నెల్లూరు, సిటీ: కాంట్రాక్టు విధానాన్నే కౌన్సిల్ ఆమోదించిన నేపథ్యంలో పారి శుధ్య కార్మికులు కన్నెర్ర చేశారు. కార్పొరేషన్‌ను దిగ్బంధించారు. సొసైటీ కార్మికుల కాంట్రాక్టు విధానాన్ని నిరసిస్తూ కార్మికులు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. నెల్లూరు కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం ప్రారంభానికి ముందే కార్యాలయం గేటు ఎదుట ఉదయం నుంచే ధర్నాకు దిగారు. అయితే కార్పొరేషన్‌లో జరిగిన కౌన్సిల్ సమావేశంలో టీడీపీ సభ్యులు ఏకపక్షంగా కాంట్రాక్టు విధానానికి ఆమోదం తెలపటంతో కార్మికుల భగ్గుమన్నారు. అంతవరకు గేటు ముందు నిరసన తెలియజేస్తున్న వారంతా ఒక్కసారిగా కార్యాలయంలోకి చొచ్చుకొచ్చే ప్రయత్నం చేశారు.
వారిని నిలువరించేందుకు పోలీసులు ప్రయత్నించినా గోడలు దూకి కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకోవటంతో కార్యాలయం ఎదుట బైఠాయించారు. పారిశుధ్య కార్మికులను టెండర్ల పద్ధతి ద్వారా కాంట్రాక్టర్లకు అప్పగించే విధానాన్ని ఒప్పుకునేది లేదని తేల్చిచెప్పారు. కాంట్రాక్టు విధానం ఆమోదించిన మేయర్ అజీజ్‌పై తీవ్రంగా మండిపడ్డారు. శాపనార్థాలు పెడుతూ.. తిట్టడం ప్రారంభించారు. ‘మేము ఓట్లేస్తే గెలిచిన అజీజ్ మేయరై మా పొట్టకొడతావా?’ అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
కౌన్సిల్ ఆమోదం తెలిపిందని తెలియగానే కార్మికుడు శీనయ్య సృహతప్పి పడిపోయారు. హుటాహుటిన తోటి కార్మికులు అతడిని 108 వాహనం ద్వారా ఆస్పత్రికి తరలించారు. ఆ దృశ్యాన్ని చూసిన కార్మికులు మరింత రెచ్చిపోయారు. ‘మేయర్ డౌన్ డౌన్. మేయర్ దొంగ’ అంటూ నినాదాలు చేస్తూ లోనికి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. వీరికి వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లతో పాటు సీపీఎం, కాంగ్రెస్ కార్పొరేటర్లు మద్దతు తెలిపారు. కార్మికులతో పాటు వారూ కార్యాలయం ముందు బైఠాయించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కార్మికుల ఆందోళన కొనసాగింది.
మేయర్ వాహనాన్ని అడ్డుకున్న కార్మికులు
కౌన్సిల్ సమావేశం ముగిసిన మేయర్, టీడీపీ కార్పొరేటర్లు బయటకు రాకుండా కార్యాలయంలోనే ఉండిపోయారు. కార్మికులు ఎంతకీ ఆందోళనను విరమించుకోకపోవటంతో చేసేది లేక మేయర్, మరికొందరు టీడీపీ కార్పొరేటర్లు బయటకు వచ్చారు. మేయర్ అజీజ్ ఆందోళనకారుల వద్దకు చేరుకొని వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అయితే కార్మికులు మేయర్‌ను మాట్లాడనివ్వకుండా మేయర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. దీంతో మేయర్ అక్కడ్నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నించారు. అయితే కార్మికులు వాహనాన్ని అడ్డుకున్నారు. కొందరు మహిళలైతే చెప్పులు విసిరే ప్రయత్నం చేశారు. మరికొందరు చెప్పులు చూపుతూ శాపనార్థాలు పెట్టటం కనిపించింది.
పోలీసుల సాయంతో మేయర్ వాహనంలో వెళ్లిపోయినా కార్మికులు తమ ఆందోళనను కొనసాగించారు. ఈ క్రమంలో పోలీసులకు, కార్మికులకు మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. బిల్లు ఆమోదించడంపై కార్మికులు మేయర్‌కు శాపనార్థాలు పెట్టారు. వైఎస్సార్‌సీపీ నుంచి గెలిచి టీడీపీలో చేరి మా పొట్టగొడుతున్నారని ధ్వజమెత్తారు. పదేళ్ల క్రితం నుంచి ఈ జీఓ ఉన్నప్పటికీ ఏ పార్టీ ఆమోదించని బిల్లును మేయర్ ఆమోదించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
కార్మికుల అరెస్ట్..
బిల్లు ఆమోదం తర్వాత ఆందోళన చేస్తున్న పారిశుధ్య కార్మికుల వద్దకు మేయర్ వచ్చి సర్ధిచెప్పేందుకు ప్రయత్నించారు. కార్మికులకు ఎటువంటి అన్యాయం జరగనివ్వమని, న్యాయం జరిగేలా చూస్తానన్నారు. ఈ సమయంలో ఓ కార్మికుడు నగర మేయర్‌ను మాట్లాడనివ్వకుండా అడ్డుపడ్డాడు. బిల్లు ఆమోదించి మాకడుపు కొట్టారని మేయర్‌ను నిలదీశారు. మేయర్ మాటలకు కార్మికులు అడ్డుతగులుతుండటంతో ఆయన కార్పొరేషన్ కార్యాలయం నుంచి బయటకు వెళ్లే ప్రయత్నం చేశారు. అయితే కార్మికులు ఆయన వాహనం చక్రాల కింద పడుకొన్నారు. దీంతో పోలీసులు కార్మికులను, సీపీఎం నాయకులను అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
పారిశుధ్య కార్మికుల కన్నెర్ర
Published Sun, Feb 8 2015 3:55 AM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM
Advertisement