Employment tasks
-
అడిగిన వారందరికీ ఉపాధి పనులు
కర్నూలు(అగ్రికల్చర్) : అడిగిన వారందరికీ ఉపాధి పనులు కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని, జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల ప్రజలు వీటిని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా నీటి యాజమాన్య సంస్థ(డ్వామా) ప్రాజెక్టు డెరైక్టర్ పుల్లారెడ్డి తెలిపారు. బుధవారం సాయంత్రం ఆయన తన ఛాంబర్లో విలేకరులతో మాట్లాడుతూ పనులు కావాలని అడిగినా పనులు కల్పించకపోతే సంబంధిత మండల అభివృద్ధి అధికారులకు(పీఓ) ఫిర్యాదు చేయాలని పేర్కొన్నారు. ప్రస్తుతం 39 వేల మంది ఉపాధి పనులకు వస్తున్నారని, ఎంతమంది వచ్చినా పనులు కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని వివరించారు. ఉపాధి పనులకు హాజరయ్యేవారికి ప్రత్యేక వేసవి అలవెన్సులు కూడా ఉన్నాయని తెలిపారు. ఫిబ్రవరి నెలలో 20 శాతం, మార్చిలో 25 శాతం, ఏప్రిల్, మే నెలల్లో 30 శాతం, జూన్‌లో 20 శాతం ప్రకారం అలవెన్సులు ఉంటాయని తెలిపారు. అంటే మార్చి నెలలో 75 శాతం పనిచేసినా పూర్తిగా వేతనం వస్తుందన్నారు. వికలాంగులకు ఇప్పటికే 30 శాతం అలవెన్స్ ఉందని, దీనికి వేసవి అలవెన్స్‌లు అదనంగా ఉంటాయని పేర్కొన్నారు. గతంలో 39 మండలాల్లోని 24 వేల శ్రమశక్తి సంఘాలకు షేడ్ నెట్లు ఇచ్చామని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వేసవిలో కూలీలు నీళ్లు తెచ్చుకునేందుకు రోజుకు రూ.5 ప్రకారం చెల్లిస్తామని పీడీ వివరించారు. నివాసిత ప్రాంతం నుంచి ఉపాధి పనికి వెళ్లడానికి దూరం 5 కిలోమీటర్లపైన ఉంటే రోజుకు రూ.15 చార్జీల కింద చెల్లిస్తామని, వికలాంగులకు రూ.20 ఇస్తామని తెలిపారు. గంపకు రోజుకు రూ.3 ఉంటుందని వివరించారు. ఉపాధి పనులకు వచ్చే కూలీలకు ఇవన్నీ సాఫ్ట్వేర్ ద్వారా ఆటోమేటిక్‌గా వస్తాయని పేర్కొన్నారు. కుటుంబానికి ఒక జాబ్‌కార్డు ఇచ్చామని, కుటుంబంలో ఎవరికైనా వివాహం అయి వేరు కాపురం పెట్టి ఉంటే వారికి ప్రత్యేక జాబ్ కార్డులు ఇస్తామని తెలిపారు. పని దినాలను 100 నుంచి 150కి ప్రభుత్వం పెంచిందన్నారు. ఇప్పటికే 100 రోజుల పనిదినాలను పూర్తి చేసుకున్న కుటుంబాలు మరో 50 రోజులు ఉపాధి పనులు చేయవచ్చని వివరించారు. పనికి వచ్చేవారికి తగిన వేతనం లభించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఉపాధి పనులు కల్పించకపోతే 70955 33220కు ఫోన్ చేయవచ్చని వివరించారు. -
ఉపాధి పనులకు 25 శాతం అదనపు కూలీ
కొయ్యూరు: ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఉపాధి హామీలో పని చేసే కూలీలకు 25 శాతం అదనంగా కూలీ చెల్లించనున్నట్టు పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి అయ్యన్నపాత్రుడు తెలిపారు. దీని కోసం రూ.450 కోట్ల అదనంగా ఖర్చు చేయాల్సి వస్తుందన్నారు. ఏప్రిల్, మేలో 30 శాతం, జూన్‌లో 20 శాతం (సగటున 25 శాతం) అదనంగా చెల్లిస్తామన్నారు. రానున్న ఐదేళ్లలో రాష్ర్టంలో ఐదు కోట్ల మొక్కలు నాటేందుకు లక్ష్యంగా నిర్ణయించినట్టు తెలిపారు. అందుకోసం నర్సరీలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. రైతులు తమకు అవసరమైన మొక్కలను నర్సరీల నుంచి తీసుకె ళ్లవచ్చన్నారు. కొయ్యూరులో ఆదివారం జరిగిన దివంగత మాజీ ఎమ్మెల్యే ఎం.వి.వి.సత్యనారాయణ కుమారులు అశోక్, గౌతమ్‌ల వివాహానికి మంత్రి హాజరయ్యారు. వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. వివిధ అభివృద్ధి పనుల నిమిత్తం పాడేరు నియోజకవర్గానికి రూ.12 కోట్లు కేటాయించినట్టు తెలిపారు. ఈ ఏడాది లక్షా 50 వేల హెక్టార్లలో రైతులకు అవసరమైన మొక్కలు సరఫరా చేస్తామన్నారు. గంధం మొక్కలను కూడా రైతులకు సరఫరా చేస్తామని చెప్పారు. ఇందు కోసం రూ.13 కోట్లు కేటాయించినట్టు తెలిపారు. భూగర్భ జలాల పెంపునకు చర్యలు భూగర్భ జలాలను పెంచేందుకు వీలుగా నీరు- చెట్టు కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. దీన్ని ఐదేళ్ల పాటు కొనసాగిస్తామన్నారు. దీనిలో భాగంగా మొదటి విడతలో జిల్లాలోని 438 చెరువులను రూ.13 కోట్లతో అభివృద్ధి చేయనున్నట్టు తెలిపారు. వాటిని బాగు చేయడం ద్వారా వర్షాకాలంలో నీటిని నిల్వ చేసుకుని భూగర్భ జలాలను పెంచుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మణికుమారి, ఎం.వి.ఎస్.ప్రసాద్, ఎంపీపీ లక్ష్మీనారాయణ, కొయ్యూరు ఎంపీపీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
పారిశుద్ధ్యం సమష్టి బాధ్యత
డ్వామా పీడీ ఢిల్లీరావు : పెద్దయ్యా నీ పేరేంటి? ఇక్కడ ఉపాధి పనులు దొరుకుతున్నాయా? కోటయ్య : నాపేరు కోటయ్యండీ.. పనులు బాగానే దొరుకుతున్నాయి. కానీ ప్రతి దానికీ ఆధార్ అడుగుతున్నారు. దీంతో కొంత ఇబ్బంది పడుతున్నాం సార్. డ్వామా పీడీ: ఆధార్‌తో అనుసంధానం అనేది తాత్కాలికంగా సమస్యలా కనిపించినా దాని వలన దీర్ఘకాలిక ప్రయోజనాలుంటాయి. ఢిల్లీరావు : మీరు చెప్పండి.. పేమెంట్లు సకాలంలో అందుతున్నాయా..? ఆలా సుబ్బారావు : నలుగురైదుగురు పనిచేస్తే పేమెంట్ కచ్చితంగా అందుతుంది సార్. అదే ఇద్దరు చేస్తే ఎందుకో తెలీదు పేమెంట్ అందక చాలా ఇబ్బంది పడుతున్నాం. ఢిల్లీరావు : బిల్లులు సకాలంలో అందేలా అన్ని చర్యలు తీసుకుంటాను. ఢిల్లీరావు : అమ్మా.. వ్యక్తిగత మరుగుదొడ్డి కట్టించుకున్నారా? బిల్లులు సక్రమంగానే అందుతున్నాయా? రాములమ్మ : కట్టించుకుంటున్నానయ్యా. బిల్లు అందింది. ఢిల్లీరావు : మీకు మరుగుదొడ్డి బిల్లు వచ్చిందా? జగన్నాధమ్మ: మెటీరియల్ వచ్చిందయ్యా. ఢిల్లీరావు : మరుగుదొడ్డి కట్టుకోమని మీకెవరు చెప్పారు? జగన్నాధమ్మ: ఎమ్మార్వోగారు ఢిల్లీరావు : (పక్కనే ఉన్న తహశీల్దారు విజయజ్యోతితో..)తహశీల్దారు గారూ.. ఈ గ్రామంలో మరుగుదొడ్ల నిర్మాణాలు ఏ దశలో ఉన్నాయి? తహశీల్దార్: ఎన్.బి.ఐ. కింద ఈ గ్రామంలో 147 వ్యక్తిగత మరుగుదొడ్లు మంజూరయ్యాయి సార్. వాటిలో 102 ఇప్పటికే నిర్మించేశాం. మిగిలిన సూపర్ స్ట్రక్చర్ దశలో ఉన్నాయి. ఈ నెల 24న సీఎం పర్యటనను దృష్టిలో ఉంచుకుని 23వ తేదీలోగా మిగిలిన వాటిని కూడా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. జిల్లాలోనే తొలిసారిగా సంపూర్ణ మరుగుదొడ్లు సాధించుకున్న గ్రామంగా తీర్చిదిద్దాలనే ధ్యేయంతో పని చేస్తున్నాం సార్. ఢిల్లీరావు : మంచిది. ఇంకా సమస్యలేమిటి? శేషయ్య : సార్.. మా గ్రామంలో మంచినీటి పంపులు చెడిపోయి మూడు మాసాలకు పైనే అయింది సార్. అధికారులకు ఫిర్యాదు చేశాం. ఈ మధ్యనే మరమ్మతు చేసేందుకు ఒకాయన వచ్చారు. పంపులన్నీ విప్పి చూసి, పంపుకు రూ.600 ఇస్తే నేరిపేర్ చేస్తానని చెప్పి వెళ్లిపోయాడు సార్! ఢిల్లీరావు : (ఒకింత ఆగ్రహంగా) అన్ని పంపులూ ఒకేసారి చెడిపోయాయా? మరమ్మతులకు డబ్బులడుగుతున్నారా? ఎంపీడీవో ఎక్కడయ్యా? ఎంపీడీవో పాండు : ఇక్కడే ఉన్నాను సార్. ఢిల్లీరావు : శేషయ్య చెప్పింది మీరు విన్నారా? ఎంపీడీవో : నేను బాధ్యతలు చేపట్టి 15 రోజులే అయింది సార్. ఇప్పటి వరకు ఈ సమస్యను ఎవరూ నా దృష్టికి తేలేదు. వెంటనే పంపుల మరమ్మతులకు అవసరమైన చర్యలు తీసుకుంటాను. అధికారులతో నేనే మాట్లాడి గ్రామంలో మంచినీటి సమస్య పరిష్కారమయ్యేలా చూస్తాను. ఢిల్లీరావు : ఏం పెద్దాయనా నీ సమస్యేమిటి? గడ్డి కోటయ్య : నా పేరు కోటయ్యండి. ఆధార్ కార్డు లేదని మొదట్లో పింఛన్ నిలిపేశారయ్యా. తర్వాత ఆధార్ కార్డు సంపాదించుకున్నా కానీ పింఛన్ మాత్రం దక్కలేదయ్యా. ఢిల్లీరావు : ఆధార్ కార్డు ఉండి, అర్హులైన వారికి పింఛన్ రాకపోవడం ఉండదు. ఏదో పొరపాటు జరిగి ఉంటుంది. అధికారులందరూ ఇక్కడే ఉన్నారు కనక మీరు తర్వాత వారిని కలవండి. వారు రికార్డులు తనిఖీ చేసి మీకు పింఛన్ వచ్చేలా చూస్తారు. సుగుణ : సార్, మా గ్రామంలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. వర్షాకాలం వచ్చిందంటే మురుగునీళ్లన్నీ నేరుగా ఇళ్లలోకి వస్తున్నాయి. ఢిల్లీరావు : (అక్కడే ఉన్న సర్పంచ్ ప్రసాద్‌ను పిలిచి) ఏమండి, మీ గ్రామ నిధులతో ఇలాంటి చిన్న పనులు కూడా చేసుకోలేక పోతే ఎలాగండీ. ఎందుకని ఒక్క రోడ్డు కూడా వేయించలేకపోయారు? సర్పంచ్ : మా గ్రామంలో వచ్చే ఆదాయం అంతంతమాత్రం సార్. గతంలో చెరువు పాట వలన నాలుగైదు లక్షలు వచ్చేయి. ఇప్పుడు అది కూడా ఆపేశారు. దీనిపై డీపీవో గారిని అడిగాం. అయినా ఆయన అదిగో ఇదిగో అంటున్నారు. ఇంకెలా పనులు చేసుకోగలమండీ..? ఢిల్లీరావు : సరే డీపీవోతో మాట్లాడి మీ చెరువుకు పాట జరిగే విధంగా చూస్తాను. 13వ ఆర్థిక సంఘం నిధులతో ఈ గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణం జరిగేలా అన్ని చర్యలూ తీసుకుంటా. ఢిల్లీరావు : (సిమెంట్ రోడ్లపై పశువులను కట్టేసి ఉండటం, ఇళ్ల పక్కనే మురుగునీటి నిల్వలు చూసి. ఎంపీటీసీ అరుణకుమారితో) ఇలా రోడ్లపై మూగజీవాలను కట్టేయడమేమిటమ్మా? ఎంపీటీసీ : ఇది చాలా ఇబ్బందికరమైన సమస్యే సార్. కాలువల్లో వెంటనే పూడిక తీయిస్తాం సార్. మురుగునీరు నిల్వ ఉండకుండా చూసుకుంటాం. ఢిల్లీరావు : ఇలా అపరిశుభ్ర వాతావరణం ఉంటే రోగాలు ప్రబలే అవకాశం ఉంది. దీనిపై మీరే గ్రామ ప్రజల్లో అవగాహన పెంచాలి చెప్పారు. ఎంపీటీసీ: అలాగే సార్. తప్పకుండా దీనిపై స్థానికుల్లో అవగాహన కల్పిస్తాం. రాములు : మా గ్రామంలో అసలు పంచాయతీ కార్యాలయమే లేదండీ.. సర్పంచ్ : నిజమే సార్. మూడు సెంట్ల స్థలం ఉంది కానీ. నిధులు లేక ఇంత వరకు సొంత భవనం నిర్మించుకోలేక పోయాం. ఢిల్లీరావు : ఏమ్మా ఎలా ఉన్నారు? మీకేమైనా సమస్య ఉంటే చెప్పండమ్మా? తిరుపతమ్మ : అయ్యా ఇక్కడ దోమల బెడద చాలా ఎక్కువయ్యా. కనీసం సైడు కాలువల్లో దోమల మందు కూడా కొట్టడం లేదు. అధికారులుంది మాకు సేవ చేయడానికా.. కాదా? ఢిల్లీరావు : చుట్టూ అపరిశుభ్ర వాతావరణం ఉంటే దోమలుండటం మామూలే. అధికారులు దోమల మందు కొట్టడం లేదంటున్నారు సరే. ముందు మీ వంతుగా చేయాల్సిన బాధ్యతను ఎందుకు విస్మరిస్తున్నారు? ప్రజలు, అధికారుల పరస్పర భాగస్వామ్యంతోనే ఏ సమస్య అయినా పరిష్కారం అవుతుంది. తొలుత మీరు మీ ఇంటి చుట్టుపక్కల నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ఆ తర్వాత అధికారులను నిలదీయాలి. అదే స్వచ్ఛభారత్ అసలు సిసలు లక్ష్యం. ఉపాధి హామీ పథకంలో త్వరలో కచ్చా డ్రైన్స్ నిర్మాణానికి పూనుకుంటాం. ఢిల్లీరావు : (ఒక ఇంటి ఆవరణలో ఆరబోసిన మిర్చిని చూసి..) మిర్చి గిట్టుబాటు ధర ఎలా ఉంది..? రైతు శేషయ్య: ఎకరం కౌలు పొలంలో తేజ రకం మిర్చి సాగు చేశాను. గిట్టుబాటు ధర లేదు. వచ్చే అరకొర సొమ్ము పెట్టుబడ్జికే సరిపోతోంది సార్. ఢిల్లీరావు : అధికారులతో మాట్లాడి పంటకు గిట్టుబాటు ధర దక్కేలా చర్యలు తీసుకుంటాను. ఢిల్లీరావు : (రామాలయం సెంటర్లో ఉన్న గ్రామ పెద్దలతో..) నమస్కారం.. ఎలా ఉన్నారు..! గ్రామ పెద్దలు : ఇప్పటికి బోలెడంత మంది అధికారులు, ప్రజాప్రతినిధులు మా ఊరికి వచ్చారు.. వెళ్లారు. ఎవరూ ఏమీ చేసింది లేదు. మా నియోజకవర్గ ఎమ్మెల్యే, అసెంబ్లీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు మా గ్రామాన్ని దత్తత తీసుకుంటామంటున్నారు. అలాగైనా మాకు మౌలిక వసతులు సమకూరితే మంచిది. -
