- మహిళా కోటాలో పదవుల భర్తీ వాయిదా
- కార్యాలయం ఎదుట టీడీపీ నేతల ధర్నా
- మేయర్ హామీతో విరమణ
చిత్తూరు (అర్బన్) : చిత్తూరు కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశమంటేనే ఏదో ఒక వివాదం తలెత్తుతోంది. తొలి సమావేశంలో ఎమ్మెల్యే సత్యప్రభ ప్రతిపాదనలు తిరస్కరణకు గురవడం, రెండో సమావేశంలో పాలకవర్గంపై సొంత పార్టీ కార్పొరేటర్ ఇందు అవినీతి ఆరోపణలు గుప్పించడం తెలిసిందే.
శనివారం జరిగిన మూడో సమావేశంలో పాలకవర్గంలో కార్పొరేషన్ కో-ఆప్షన్ పదవులు ఇవ్వలేదని ఇద్దరు సీనియర్ టీడీపీ నాయకులు ధర్నాకు దిగారు. మొత్తం ఐదు కో-ఆప్షన్ సభ్యుల పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వగా పాలకవర్గం మూడు పోస్టులు మాత్రమే భర్తీ చేసింది. మిగిలిన మహిళా కోటాకు చెందిన రెండు పోస్టులు భర్తీని వాయిదా వేస్తున్నట్లు మేయర్ ప్రకటించారు. ఇందులో ఒకటి జనరల్ మహిళ, మరొకటి మైనారిటీ మహిళ పోస్టులు ఉన్నాయి.
మహిళలకు ఇక్కడ అన్యాయం...
మహిళలు నగర మేయర్, ఎమ్మెల్యే, జెడ్పీ చైర్‌పర్సన్‌గా ఎన్నికైన చిత్తూరులో సాటి మహిళల్ని గౌరవించడంలేదని మాజీ కౌన్సిలర్ అరుణ దుయ్యబట్టారు. కో-ఆప్షన్ పదవి ఇవ్వలేదని ఆమె కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. పార్టీలో 25 ఏళ్లుగా కష్టపడి పనిచేస్తే తీవ్ర నిరాశే మిగిలిందన్నారు. టీడీపీ చిత్తూరు పట్టణ మహిళా అధ్యక్షురాలిగా, జిల్లా మహిళా విభాగం ఉపాధ్యక్షురాలిగా పనిచేసిన తనకే ఈ గతి పడితే సామాన్య కార్యకర్తల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. పదవి రాకపోతే ప్రాణత్యాగానికైనా సిద్ధమన్నారు.
ఎమ్మెల్యే చెప్పినా ఇవ్వరా..?
మైనారిటీ మహిళా విభాగం కోటాలో టీడీపీ మైనారిటీ సెల్ జిల్లా నాయకుడు జహంగీర్‌ఖాన్ భార్య పర్విన్‌తాజ్ ఆశించి భంగపడ్డారు. ఆమె భర్తతో కలిసి కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. ఎమ్మెల్యే చెప్పిన వాళ్లకు కూడా పదవి దక్కకపోతే ఎవరికి గౌరవం ఉందో తెలియడం లేదన్నారు. కో-ఆప్షన్ పదని కోసం పార్టీలోని సీనియర్లు అందరి మద్దతు కూడగట్టినా న్యాయం జరగలేదని జహంగీర్ దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం మేయర్ కఠారి అనురాధ వారితో చర్చించారు. త్వరలోనే మహిళా స్థానాలను భర్తీ చేసి అందరికీ న్యాయం చేస్తానని సర్దిచెప్పారు.