=రేపటి నుంచి పనుల ప్రారంభం
=వాటి విలువ రూ.813.27 కోట్లు
=వచ్చే నెలలో 70వేల మందికి పని కల్పించాలని లక్ష్యం
=పోస్టల్ ద్వారానే చెల్లింపులు
సాక్షి, విశాఖపట్నం : గ్రామాల్లో మళ్లీ ఉపాధి జాతర మొదలవుతోంది. ఖరీఫ్ ప్రారంభంలో నిలిపేసిన ఉపాధి పనులు ఆదివారం నుంచి చేపడుతున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేశారు. మార్చి నెలాఖరుకు రూ.81కోట్ల పనుల నిర్వహణకు చర్యలు తీసుకున్నారు. ఒక్క డిసెంబర్‌లోనే 70వేల మందికి పని కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పని కావాల్సిన వారంతా ఫీల్డ్ అసిస్టెంట్లకు శనివారం దరఖాస్తు చేసుకోవాలని డ్వామా పీడీ ఆర్.శ్రీరాములనాయుడు కోరారు.
అడిగిన వారందరికీ పని కల్పించే లక్ష్యంతో జిల్లాలో రూ.813.27కోట్లు విలువైన63,622 పనుల్ని గుర్తించారు. అన్ని గ్రామాల్లోనూ పనులు ప్రారంభించనున్నారు. గ్రామంలోని శ్రమశక్తి సంఘాల్లో 40 శాతం హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని, డిసెంబర్‌లో ప్రతీ ఒక్కరికీ 15 రోజులకు తక్కువ కాకుండా పని కల్పించాలని ఫీల్డ్ అసిస్టెంట్లకు అధికారులు లక్ష్యాన్ని నిర్దేశించారు. వారానికోసారి పోస్టాఫీసుల ద్వారా చెల్లింపులుంటాయి. ఈమేరకు 12మండలాల్లో పోస్టల్ శాఖ ఇప్పటికే ఏర్పాట్లు చేసుకుంది.
మిగతా మండలాల్లో వచ్చేనెలలో పూర్తి చేసేలా చర్యలు తీసుకున్నారు. జనవరి ఒకటో తేదీ నుంచి పోస్టల్ ద్వారానే అన్ని మండలాల్లో వేతనాలు పంపిణీకి లక్ష్యం నిర్దేశించారు. గతంలో మాదిరి చెరువు పనులే కాకుండా డంపింగ్‌యార్డ్‌లు, రైతుల పొలాల చదును, కల్లాలు ఎత్తుచేసుకునే పనులు, కరకట్టల నిర్మాణం, మొక్కల పెంపకం, నీటి నిల్వ యాజమాన్యం,పండ్ల తోటల పెంపకం, శ్మశానం రోడ్లు, పాఠశాల,ఆసుపత్రి పరిసరాల అభివృద్ధి పనులు, మట్టి ఫిల్లింగ్, నీటి గుంటలు, చెరువు గట్లు పటిష్టం తదితర పనులు చేపట్టనున్నారు.
ప్రత్యేక నిఘా : గతంలో జరిగిన అవతవకలు, అక్రమాలను దృష్ట్యా ఈసారి ఉపాధి పనులపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. పనుల ప్రారంభమైన నాటి నుంచి వేతనాలు చెల్లించే వరకూ ప్రత్యేక నిఘా పెడుతున్నారు. అక్రమాలకు పాల్పడిన వారిపై తక్షణం విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఈమేరకు పంచాయతీ పాలక వర్గాల్ని భాగస్వామ్యం చేసుకోనున్నారు.
మళ్లీ ఉపాధి జాతర
Published Sat, Nov 30 2013 1:00 AM | Last Updated on Sat, Sep 2 2017 1:06 AM
Advertisement
Advertisement