిస్తున్నాడు. బంధువుల ద్వారా  ఒక్కో ట్రాక్టర్‌ ట్రిప్పు రూ. 3వేల నుంచి రూ.4వేల వరకు అమ్ముతూ సంపాదిస్తున్నాడు. నగరంలోని బిల్డర్స్, వెంచర్లు, బిల్డింగ్‌ల నిర్మాణం వంటి వాటికి  ఇసుకను తరలిస్తున్నాడు.  

వేరే వారు తుంగభద్రనదిలో దిగొద్దు..
అక్రమ సంపాదనలో కూడా నియమ, నిబంధనలు పెట్టి తాము అధికార పార్టీకి చెందిన వారమని నిరూపించుకుంటున్నాడు టీడీపీ ఎమ్మెల్యే సోదరుడు. మునగాలపాడులోని తుంగభద్ర నదిలోకి దిగాలంటే ట్రాక్లర్లు తాము సూచించిన వ్యక్తులే కావాలని హుకూం జారీ చేశాడు. కొత్త వ్యక్తులు దిగితే వారిపై దాడులు చేయిస్తున్నాడు. 

తాము సూచించిన రేటుకే కొనాలని డిమాండ్‌  
ట్రాక్టర్ల ద్వారా నగరంలోని ఇళ్లు, వెంచర్లకు ఇసుక తరలిస్తున్నాడు. అయితే ఇసుక తాము చెప్పిన ధరకే కొనాలని వినియోగదారులను డిమాండ్‌ చేస్తున్నట్లు సమాచారం. ఒకసారి ఇసుక వచ్చిన తర్వాత బాగోలేదని వెనక్కి పంపితే గొడవలకు దిగుతున్నాడు. వారు చెప్పిన సూచించిన రేటుకే ఇసుక కొనాలని ప్రజలకు ఇబ్బందులకు గురిచేస్తున్నాడు.

పట్టించుకోని రెవెన్యూ, మైనింగ్‌ అధికారులు  
తుంగభద్ర నదిలో ఇంతస్థాయిలో అక్రమ ఇసుక వ్యాపారం సాగుతుంటే రెవెన్యూ అధికారులు, మైనింగ్‌ అధికారులు అటువైపు వెళ్లడమే మానేశారు. ఒక వైపు భూగర్భజలాలు ఇంకిపోవడం, మరో వైపు అధికార పార్టీనేత బంధువుల బెదిరింపులు సాగుతున్నప్పటికీ అధికారులు చుట్టపు చూపుగా వచ్చి వెళుతున్నారని జనం గగ్గోలు పెడుతున్నారు. ఒకటో రెండో ట్రిప్పులు ఇంటి అవసరాలకు ఇసుక తెచ్చుకునే ప్రజలను పట్టుకుని రూ.వేలకు వేలు ఫైన్‌లు వేసి, కేసులు పెడుతున్నారని, ఇంతలా వ్యాపారం చేస్తున్న వారిని పట్టించుకోవడంలేదని జనం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement