Corporation Council
-
కుదిపేసిన హోదా
ప్రత్యేక హోదా అంశం కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశాన్ని కుదిపేసింది. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని హోదాకు మద్దతుగా కార్పొరేటర్లందరూ రాజీనామాలు చేయాలని, దీనికి కౌన్సిల్ తీర్మానం చేయాలని వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు చేసిన ప్రతిపాదనకు అధికారపక్ష సభ్యులు అడ్డు తగిలారు. ఈ అంశంపై చర్చించాలని విపక్ష కార్పొరేటర్లు పట్టుబట్టడంతో మేయర్ కోనేరు శ్రీధర్ ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తూ ప్రత్యేక హోదా అంశాన్ని లేవనెత్తిన కార్పొరేటర్లను సస్పెండ్ చేయాలని ఆదేశించారు. తొలుత 18 వ డివిజన్ కార్పొరేటర్ పాల ఝాన్సీ ప్రభుత్వ చేతకానితనాన్ని విమర్శించారు. ఆమెకు తోడు తమ గళాన్ని విప్పిన మరో ముగ్గురు కార్పొరేటర్ల సైతం సస్పెండ్ చేయడంతో సమావేశం అట్టుడికింది. పటమట (విజయవాడ తూర్పు) : ‘టీడీపీకి చిత్తశుద్ధి ఉంటే వెంటనే హోదాకు మద్దతుగా తీర్మానాన్ని ప్రవేశపెట్టండి.. రాష్ట్ర భవిష్యత్తు దృష్టిలో ఉంచుకుని ప్రతి కార్పొరేటర్ ఈ అంశంపై నిలబడాలి..’ అంటూ వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు వీఎంసీ కౌన్సిల్ సమావేశంలో పెట్టిన ప్రతిపాదన పెద్ద దుమారమే రేపింది. దీనిపై చర్చించాలని విపక్ష కార్పొరేటర్లు పట్టుబడటంతో మేయర్ కోనేరు శ్రీధర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రత్యేక హోదా అంశాన్ని లేవనెత్తిన కార్పొరేటర్లను సస్పెండ్ చేయాలని ఆదేశించారు. బుధవారం జరిగిన కౌన్సిల్ సమావేశంలో విపక్ష సభ్యులపై టీడీపీ సభ్యులు విరుచుకుపడ్డారు. 18వ డివిజన్ కార్పొరేటర్ పాల ఝాన్సీ మాట్లాడుతూ చేతకాని ప్రభుత్వం అని ప్రభుత్వ వైఖరిని విమర్శించగానే మేయర్ ఆమెను సస్పెండ్ చేయాలని ఆదేశించారు. దీనికి వ్యతిరేకంగా తమ గళాన్ని విప్పిన మరో ముగ్గురు కార్పొరేటర్లను కూడా సస్పెండ్ చేయాలన్నారు. మేయర్ వైఖరికి నిరసనగా విపక్ష సభ్యులు చందన సురేష్, మద్దా శివశంకర్, ఆసీఫ్ మేయర్ పోడియం వద్ద బైఠాయించగా వీరిని కూడా సస్పెండ్ చేస్తున్నట్లు మేయర్ ప్రకటించారు. ఆ సందర్భంలో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. అధికార, విపక్ష సభ్యుల వాద ప్రతివాదనలతో కౌన్సిల్ హాలు దద్దరిల్లింది. ప్రభుత్వ వైఖరికి నిరసనగా విపక్ష ఫ్లోర్ లీడర్ బండి పుణ్యశీల సారథ్యంలో వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు బి.జాన్‌బీ, కావటి దామోదర్, బుల్ల విజయ్‌కుమార్, పల్లె రవి, టి.జనుల, పూర్ణమ్మ వాకౌట్ చేశారు. స్పృహ తప్పిన కార్పొరేటర్ పాలఝాన్సీ సస్పెండైన పాల ఝాన్సీని సభ నుంచి పంపేయడానికి మార్షల్ బలవంతంగా ఈడ్చుకువెళ్లే సమయంలో ప్రతిఘటిస్తున్న సమయంలో అస్వస్తతకు గురయ్యారు. మార్షల్స్ కౌన్సిల్ బయటకు తీసుకువస్తుండగా స్పృహ కోల్పోయారు. సుమారు 25 నిమిషాల పాటు ఆమెను అధికార యంత్రాంగం పట్టించుకోకపోవడంతో పరిస్థితి విషమించే సందర్భంలో రంగంలోకి దిగిన పోలీసులు ఆమెను అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. -
‘ఖమ్మం’ ప్రథమ పౌరుడు పాపాలాలే
♦ ఇద్దరి ఎన్నిక ఏకగ్రీవం ♦ మేయర్ ఎన్నికకు దూరంగా ఉన్న కాంగ్రెస్ కార్పొరేటర్లు ♦ డిప్యూటీ మేయర్‌గా బత్తుల మురళి ఖమ్మం: ఆరున్నర సంవత్సరాల తర్వాత ఖమ్మం కార్పొరేషన్ కొత్త కౌన్సిల్ మంగళవారం కొలువుదీరింది. కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం వరకు మేయర్, డిప్యూటీ మేయర్ పేర్లు ప్రకటించలేదు. దీంతో అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలోనే మేయర్‌గా 2వ డివిజన్ నుంచిగెలుపొందిన పాపాలాల్, డిప్యూటీ మేయర్‌గా 24వ డివిజన్ నుంచి గెలుపొందిన బత్తుల మురళిని సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఒకటవ డివిజన్ కార్పొరేటర్ గైర్హాజరు కాగా.. మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలో పాల్గొనకుండానే కాంగ్రెస్ కార్పొరేటర్లు కౌన్సిల్ నుంచి వెనుదిరిగారు. 49 మంది కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం కార్పొరేషన్ ఎన్నికల్లో గెలుపొందిన 50 మంది కార్పొరేటర్లలో ఒకటవ డివిజన్ నుంచి గెలుపొందిన రామ్మూర్తి మినహా మిగిలిన 49 మంది కౌన్సిల్ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. టీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయం నుంచి బస్సులో టీఆర్ఎస్ సభ్యులు కార్పొరేషన్‌కు వచ్చారు. అనంతరం రాష్ట్ర రోడ్లు భవనాలు, స్త్రీ, శిశుసంక్షేమశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు షేక్ బుడాన్ బేగ్, టీఆర్ఎస్ ఖమ్మం నియోజకవర్గ ఇన్చార్జ్ ఆర్జేసీ కృష్ణలు కార్పొరేషన్‌కు చేరుకున్నారు. ఆ తర్వాత గదిలో సభ్యులతో కొద్దిసేపు సమావేశం ఏర్పాటు చేసి మేయర్, డిప్యూటీ మేయర్ అభ్యర్థుల పేర్లు ప్రకటించారు. సరిగ్గా ఉదయం 11 గంటలకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి హోదాలో జిల్లా కలెక్టర్ లోకేష్‌కుమార్, కార్పొరేషన్ కమిషనర్ వేణుగోపాల్‌రెడ్డిలు సభను ప్రారంభించారు. ముందుగా 33 మంది టీఆర్ఎస్ కార్పొరేటర్లు, ఆ తర్వాత వైఎస్సార్సీపీ, సీపీఐ, సీపీఎం, సభ్యులతోపాటు ఎనిమిది మంది కాంగ్రెస్ కార్పొరేటర్లు సమావేశానికి హాజరయ్యారు. వీరితో ముందుగా కలెక్టర్ లోకేష్‌కుమార్ మాట్లాడి ప్రమాణ స్వీకారం చేయాల్సిందిగా ఆహ్వానించారు. కమిషనర్ వేణుగోపాల్‌రెడ్డి ప్రమాణ పత్రాన్ని చదవగా...కార్పొరేటర్లు చదువుతూ ప్రమాణ స్వీకారం చేశారు. ఇది జరిగిన తర్వాత కాంగ్రెస్ కార్పొరేటర్లు పాలడుగు పాపారావు, వడ్డెబోయిన నర్సింహారావులు సమావేశానికి హాజరు కావడంతో వారితో వేర్వేరుగా కమిషనర్ ప్రమాణ స్వీకారం చేయించారు. మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నిక ఇలా... టీఆర్ఎస్ పార్టీ నుంచి సీల్డ్ కవర్లో వచ్చిన మేయర్, డిప్యూటీ మేయర్ల పేర్లను ముందుగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు టీఆర్ఎస్ కార్పొరేటర్లకు తెలిపారు. అధినేతలు చెప్పిన విధంగా 16వ డివిజన్ కార్పొరేటర్ కమర్తపు మురళి రెండవ డివిజన్ కార్పొరేటర్ పాపాలాల్‌ను మేయర్ అభ్యర్థిగా ప్రతిపాదించగా, 17వ డివిజన్ కార్పొరేటర్ పునుకుళ్ల నీరజ బలపర్చారు. అదేవిధంగా డిప్యూటీ మేయర్ పదవికి 24వ డివిజన్ కార్పొరేటర్ బత్తుల మురళి పేరును 26వ డివిజన్ కార్పొరేటర్ పగడాల నాగరాజు ప్రతిపాదించగా 10వ డివిజన్ కార్పొరేటర్ నీరజ బలపర్చారు. దీంతో మేయర్, డిప్యూటీ మేయర్ పదవులకు పోటీ లేకపోవడంతో పాపాలాల్, బత్తుల మురళిలను మేయర్, డిప్యూటీ మేయర్లుగా ఏకగ్రీవంగా ఎంపిక చేసినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ లోకేష్‌కుమార్ ప్రకటించారు. కార్పొరేటర్లకు మంత్రి తుమ్మల, కలెక్టర్ అభినందనలు నూతనంగా ఎన్నికై ప్రమాణ స్వీకారం చేసిన మేయర్, డిప్యూటీ మేయర్లు పాపాలాల్, బత్తుల మురళితోపాటు అధికార టీఆర్ఎస్, కాంగ్రెస్, వైఎస్సార్సీపీ, సీపీఐ, సీపీఎం సభ్యులకు రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేరుపేరునా అభినందనలు తెలిపారు. మంత్రి సభ్యుల వద్దకు వెళ్లి కార్పొరేషన్ అభివృద్ధికి పని చేయాలని కోరడం విశేషం. అదేవిధంగా ఎన్నికల పరిశీలకులు ఇలంబరితి, రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ లోకేష్‌కుమార్, కార్పొరేషన్ కమిషనర్ వేణుగోపాల్‌రెడ్డితోపాటు, ఎమ్మెల్సీలు బాలసాని లక్ష్మీనారాయణ, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పార్టీల నాయకులు, ఉద్యోగ సంఘాల నాయకులు, కుటుంబ సభ్యులు అభినందనలు తెలిపారు. పాపాలాల్ బయోడేటా పేరు : గుగులోత్ పాపాలాల్ జన్మస్థలం : డోర్నకల్, వరంగల్ జిల్లా తల్లిదండ్రులు: బంద్యానాయక్, జంకు ఐదుగురు కుమారుల్లో పాపాలాల్ నాలుగో సంతానం నేపథ్యం : వ్యవసాయ కుటుంబం విద్యాభ్యాసం: 10వ తరగతి వరకు డోర్నకల్ మిషన్ హైస్కూల్, ఇంటర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల మహబూబాబాద్, ఎంబీబీఎస్, ఎండీ కాకతీయ మెడికల్ కళాశాల, వరంగల్ ఉద్యోగం: మొదటి పోస్టింగ్ వరంగల్ జిల్లా మంగపేట మండల ప్రభుత్వాస్పత్రి డాక్టర్‌గా 1981లో రెండు నెలలపాటు, అనంతరం మరిపెడ ప్రభుత్వాస్పత్రి డాక్టర్‌గా 1987 వ సంవత్సరం వరకు, 1987 నుంచి 1999 వరకు నేలకొండపల్లి ప్రభుత్వాస్పత్రి డాక్టర్‌గా, 1999 నుంచి 2003 వరకు ఖమ్మం ప్రధానాస్పత్రి సూపరింటెండెంట్‌గా, 2010 నుంచి 2012 జూలై పదవీ విరమణ వరకు ఖమ్మం ప్రభుత్వాస్పత్రి డీసీహెచ్‌గా పనిచేశారు. కుటుంబం భార్య: డాక్టర్ ధర్జన్, ఆర్జేడీ ఉన్నత విద్యాశాఖ సంతానం: ముగ్గురు కుమార్తెలు పెద్దకుమార్తె : డాక్టర్ అర్పిత, పిల్లల వైద్య నిపుణులు, అల్లుడు: డాక్టర్ తేజ్‌కుమార్, ఎముకల వైద్య నిపుణులు, ఖమ్మం. రెండవ కుమార్తె: అమృత ఐపీఎస్, అల్లుడు: మనోజ్ ఐపీఎస్, డీసీపీ ఢిల్లీ మూడవ కుమార్తె: డాక్టర్ అశ్విత రేడియాలజిస్టు, అల్లుడు: పురుషోత్తం మత్తు డాక్టర్ ముంబై, నివాసం: మామిళ్లగూడెం, ఖమ్మం బత్తుల మురళి బయోడేటా పేరు: బత్తుల మురళీ ప్రసాదరావు పుట్టినతేది: 15-07-1973 స్వగ్రామం: గోపాలరావుపేట (జీళ్లచెర్వు గ్రామపంచాయతీ), కూసుమంచి మండలం ప్రస్తుత నివాసం: బ్యాంక్ కాలనీ, ఖమ్మం విద్యార్హత: డిగ్రీ తల్లిదండ్రులు: కమలమ్మ -రామయ్య (లేట్) భార్య: రాధిక, కొడుకు: గణేష్ ఇప్పటి వరకు నిర్వహించిన పదవులు: 2001లో ఖానాపురం హవేలి ఎంపీటీసీ, 2005లో ఖానాపురం హవేలి ఉపసర్పంచ్ ప్రస్తుతం 24వ డివిజన్ నుంచి కార్పొరేటర్‌గా గెలిచి డిప్యూటీ మేయర్‌గా ఎన్నికయ్యారు. -
పారిశుధ్య కార్మికుల కన్నెర్ర
నెల్లూరు, సిటీ: కాంట్రాక్టు విధానాన్నే కౌన్సిల్ ఆమోదించిన నేపథ్యంలో పారి శుధ్య కార్మికులు కన్నెర్ర చేశారు. కార్పొరేషన్‌ను దిగ్బంధించారు. సొసైటీ కార్మికుల కాంట్రాక్టు విధానాన్ని నిరసిస్తూ కార్మికులు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. నెల్లూరు కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం ప్రారంభానికి ముందే కార్యాలయం గేటు ఎదుట ఉదయం నుంచే ధర్నాకు దిగారు. అయితే కార్పొరేషన్లో జరిగిన కౌన్సిల్ సమావేశంలో టీడీపీ సభ్యులు ఏకపక్షంగా కాంట్రాక్టు విధానానికి ఆమోదం తెలపటంతో కార్మికుల భగ్గుమన్నారు. అంతవరకు గేటు ముందు నిరసన తెలియజేస్తున్న వారంతా ఒక్కసారిగా కార్యాలయంలోకి చొచ్చుకొచ్చే ప్రయత్నం చేశారు. వారిని నిలువరించేందుకు పోలీసులు ప్రయత్నించినా గోడలు దూకి కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకోవటంతో కార్యాలయం ఎదుట బైఠాయించారు. పారిశుధ్య కార్మికులను టెండర్ల పద్ధతి ద్వారా కాంట్రాక్టర్లకు అప్పగించే విధానాన్ని ఒప్పుకునేది లేదని తేల్చిచెప్పారు. కాంట్రాక్టు విధానం ఆమోదించిన మేయర్ అజీజ్‌పై తీవ్రంగా మండిపడ్డారు. శాపనార్థాలు పెడుతూ.. తిట్టడం ప్రారంభించారు. ‘మేము ఓట్లేస్తే గెలిచిన అజీజ్ మేయరై మా పొట్టకొడతావా?’ అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కౌన్సిల్ ఆమోదం తెలిపిందని తెలియగానే కార్మికుడు శీనయ్య సృహతప్పి పడిపోయారు. హుటాహుటిన తోటి కార్మికులు అతడిని 108 వాహనం ద్వారా ఆస్పత్రికి తరలించారు. ఆ దృశ్యాన్ని చూసిన కార్మికులు మరింత రెచ్చిపోయారు. ‘మేయర్ డౌన్ డౌన్. మేయర్ దొంగ’ అంటూ నినాదాలు చేస్తూ లోనికి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. వీరికి వైఎస్సార్సీపీ కార్పొరేటర్లతో పాటు సీపీఎం, కాంగ్రెస్ కార్పొరేటర్లు మద్దతు తెలిపారు. కార్మికులతో పాటు వారూ కార్యాలయం ముందు బైఠాయించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కార్మికుల ఆందోళన కొనసాగింది. మేయర్ వాహనాన్ని అడ్డుకున్న కార్మికులు కౌన్సిల్ సమావేశం ముగిసిన మేయర్, టీడీపీ కార్పొరేటర్లు బయటకు రాకుండా కార్యాలయంలోనే ఉండిపోయారు. కార్మికులు ఎంతకీ ఆందోళనను విరమించుకోకపోవటంతో చేసేది లేక మేయర్, మరికొందరు టీడీపీ కార్పొరేటర్లు బయటకు వచ్చారు. మేయర్ అజీజ్ ఆందోళనకారుల వద్దకు చేరుకొని వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అయితే కార్మికులు మేయర్‌ను మాట్లాడనివ్వకుండా మేయర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. దీంతో మేయర్ అక్కడ్నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నించారు. అయితే కార్మికులు వాహనాన్ని అడ్డుకున్నారు. కొందరు మహిళలైతే చెప్పులు విసిరే ప్రయత్నం చేశారు. మరికొందరు చెప్పులు చూపుతూ శాపనార్థాలు పెట్టటం కనిపించింది. పోలీసుల సాయంతో మేయర్ వాహనంలో వెళ్లిపోయినా కార్మికులు తమ ఆందోళనను కొనసాగించారు. ఈ క్రమంలో పోలీసులకు, కార్మికులకు మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. బిల్లు ఆమోదించడంపై కార్మికులు మేయర్‌కు శాపనార్థాలు పెట్టారు. వైఎస్సార్సీపీ నుంచి గెలిచి టీడీపీలో చేరి మా పొట్టగొడుతున్నారని ధ్వజమెత్తారు. పదేళ్ల క్రితం నుంచి ఈ జీఓ ఉన్నప్పటికీ ఏ పార్టీ ఆమోదించని బిల్లును మేయర్ ఆమోదించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికుల అరెస్ట్.. బిల్లు ఆమోదం తర్వాత ఆందోళన చేస్తున్న పారిశుధ్య కార్మికుల వద్దకు మేయర్ వచ్చి సర్ధిచెప్పేందుకు ప్రయత్నించారు. కార్మికులకు ఎటువంటి అన్యాయం జరగనివ్వమని, న్యాయం జరిగేలా చూస్తానన్నారు. ఈ సమయంలో ఓ కార్మికుడు నగర మేయర్‌ను మాట్లాడనివ్వకుండా అడ్డుపడ్డాడు. బిల్లు ఆమోదించి మాకడుపు కొట్టారని మేయర్‌ను నిలదీశారు. మేయర్ మాటలకు కార్మికులు అడ్డుతగులుతుండటంతో ఆయన కార్పొరేషన్ కార్యాలయం నుంచి బయటకు వెళ్లే ప్రయత్నం చేశారు. అయితే కార్మికులు ఆయన వాహనం చక్రాల కింద పడుకొన్నారు. దీంతో పోలీసులు కార్మికులను, సీపీఎం నాయకులను అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. -
చిత్తూరు ‘దేశం’లో కో-ఆప్షన్ చిచ్చు
మహిళా కోటాలో పదవుల భర్తీ వాయిదా కార్యాలయం ఎదుట టీడీపీ నేతల ధర్నా మేయర్ హామీతో విరమణ చిత్తూరు (అర్బన్) : చిత్తూరు కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశమంటేనే ఏదో ఒక వివాదం తలెత్తుతోంది. తొలి సమావేశంలో ఎమ్మెల్యే సత్యప్రభ ప్రతిపాదనలు తిరస్కరణకు గురవడం, రెండో సమావేశంలో పాలకవర్గంపై సొంత పార్టీ కార్పొరేటర్ ఇందు అవినీతి ఆరోపణలు గుప్పించడం తెలిసిందే. శనివారం జరిగిన మూడో సమావేశంలో పాలకవర్గంలో కార్పొరేషన్ కో-ఆప్షన్ పదవులు ఇవ్వలేదని ఇద్దరు సీనియర్ టీడీపీ నాయకులు ధర్నాకు దిగారు. మొత్తం ఐదు కో-ఆప్షన్ సభ్యుల పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వగా పాలకవర్గం మూడు పోస్టులు మాత్రమే భర్తీ చేసింది. మిగిలిన మహిళా కోటాకు చెందిన రెండు పోస్టులు భర్తీని వాయిదా వేస్తున్నట్లు మేయర్ ప్రకటించారు. ఇందులో ఒకటి జనరల్ మహిళ, మరొకటి మైనారిటీ మహిళ పోస్టులు ఉన్నాయి. మహిళలకు ఇక్కడ అన్యాయం... మహిళలు నగర మేయర్, ఎమ్మెల్యే, జెడ్పీ చైర్‌పర్సన్‌గా ఎన్నికైన చిత్తూరులో సాటి మహిళల్ని గౌరవించడంలేదని మాజీ కౌన్సిలర్ అరుణ దుయ్యబట్టారు. కో-ఆప్షన్ పదవి ఇవ్వలేదని ఆమె కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. పార్టీలో 25 ఏళ్లుగా కష్టపడి పనిచేస్తే తీవ్ర నిరాశే మిగిలిందన్నారు. టీడీపీ చిత్తూరు పట్టణ మహిళా అధ్యక్షురాలిగా, జిల్లా మహిళా విభాగం ఉపాధ్యక్షురాలిగా పనిచేసిన తనకే ఈ గతి పడితే సామాన్య కార్యకర్తల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. పదవి రాకపోతే ప్రాణత్యాగానికైనా సిద్ధమన్నారు. ఎమ్మెల్యే చెప్పినా ఇవ్వరా..? మైనారిటీ మహిళా విభాగం కోటాలో టీడీపీ మైనారిటీ సెల్ జిల్లా నాయకుడు జహంగీర్‌ఖాన్ భార్య పర్విన్తాజ్ ఆశించి భంగపడ్డారు. ఆమె భర్తతో కలిసి కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. ఎమ్మెల్యే చెప్పిన వాళ్లకు కూడా పదవి దక్కకపోతే ఎవరికి గౌరవం ఉందో తెలియడం లేదన్నారు. కో-ఆప్షన్ పదని కోసం పార్టీలోని సీనియర్లు అందరి మద్దతు కూడగట్టినా న్యాయం జరగలేదని జహంగీర్ దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం మేయర్ కఠారి అనురాధ వారితో చర్చించారు. త్వరలోనే మహిళా స్థానాలను భర్తీ చేసి అందరికీ న్యాయం చేస్తానని సర్దిచెప్పారు.