శ్రీకాకుళం పాతబస్టాండ్: ఇసుక రవాణాలో రాష్ట్రంలో జిల్లా ప్రథమస్థానంలో నిలిచిందని కలెక్టర్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వివరించారు. ఇసుక రీచ్‌ల నిర్వహణపై ప్రధాన కార్యదర్శి గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ పైవిధంగా స్పందించారు. జిల్లాలో ఇసుకరీచ్‌లను నిర్వహిస్తున్న వారందరికీ శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని, ఇసుక సౌలభ్యం కలిగిన ప్రతీ రీచ్‌ను ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రధాన కార్యదర్శి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఇసుకను డెలివరీ చేయడంలో కాలయాపన జరగకుండా అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. వినియోగదారులకు నేరుగా శాఖాపరమైన వాహనాల ద్వారా ఇసుకను సరఫరా చేయాలన్నారు. ఇసుక అమ్మకాలు తక్కువగా ఉన్న రీచ్‌ల్లో అదనపు అమ్మకాలు జరిగేలా చూడాలన్నారు.
జిల్లాలో కొత్తగా 14 రీచ్‌ల అనుమతికి గనులు, భూగర్భ జలాల శాఖకు పంపామని కలెక్టర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. వినియోగదారుల అవసరాలకు సరిపడా ఇసుకను సరఫరా చేయాలని ప్రధాన కార్యదర్శి ఆదేశించగా అందుకు అవసరమైన చర్యలు చేపట్టడం జరిగిందని కలెక్టర్ అన్నారు. అక్రమ రవాణాను అరికట్టేందుకు పోలీసు, విజిలెన్స్ శాఖలు మరింత అప్రమత్తతతో పనిచేయాలని ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. అన్ని జిల్లాల్లో ఎలక్ట్రానిక్ ఫండ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (ఈఎఫ్‌ఎంఎస్), ఈ వేబ్‌ల ద్వారా ఇసుక రీచ్‌లను నిర్వహించాలన్నారు. ఈ వెబ్‌ల హార్డ్‌వేర్‌లను కొనుగోలు చేసుకోవాలని డీఆర్‌డీఏ పీడీలను ఆదేశించారు.
ఎఫ్‌ఎంఎస్‌లను శుక్రవారం నాటికి అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేస్తామన్నారు. ఫోస్టాఫీసుల ద్వారా పింఛన్ల పంపిణీ చేసే విధానంలో జిల్లాలో 162 గ్రామ పంచాయతీ పోస్టాఫీసుల్లో సిబ్బంది కొరత ఉందని కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ సీఎస్‌కు వివరించగా గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ కార్యదర్శుల ద్వారా, పట్టణ ప్రాంతాల్లో బిల్లు కలెక్టర్ల సహకారంతో పింఛన్ల పంపిణీ చేయాలని సీఎస్ ఆదేశించారు. కార్యక్రమంలో సెర్ప్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి అరుణ్‌కుమారి, సహాయ కమిషనర్ జి. వీరపాండ్యన్, సంయుక్త కలెక్టర్ వివేక్‌యాదవ్, డీఆర్‌డీఏ పీడీ ఎస్.తనూజారాణి, గనులు, భూగర్భ జల వనరుల శాఖ సహాయ సంచాలకులు కె.ఎల్.వి.ప్రసాద్ పాల్గొన్నారు.
ఇసుక రవాణాలో జిల్లా ఫస్ట్
Published Fri, Jan 2 2015 3:37 AM | Last Updated on Thu, Mar 21 2019 8:23 PM
Advertisement
Advertisement