చిత్తూరు: సభ్యసమాజం తలదించుకునేలా ఓ యువతిపై సామూహిక అత్యాచారం జరిపి, హత్య చేసిన వారిని సైతం కేసుల నుంచి రక్షించేందుకు టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నట్లు ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. వివిధ వర్గాల చేస్తున్న ఆరోపణలు... కేసులోని నిందితులను స్థానిక నాయకులతో పాటు ఆపార్టీకి చెందిన ఓ మంత్రి, మరో ప్రజాప్రతినిధి నిందితులను కాపాడేందుకు తమ శక్తులన్నింటినీ ఉపయోగిస్తున్నారు. నిర్భయ కేసులో అరెస్టయిన వ్యక్తిని, అతనితోపాటు ఈ చర్యకు పాల్పడిన వారిని కాపాడేందుకు ఒత్తిడి తెస్తున్నారు. తమ పార్టీ సానుభూతి పరులను రక్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తన జిల్లాలో అత్యాచారం, హత్యకు పాల్పడిన వారిని ‘ఔటాఫ్ లా’ శిక్షించాలని ఆ పార్టీకి చెందిన మంత్రి గంటా శ్రీనివాసరావు పోలీసులను ఆదేశిస్తే, అదే పార్టీకి చెందిన మరో మంత్రి చిత్తూరు జిల్లాలో అటువంటి కేసులోనే ఇరుక్కున్న వారిని తప్పించడానికి ప్రయత్నించడం జిల్లాల్లోని ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి.
పోలీసులపై ఒత్తిడి
ముఖ్యమంత్రి సొంత జిల్లాలో దళిత యువతిపై సామూహిక అత్యాచారం, ఆపై హత్య చేసిన కేసును నీరుగార్చేందుకు ఓ మంత్రి, మరో ప్రజాప్రతినిధి ఒత్తిడి మేరకు పోలీసులు ప్రయత్నిస్తున్నట్లు ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. పెనుమూరు మండలం కలవకుంట పంచాయతీ ఎగువపూనేపల్లెకు చెందిన యువతి(18) శనివారం గ్రామ సమీపంలో మేకలు మేపుతుండగా సామూహిక అత్యాచారం, హత్యకు గుైరైంది. ఈ కేసుకు సంబంధించి ప్రధాన నిందితుడు కలవకుంటకు చెందిన ఉదయకుమార్ మొదలియార్(23)పై పోలీసులు నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ కేసు వివరాలను పోలీసులు సోమవారం చిత్తూరులో విలేకరులకు వివరించారు. ఆమెపై సామూహిక అత్యాచారం జరినట్లు భావిస్తున్నామని తెలిపారు. కానీ,అంతలోనే సీన్ మారిపోయింది. కలవకుంటకు చెందిన కొందరు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడి ఆ తరువాత గొంతు నులిమి హత్యచేసినట్లు పోలీసుల ప్రాధమిక విచారణలో వెల్లడైనట్లు సమాచారం.
ఆ సమయంలో ఆ ప్రాంతానికి వచ్చిన ఇదే గ్రామానికి చెందిన ఓ మహిళ సైతం ముగ్గురు దుండగులను చూసిందని, ఆ విషయాన్ని ఆమె పోలీసులకు, గ్రామస్తులకు చెప్పిందనే విషయం గుప్పుమంది. పోలీసు జాగిలాలు సైతం కలవకుంటలోని ఓ యువకుడి ఇంట్లోకి పదేపదే వెళ్లాయి. దాంతో పోలీసులు ఆ ఇంటికి చెందిన యువకుడితోపాటు పలువురు యువకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారని తెలిసింది.
కేసు నీరుగార్చేందుకు యత్నం: అధికారపార్టీ నేతల ఒత్తిళ్లు ఒక వైపు, అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో ముఖ్యమంత్రి సొంత జిల్లాలో తమపార్టీ సానుభూతిపరులు పాల్పడిన ఈ దుశ్చర్య బయటకు పొక్కితే ఆయనతోపాటు ప్రభుత్వం ఇరుకునపడాల్సి వస్తుందని నాయకుల భావించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ స్థాయిలో వారి ఒత్తిడి మేరకు పోలీసులు కూడా కేసును ఆదిలోనే నీరుగార్చేందుకు యత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా కలవకుంటకు చెందిన ఉదయకుమార్ ఒక్కడిపైనే కేసు నమోదు చేస్తున్నట్లు సోమవారం విలేకరుల సమావేశంలో వెల్లడించడం విశేషం. పైగా ఆమెతో అతడికి ఇదివరకే వివాహేతర సంబంధం ఉన్నట్లు పోలీసులు చెప్పారు. వారి మధ్య గతంలోనే సంబంధం ఉంటే ఎందుకు బలాత్కారం చేయాల్సి వచ్చింది? ఎందుకు హత్యచేయాల్సి వచ్చింది? అనే ప్రశ్నలకు పోలీసుల నుంచి సమాధానం లేదు. నిందితులను చూసిన మహిళను సైతం తమ అదుపులో ఉంచుకుని విషయం కప్పిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.