మళ్లీ ఉపాధి జాతర
=రేపటి నుంచి పనుల ప్రారంభం =వాటి విలువ రూ.813.27 కోట్లు =వచ్చే నెలలో 70వేల మందికి పని కల్పించాలని లక్ష్యం =పోస్టల్ ద్వారానే చెల్లింపులు సాక్షి, విశాఖపట్నం : గ్రామాల్లో మళ్లీ ఉపాధి జాతర మొదలవుతోంది. ఖరీఫ్ ప్రారంభంలో నిలిపేసిన ఉపాధి పనులు ఆదివారం నుంచి చేపడుతున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేశారు. మార్చి నెలాఖరుకు రూ.81కోట్ల పనుల నిర్వహణకు చర్యలు తీసుకున్నారు. ఒక్క డిసెంబర్లోనే 70వేల మందికి పని కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పని కావాల్సిన వారంతా ఫీల్డ్ అసిస్టెంట్లకు శనివారం దరఖాస్తు చేసుకోవాలని డ్వామా పీడీ ఆర్.శ్రీరాములనాయుడు కోరారు. అడిగిన వారందరికీ పని కల్పించే లక్ష్యంతో జిల్లాలో రూ.813.27కోట్లు విలువైన63,622 పనుల్ని గుర్తించారు. అన్ని గ్రామాల్లోనూ పనులు ప్రారంభించనున్నారు. గ్రామంలోని శ్రమశక్తి సంఘాల్లో 40 శాతం హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని, డిసెంబర్లో ప్రతీ ఒక్కరికీ 15 రోజులకు తక్కువ కాకుండా పని కల్పించాలని ఫీల్డ్ అసిస్టెంట్లకు అధికారులు లక్ష్యాన్ని నిర్దేశించారు. వారానికోసారి పోస్టాఫీసుల ద్వారా చెల్లింపులుంటాయి. ఈమేరకు 12మండలాల్లో పోస్టల్ శాఖ ఇప్పటికే ఏర్పాట్లు చేసుకుంది. మిగతా మండలాల్లో వచ్చేనెలలో పూర్తి చేసేలా చర్యలు తీసుకున్నారు. జనవరి ఒకటో తేదీ నుంచి పోస్టల్ ద్వారానే అన్ని మండలాల్లో వేతనాలు పంపిణీకి లక్ష్యం నిర్దేశించారు. గతంలో మాదిరి చెరువు పనులే కాకుండా డంపింగ్‌యార్డ్‌లు, రైతుల పొలాల చదును, కల్లాలు ఎత్తుచేసుకునే పనులు, కరకట్టల నిర్మాణం, మొక్కల పెంపకం, నీటి నిల్వ యాజమాన్యం,పండ్ల తోటల పెంపకం, శ్మశానం రోడ్లు, పాఠశాల,ఆసుపత్రి పరిసరాల అభివృద్ధి పనులు, మట్టి ఫిల్లింగ్, నీటి గుంటలు, చెరువు గట్లు పటిష్టం తదితర పనులు చేపట్టనున్నారు. ప్రత్యేక నిఘా : గతంలో జరిగిన అవతవకలు, అక్రమాలను దృష్ట్యా ఈసారి ఉపాధి పనులపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. పనుల ప్రారంభమైన నాటి నుంచి వేతనాలు చెల్లించే వరకూ ప్రత్యేక నిఘా పెడుతున్నారు. అక్రమాలకు పాల్పడిన వారిపై తక్షణం విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఈమేరకు పంచాయతీ పాలక వర్గాల్ని భాగస్వామ్యం చేసుకోనున్నారు.