కార్పొరేషన్ కౌన్సిల్‌లో హోదా అంశంపై టీడీపీ సభ్యులను ప్రశ్నిస్తున్న వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు
ప్రత్యేక హోదా అంశం కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశాన్ని కుదిపేసింది. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని హోదాకు మద్దతుగా కార్పొరేటర్లందరూ రాజీనామాలు చేయాలని, దీనికి కౌన్సిల్ తీర్మానం చేయాలని వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు చేసిన ప్రతిపాదనకు అధికారపక్ష సభ్యులు అడ్డు తగిలారు. ఈ అంశంపై చర్చించాలని విపక్ష కార్పొరేటర్లు పట్టుబట్టడంతో మేయర్ కోనేరు శ్రీధర్ ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తూ ప్రత్యేక హోదా అంశాన్ని లేవనెత్తిన కార్పొరేటర్లను సస్పెండ్ చేయాలని ఆదేశించారు. తొలుత 18 వ డివిజన్ కార్పొరేటర్ పాల ఝాన్సీ ప్రభుత్వ చేతకానితనాన్ని విమర్శించారు. ఆమెకు తోడు తమ గళాన్ని విప్పిన మరో ముగ్గురు కార్పొరేటర్ల సైతం సస్పెండ్ చేయడంతో సమావేశం అట్టుడికింది.
పటమట (విజయవాడ తూర్పు) : ‘టీడీపీకి చిత్తశుద్ధి ఉంటే వెంటనే హోదాకు మద్దతుగా తీర్మానాన్ని ప్రవేశపెట్టండి.. రాష్ట్ర భవిష్యత్తు దృష్టిలో ఉంచుకుని ప్రతి కార్పొరేటర్ ఈ అంశంపై నిలబడాలి..’ అంటూ వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు వీఎంసీ కౌన్సిల్ సమావేశంలో పెట్టిన ప్రతిపాదన పెద్ద దుమారమే రేపింది. దీనిపై చర్చించాలని విపక్ష కార్పొరేటర్లు పట్టుబడటంతో మేయర్ కోనేరు శ్రీధర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రత్యేక హోదా అంశాన్ని లేవనెత్తిన కార్పొరేటర్లను సస్పెండ్ చేయాలని ఆదేశించారు. బుధవారం జరిగిన కౌన్సిల్ సమావేశంలో విపక్ష సభ్యులపై టీడీపీ సభ్యులు విరుచుకుపడ్డారు. 18వ డివిజన్ కార్పొరేటర్ పాల ఝాన్సీ మాట్లాడుతూ చేతకాని ప్రభుత్వం అని ప్రభుత్వ వైఖరిని విమర్శించగానే మేయర్ ఆమెను సస్పెండ్ చేయాలని ఆదేశించారు.
దీనికి వ్యతిరేకంగా తమ గళాన్ని విప్పిన మరో ముగ్గురు కార్పొరేటర్లను కూడా సస్పెండ్ చేయాలన్నారు. మేయర్ వైఖరికి నిరసనగా విపక్ష సభ్యులు చందన సురేష్, మద్దా శివశంకర్, ఆసీఫ్ మేయర్ పోడియం వద్ద బైఠాయించగా వీరిని కూడా సస్పెండ్ చేస్తున్నట్లు మేయర్ ప్రకటించారు. ఆ సందర్భంలో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. అధికార, విపక్ష సభ్యుల వాద ప్రతివాదనలతో కౌన్సిల్ హాలు దద్దరిల్లింది. ప్రభుత్వ వైఖరికి నిరసనగా విపక్ష ఫ్లోర్ లీడర్ బండి పుణ్యశీల సారథ్యంలో వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు బి.జాన్బీ, కావటి దామోదర్, బుల్ల విజయ్‌కుమార్, పల్లె రవి, టి.జనుల, పూర్ణమ్మ వాకౌట్ చేశారు.
స్పృహ తప్పిన కార్పొరేటర్ పాలఝాన్సీ
సస్పెండైన పాల ఝాన్సీని సభ నుంచి పంపేయడానికి మార్షల్ బలవంతంగా ఈడ్చుకువెళ్లే సమయంలో ప్రతిఘటిస్తున్న సమయంలో అస్వస్తతకు గురయ్యారు. మార్షల్స్ కౌన్సిల్ బయటకు తీసుకువస్తుండగా స్పృహ కోల్పోయారు. సుమారు 25 నిమిషాల పాటు ఆమెను అధికార యంత్రాంగం పట్టించుకోకపోవడంతో పరిస్థితి విషమించే సందర్భంలో రంగంలోకి దిగిన పోలీసులు ఆమెను అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment