గుట్టుగా డబ్బు, గంధపు చెక్కల రవాణా | Sandalwood and money transport as secretly | Sakshi
Sakshi News home page

గుట్టుగా డబ్బు, గంధపు చెక్కల రవాణా

Published Sat, Dec 14 2013 11:53 PM | Last Updated on Wed, Mar 28 2018 10:59 AM

Sandalwood and money transport as secretly

చేవెళ్ల, న్యూస్‌లైన్:  గుట్టుగా తరలిస్తున్న దాదాపు రూ. 10 లక్షల నగదు, గంధపు చెక్కలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాహనాల తనిఖీలో ఈ బాగోతం వెలుగుచూసింది. నిందితులను ఇద్దరిని రిమాండుకు తరలించగా మరో ఇరువురు పరారీలో ఉన్నారు. చేవెళ్లలోని డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ రాజకుమారి కేసు వివరాలు వెల్లడించారు. మండల కేంద్రంలోని ఠాణా సమీపంలో శనివారం ఉదయం పోలీసులు వాహనాల తనిఖీ నిర్వహించారు. వారు ఓ టాటా మొబైల్‌ను ఆపగానే సదరు వాహనంలోని ఓ వ్యక్తి పారిపోయాడు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు వాహనాన్ని ఠాణాకు తరలించి డ్రైవర్ నారీఉమేష్‌ను తమదైన శైలిలో విచారించారు.

మహారాష్ట్రలోని ఉస్మానాబాద్ జిల్లాలోని భూమ్ తాలుకా వంగి గ్రామానికి చెందిన గంధపు చెక్కల వ్యాపారి సుభాష్ అన్నాపవార్ అదే రాష్ట్రంలోని ఉస్మానాబాద్ నుంచి శ్రీగంధం రకం చెక్కలను షాబాద్ మండల పరిధిలోని నాగరగూడ వద్ద గల ఆంధ్రా ఫర్‌ఫ్యూమ్స్ కంపెనీకి ఇటీవల రెండుసార్లు సరఫరా చేశాడు. ఈ డబ్బులు తీసుకెళ్లేందుకు శనివారం టాటా మొబైల్ వాహనంలో వచ్చాడు. ఉపయోగం రాని 25 కిలోల గంధపు చెక్కలను, గతంలోని దుంగలకు సంబంధించిన రూ. 9 లక్షల 85 వేలను తీసుకొని స్వస్థలానికి వెళ్తున్నాడు. అనుమానం రాకుండా కూరగాయలను తీసుకువెళ్లే ప్లాస్టిక్ డబ్బాల్లో గంధం దుంగలను వేసుకొని వెళ్తూ పోలీసులకు పట్టుబ డ్డారు. పోలీసులు వాహనం ఆపగానేగంధపు చెక్కల వ్యాపారి సుభాష్ అన్నాపవార్ పరారయ్యాడు.

ఆయనతో పాటు ఫర్‌ప్యూమ్ కంపెనీ యజమాని అబ్దుల్లా, ఫ్యాక్టరీ సూపర్‌వైజర్ ఆసిఫ్, డ్రైవర్ నారీ ఉమేష్‌లపై పోలీసులు ఏపీ ఫారెస్ట్ యాక్ట్ 20, 29, 32, ఏపీ శాండిల్ యాక్ట్ 3, ఐపీసీ 411 చట్టాల కింద కేసులు నమోదు చేశారు. సుభాష్ అన్నాపవార్, ఫ్యాక్టరీ యజమాని అబ్దుల్లాలు పరారీలో ఉన్నారని, మిగతా ఇద్దరిని శనివారం రిమాండుకు తరలించినట్లు ఎస్పీ తెలిపారు. దుంగలతో పాటు నగదును స్వాధీనం చేసుకున్నారు. సమావేశంలో చేవెళ్ల డీఎస్పీ సీహెచ్.శ్రీధర్, శిక్షణ డీఎస్పీ సౌజన్య, సీఐలు గంగారాం, వేణుగోపాల్‌రెడ్డి, ఎస్‌ఐలు లక్ష్మీరెడ్డి, శేఖర్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. దుంగలను చాకచక్యగా పట్టుకును హెడ్‌కానిస్టేబుల్ భీంరావు, కానిస్టేబుళ్లు నాగరాజు, లింగమయ్య, కిషన్, ఫారూక్‌లను ఎస్పీ రాజకుమారి అభినందించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement