‘ఖమ్మం’ ప్రథమ పౌరుడు పాపాలాలే
♦ ఇద్దరి ఎన్నిక ఏకగ్రీవం
♦ మేయర్ ఎన్నికకు దూరంగా ఉన్న కాంగ్రెస్ కార్పొరేటర్లు
♦ డిప్యూటీ మేయర్‌గా బత్తుల మురళి
ఖమ్మం: ఆరున్నర సంవత్సరాల తర్వాత ఖమ్మం కార్పొరేషన్ కొత్త కౌన్సిల్ మంగళవారం కొలువుదీరింది. కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం వరకు మేయర్, డిప్యూటీ మేయర్ పేర్లు ప్రకటించలేదు. దీంతో అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలోనే మేయర్‌గా 2వ డివిజన్ నుంచిగెలుపొందిన పాపాలాల్, డిప్యూటీ మేయర్‌గా 24వ డివిజన్ నుంచి గెలుపొందిన బత్తుల మురళిని సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఒకటవ డివిజన్ కార్పొరేటర్ గైర్హాజరు కాగా.. మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలో పాల్గొనకుండానే కాంగ్రెస్ కార్పొరేటర్లు కౌన్సిల్ నుంచి వెనుదిరిగారు.
49 మంది కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం
కార్పొరేషన్ ఎన్నికల్లో గెలుపొందిన 50 మంది కార్పొరేటర్లలో ఒకటవ డివిజన్ నుంచి గెలుపొందిన రామ్మూర్తి మినహా మిగిలిన 49 మంది కౌన్సిల్ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. టీఆర్‌ఎస్ జిల్లా పార్టీ కార్యాలయం నుంచి బస్సులో టీఆర్‌ఎస్ సభ్యులు కార్పొరేషన్‌కు వచ్చారు. అనంతరం రాష్ట్ర రోడ్లు భవనాలు, స్త్రీ, శిశుసంక్షేమశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు షేక్ బుడాన్ బేగ్, టీఆర్‌ఎస్ ఖమ్మం నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఆర్జేసీ కృష్ణలు కార్పొరేషన్‌కు చేరుకున్నారు. ఆ తర్వాత గదిలో సభ్యులతో కొద్దిసేపు సమావేశం ఏర్పాటు చేసి మేయర్, డిప్యూటీ మేయర్ అభ్యర్థుల పేర్లు ప్రకటించారు. సరిగ్గా ఉదయం 11 గంటలకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి హోదాలో జిల్లా కలెక్టర్ లోకేష్‌కుమార్, కార్పొరేషన్ కమిషనర్ వేణుగోపాల్‌రెడ్డిలు సభను ప్రారంభించారు. ముందుగా 33 మంది టీఆర్‌ఎస్ కార్పొరేటర్లు, ఆ తర్వాత వైఎస్సార్‌సీపీ, సీపీఐ, సీపీఎం, సభ్యులతోపాటు ఎనిమిది మంది కాంగ్రెస్ కార్పొరేటర్లు సమావేశానికి హాజరయ్యారు. వీరితో ముందుగా కలెక్టర్ లోకేష్‌కుమార్ మాట్లాడి ప్రమాణ స్వీకారం చేయాల్సిందిగా ఆహ్వానించారు. కమిషనర్ వేణుగోపాల్‌రెడ్డి ప్రమాణ పత్రాన్ని చదవగా...కార్పొరేటర్లు చదువుతూ ప్రమాణ స్వీకారం చేశారు. ఇది జరిగిన తర్వాత కాంగ్రెస్ కార్పొరేటర్లు పాలడుగు పాపారావు, వడ్డెబోయిన నర్సింహారావులు సమావేశానికి హాజరు కావడంతో వారితో వేర్వేరుగా కమిషనర్ ప్రమాణ స్వీకారం చేయించారు.
మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నిక ఇలా...
టీఆర్‌ఎస్ పార్టీ నుంచి సీల్డ్ కవర్‌లో వచ్చిన మేయర్, డిప్యూటీ మేయర్ల పేర్లను ముందుగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు టీఆర్‌ఎస్ కార్పొరేటర్లకు తెలిపారు. అధినేతలు చెప్పిన విధంగా 16వ డివిజన్ కార్పొరేటర్ కమర్తపు మురళి రెండవ డివిజన్ కార్పొరేటర్ పాపాలాల్‌ను మేయర్ అభ్యర్థిగా ప్రతిపాదించగా, 17వ డివిజన్ కార్పొరేటర్ పునుకుళ్ల నీరజ బలపర్చారు. అదేవిధంగా డిప్యూటీ మేయర్ పదవికి 24వ డివిజన్ కార్పొరేటర్ బత్తుల మురళి పేరును 26వ డివిజన్ కార్పొరేటర్ పగడాల నాగరాజు ప్రతిపాదించగా 10వ డివిజన్ కార్పొరేటర్ నీరజ బలపర్చారు. దీంతో మేయర్, డిప్యూటీ మేయర్ పదవులకు పోటీ లేకపోవడంతో పాపాలాల్, బత్తుల మురళిలను మేయర్, డిప్యూటీ మేయర్లుగా ఏకగ్రీవంగా ఎంపిక చేసినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ లోకేష్‌కుమార్ ప్రకటించారు.
కార్పొరేటర్లకు మంత్రి తుమ్మల, కలెక్టర్ అభినందనలు
నూతనంగా ఎన్నికై ప్రమాణ స్వీకారం చేసిన మేయర్, డిప్యూటీ మేయర్లు పాపాలాల్, బత్తుల మురళితోపాటు అధికార టీఆర్‌ఎస్, కాంగ్రెస్, వైఎస్సార్‌సీపీ, సీపీఐ, సీపీఎం సభ్యులకు రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేరుపేరునా అభినందనలు తెలిపారు. మంత్రి సభ్యుల వద్దకు వెళ్లి కార్పొరేషన్ అభివృద్ధికి పని చేయాలని కోరడం విశేషం. అదేవిధంగా ఎన్నికల పరిశీలకులు ఇలంబరితి, రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ లోకేష్‌కుమార్, కార్పొరేషన్ కమిషనర్ వేణుగోపాల్‌రెడ్డితోపాటు, ఎమ్మెల్సీలు బాలసాని లక్ష్మీనారాయణ, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పార్టీల నాయకులు, ఉద్యోగ సంఘాల నాయకులు, కుటుంబ సభ్యులు అభినందనలు తెలిపారు.
పాపాలాల్ బయోడేటా
పేరు : గుగులోత్ పాపాలాల్
జన్మస్థలం : డోర్నకల్, వరంగల్ జిల్లా
తల్లిదండ్రులు: బంద్యానాయక్, జంకు
ఐదుగురు కుమారుల్లో పాపాలాల్ నాలుగో సంతానం
నేపథ్యం : వ్యవసాయ కుటుంబం
విద్యాభ్యాసం: 10వ తరగతి వరకు డోర్నకల్ మిషన్ హైస్కూల్, ఇంటర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల మహబూబాబాద్, ఎంబీబీఎస్, ఎండీ కాకతీయ మెడికల్ కళాశాల, వరంగల్
ఉద్యోగం: మొదటి పోస్టింగ్ వరంగల్ జిల్లా మంగపేట మండల ప్రభుత్వాస్పత్రి డాక్టర్‌గా 1981లో రెండు నెలలపాటు, అనంతరం మరిపెడ ప్రభుత్వాస్పత్రి డాక్టర్‌గా 1987 వ సంవత్సరం వరకు, 1987 నుంచి 1999 వరకు నేలకొండపల్లి ప్రభుత్వాస్పత్రి డాక్టర్‌గా, 1999 నుంచి 2003 వరకు ఖమ్మం ప్రధానాస్పత్రి సూపరింటెండెంట్‌గా, 2010 నుంచి 2012 జూలై పదవీ విరమణ వరకు ఖమ్మం ప్రభుత్వాస్పత్రి డీసీహెచ్‌గా పనిచేశారు.
కుటుంబం
భార్య: డాక్టర్ ధర్జన్, ఆర్‌జేడీ ఉన్నత విద్యాశాఖ
సంతానం: ముగ్గురు కుమార్తెలు
పెద్దకుమార్తె : డాక్టర్ అర్పిత, పిల్లల వైద్య నిపుణులు, అల్లుడు: డాక్టర్ తేజ్‌కుమార్, ఎముకల వైద్య నిపుణులు, ఖమ్మం.
రెండవ కుమార్తె: అమృత ఐపీఎస్, అల్లుడు: మనోజ్ ఐపీఎస్, డీసీపీ ఢిల్లీ
మూడవ కుమార్తె: డాక్టర్ అశ్విత రేడియాలజిస్టు, అల్లుడు: పురుషోత్తం మత్తు డాక్టర్ ముంబై, నివాసం: మామిళ్లగూడెం, ఖమ్మం
బత్తుల మురళి బయోడేటా
పేరు: బత్తుల మురళీ ప్రసాదరావు
పుట్టినతేది: 15-07-1973
స్వగ్రామం: గోపాలరావుపేట (జీళ్లచెర్వు గ్రామపంచాయతీ), కూసుమంచి మండలం
ప్రస్తుత నివాసం: బ్యాంక్ కాలనీ, ఖమ్మం
విద్యార్హత: డిగ్రీ
తల్లిదండ్రులు: కమలమ్మ -రామయ్య (లేట్)
భార్య: రాధిక, కొడుకు: గణేష్ ఇప్పటి వరకు నిర్వహించిన పదవులు: 2001లో ఖానాపురం హవేలి ఎంపీటీసీ, 2005లో ఖానాపురం హవేలి ఉపసర్పంచ్ ప్రస్తుతం 24వ డివిజన్ నుంచి కార్పొరేటర్‌గా గెలిచి డిప్యూటీ మేయర్‌గా ఎన్నికయ్యారు.