పారిశుద్ధ్యం సమష్టి బాధ్యత | Sanitation and collective responsibility | Sakshi
Sakshi News home page

పారిశుద్ధ్యం సమష్టి బాధ్యత

Published Sun, Dec 21 2014 2:07 AM | Last Updated on Sat, Sep 2 2017 6:29 PM

Sanitation and collective responsibility

డ్వామా పీడీ ఢిల్లీరావు : పెద్దయ్యా నీ పేరేంటి? ఇక్కడ ఉపాధి పనులు దొరుకుతున్నాయా?
 కోటయ్య : నాపేరు కోటయ్యండీ.. పనులు బాగానే దొరుకుతున్నాయి. కానీ ప్రతి దానికీ ఆధార్ అడుగుతున్నారు. దీంతో కొంత ఇబ్బంది పడుతున్నాం సార్.
 డ్వామా పీడీ: ఆధార్‌తో అనుసంధానం అనేది తాత్కాలికంగా సమస్యలా కనిపించినా దాని వలన దీర్ఘకాలిక      ప్రయోజనాలుంటాయి.
 ఢిల్లీరావు : మీరు చెప్పండి.. పేమెంట్లు    సకాలంలో అందుతున్నాయా..?
 ఆలా సుబ్బారావు : నలుగురైదుగురు పనిచేస్తే పేమెంట్ కచ్చితంగా అందుతుంది సార్. అదే ఇద్దరు చేస్తే ఎందుకో తెలీదు పేమెంట్ అందక చాలా ఇబ్బంది పడుతున్నాం.
 ఢిల్లీరావు : బిల్లులు
  సకాలంలో అందేలా అన్ని చర్యలు తీసుకుంటాను.
 ఢిల్లీరావు : అమ్మా.. వ్యక్తిగత మరుగుదొడ్డి కట్టించుకున్నారా? బిల్లులు సక్రమంగానే అందుతున్నాయా?
 రాములమ్మ : కట్టించుకుంటున్నానయ్యా. బిల్లు అందింది.
 ఢిల్లీరావు : మీకు మరుగుదొడ్డి బిల్లు వచ్చిందా?
 జగన్నాధమ్మ: మెటీరియల్ వచ్చిందయ్యా.
 ఢిల్లీరావు : మరుగుదొడ్డి కట్టుకోమని మీకెవరు చెప్పారు?
 జగన్నాధమ్మ: ఎమ్మార్వోగారు
 ఢిల్లీరావు : (పక్కనే ఉన్న తహశీల్దారు విజయజ్యోతితో..)తహశీల్దారు గారూ.. ఈ గ్రామంలో మరుగుదొడ్ల నిర్మాణాలు ఏ దశలో ఉన్నాయి?
 తహశీల్దార్: ఎన్.బి.ఐ. కింద ఈ గ్రామంలో 147 వ్యక్తిగత మరుగుదొడ్లు మంజూరయ్యాయి సార్. వాటిలో 102 ఇప్పటికే నిర్మించేశాం. మిగిలిన  సూపర్ స్ట్రక్చర్ దశలో ఉన్నాయి. ఈ నెల 24న సీఎం పర్యటనను దృష్టిలో ఉంచుకుని 23వ తేదీలోగా మిగిలిన వాటిని కూడా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. జిల్లాలోనే తొలిసారిగా సంపూర్ణ మరుగుదొడ్లు సాధించుకున్న గ్రామంగా తీర్చిదిద్దాలనే ధ్యేయంతో పని చేస్తున్నాం సార్.
 ఢిల్లీరావు : మంచిది. ఇంకా సమస్యలేమిటి?
 శేషయ్య : సార్.. మా గ్రామంలో మంచినీటి పంపులు చెడిపోయి మూడు మాసాలకు పైనే అయింది సార్. అధికారులకు ఫిర్యాదు చేశాం. ఈ మధ్యనే మరమ్మతు చేసేందుకు ఒకాయన వచ్చారు. పంపులన్నీ విప్పి చూసి, పంపుకు రూ.600  ఇస్తే నేరిపేర్ చేస్తానని చెప్పి వెళ్లిపోయాడు సార్!
 ఢిల్లీరావు : (ఒకింత ఆగ్రహంగా) అన్ని పంపులూ ఒకేసారి చెడిపోయాయా? మరమ్మతులకు డబ్బులడుగుతున్నారా? ఎంపీడీవో ఎక్కడయ్యా?
 ఎంపీడీవో పాండు : ఇక్కడే ఉన్నాను సార్.
 ఢిల్లీరావు : శేషయ్య చెప్పింది మీరు విన్నారా?
 ఎంపీడీవో : నేను బాధ్యతలు చేపట్టి 15 రోజులే అయింది సార్. ఇప్పటి వరకు ఈ సమస్యను ఎవరూ నా దృష్టికి తేలేదు. వెంటనే పంపుల మరమ్మతులకు అవసరమైన చర్యలు తీసుకుంటాను. అధికారులతో నేనే మాట్లాడి గ్రామంలో మంచినీటి సమస్య పరిష్కారమయ్యేలా చూస్తాను.
 ఢిల్లీరావు : ఏం పెద్దాయనా నీ సమస్యేమిటి?
 గడ్డి కోటయ్య : నా పేరు కోటయ్యండి. ఆధార్ కార్డు లేదని మొదట్లో పింఛన్ నిలిపేశారయ్యా. తర్వాత ఆధార్ కార్డు సంపాదించుకున్నా కానీ పింఛన్ మాత్రం దక్కలేదయ్యా.
 ఢిల్లీరావు : ఆధార్ కార్డు ఉండి, అర్హులైన వారికి పింఛన్ రాకపోవడం ఉండదు. ఏదో పొరపాటు జరిగి ఉంటుంది. అధికారులందరూ ఇక్కడే ఉన్నారు కనక మీరు తర్వాత వారిని కలవండి. వారు రికార్డులు తనిఖీ చేసి మీకు పింఛన్ వచ్చేలా చూస్తారు.
 సుగుణ : సార్, మా గ్రామంలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. వర్షాకాలం వచ్చిందంటే మురుగునీళ్లన్నీ నేరుగా ఇళ్లలోకి వస్తున్నాయి.
 ఢిల్లీరావు : (అక్కడే ఉన్న సర్పంచ్ ప్రసాద్‌ను పిలిచి) ఏమండి, మీ గ్రామ నిధులతో ఇలాంటి  చిన్న పనులు కూడా చేసుకోలేక పోతే ఎలాగండీ. ఎందుకని ఒక్క రోడ్డు కూడా వేయించలేకపోయారు?
 సర్పంచ్ : మా గ్రామంలో వచ్చే ఆదాయం అంతంతమాత్రం సార్. గతంలో చెరువు పాట వలన నాలుగైదు లక్షలు వచ్చేయి. ఇప్పుడు అది కూడా ఆపేశారు. దీనిపై డీపీవో గారిని అడిగాం. అయినా ఆయన అదిగో ఇదిగో అంటున్నారు. ఇంకెలా పనులు చేసుకోగలమండీ..?
 ఢిల్లీరావు : సరే డీపీవోతో మాట్లాడి మీ చెరువుకు పాట జరిగే విధంగా చూస్తాను. 13వ ఆర్థిక సంఘం నిధులతో ఈ గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణం జరిగేలా అన్ని చర్యలూ తీసుకుంటా.
 ఢిల్లీరావు : (సిమెంట్ రోడ్లపై పశువులను కట్టేసి ఉండటం, ఇళ్ల పక్కనే మురుగునీటి నిల్వలు చూసి. ఎంపీటీసీ అరుణకుమారితో) ఇలా రోడ్లపై మూగజీవాలను కట్టేయడమేమిటమ్మా?
 ఎంపీటీసీ : ఇది చాలా ఇబ్బందికరమైన సమస్యే సార్. కాలువల్లో వెంటనే పూడిక తీయిస్తాం సార్. మురుగునీరు నిల్వ ఉండకుండా చూసుకుంటాం.
 ఢిల్లీరావు : ఇలా అపరిశుభ్ర వాతావరణం ఉంటే  రోగాలు ప్రబలే అవకాశం ఉంది. దీనిపై మీరే గ్రామ ప్రజల్లో అవగాహన పెంచాలి చెప్పారు.
 ఎంపీటీసీ: అలాగే సార్. తప్పకుండా దీనిపై స్థానికుల్లో అవగాహన కల్పిస్తాం.
 రాములు : మా గ్రామంలో అసలు పంచాయతీ కార్యాలయమే లేదండీ..
 సర్పంచ్ : నిజమే సార్. మూడు సెంట్ల స్థలం ఉంది కానీ. నిధులు లేక ఇంత వరకు సొంత భవనం నిర్మించుకోలేక పోయాం.
 ఢిల్లీరావు : ఏమ్మా ఎలా ఉన్నారు? మీకేమైనా సమస్య ఉంటే చెప్పండమ్మా?
 తిరుపతమ్మ : అయ్యా ఇక్కడ దోమల బెడద చాలా ఎక్కువయ్యా. కనీసం సైడు కాలువల్లో దోమల మందు కూడా కొట్టడం లేదు. అధికారులుంది మాకు సేవ చేయడానికా.. కాదా?
 ఢిల్లీరావు : చుట్టూ అపరిశుభ్ర వాతావరణం ఉంటే దోమలుండటం మామూలే. అధికారులు దోమల మందు కొట్టడం లేదంటున్నారు సరే. ముందు మీ వంతుగా చేయాల్సిన బాధ్యతను ఎందుకు విస్మరిస్తున్నారు? ప్రజలు, అధికారుల పరస్పర భాగస్వామ్యంతోనే ఏ సమస్య అయినా పరిష్కారం అవుతుంది. తొలుత మీరు మీ ఇంటి చుట్టుపక్కల నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ఆ తర్వాత అధికారులను నిలదీయాలి. అదే స్వచ్ఛభారత్ అసలు సిసలు లక్ష్యం. ఉపాధి హామీ పథకంలో త్వరలో కచ్చా డ్రైన్స్ నిర్మాణానికి పూనుకుంటాం.
 ఢిల్లీరావు : (ఒక ఇంటి ఆవరణలో ఆరబోసిన మిర్చిని చూసి..) మిర్చి గిట్టుబాటు ధర ఎలా ఉంది..?
 రైతు శేషయ్య: ఎకరం కౌలు పొలంలో  తేజ రకం మిర్చి సాగు చేశాను. గిట్టుబాటు ధర లేదు. వచ్చే అరకొర సొమ్ము పెట్టుబడ్జికే సరిపోతోంది సార్.  
 ఢిల్లీరావు : అధికారులతో మాట్లాడి పంటకు గిట్టుబాటు ధర దక్కేలా చర్యలు తీసుకుంటాను.
 ఢిల్లీరావు :  (రామాలయం సెంటర్‌లో ఉన్న గ్రామ పెద్దలతో..) నమస్కారం.. ఎలా ఉన్నారు..!
 గ్రామ పెద్దలు : ఇప్పటికి బోలెడంత మంది అధికారులు, ప్రజాప్రతినిధులు మా ఊరికి వచ్చారు.. వెళ్లారు. ఎవరూ ఏమీ చేసింది లేదు. మా నియోజకవర్గ ఎమ్మెల్యే, అసెంబ్లీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు మా గ్రామాన్ని దత్తత తీసుకుంటామంటున్నారు. అలాగైనా మాకు మౌలిక వసతులు సమకూరితే మంచిది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement