
అన్నమయ్య సంకీర్తనతో ‘అనంత’ ఖ్యాతి
అనంతపురం కల్చరల్ : కళలకు కాణాచి అయిన అనంత మరోసారి ప్రపంచ రికార్డు సంగీతోత్సవానికి జిల్లా వేదిక అయింది. ‘శ్రీ అన్నమయ్య అష్టోత్తర శత సంకీర్తనార్చన’ పేరిట శ్రీ నృత్యకళానిలయం వారు ఆలపించిన నిర్విరామ సంకీర్తనాలపనతో ప్రపంచ రికార్డు నమోదై అనంత కీర్తిప్రతిష్టలు ద్విగుణీకృతమయ్యా యి. ప్రపంచ రికార్డు స్థానాల కోసం 150 మంది కళాకారుల గాత్రాలతో ఏకధాటిగా 108 అన్నమయ్య సంకీర్తనాలపన ఆదివారం లలితకళాపరిషత్తులో జరిగింది. మేయర్ స్వరూప ఉదయం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఏకరూప వస్త్రధారణతో వందలాది మంది గాయనీమణులు తమదైన గాత్ర మాధుర్యంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. మ ద్యాహ్నం 12.30 గంటల నుంచి సాయంత్రం 6.30 వరకు తమ విద్యార్థులు ఏకధాటిగా అన్నమయ్య సంకీర్తనలతో కళా ప్రాంగణాన్ని మార్మోగించారు.
ప్రపంచ రికార్డును నమోదు చేయడానికి అనంతకు విచ్చేసిన ని ర్వా హకులు నరేంద్రగౌడ్, స్వర్ణశ్రీ తది తరులు ఆద్యంతం చిన్నారుల గళాలకు ముగ్దులైనట్టు ప్రకటించారు. వారిప్రదర్శనను రికార్డులలో నమోదు చేస్తున్నట్టు హర్షధ్వానాల నడుమ ప్రకటించారు. ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఎమ్మెల్యే ప్రభాకర చౌదరి, మేయర్ స్వరూప తదితరులు నృత్యకళానిలయం వారిని ఘనంగా అభినందించారు. సంధ్యామూర్తి ఎన్నో దశాబ్దాలుగా సంగీత, నృత్య ప్రపంచానికి నిరుమాన సేవలందిస్తున్నారని, మరోసారి అనంతను అందనంత ఎత్తులో నిలపడం గర్వకారణమన్నారు. నృ త్య కళా నిలయం వ్యవస్థాపకులు సంధ్యామూర్తి మాట్లాడుతూ జీని యస్ బుక్ ఆఫ్ రికార్డు, వండర్ బుక్ ఆఫ్ రికార్డు వారు ప్రపంచ వ్యాప్తంగా వివిధ విన్యాసాలలో సంక్షిప్తం చేసే దిశగా కార్యక్రమాలను పర్యవేక్షిస్తుంటారని అందులో భాగంగా అనం త వేదికగా సాగిన తమ ప్రయత్నాన్ని రికార్డులలో నమోదు చేయడం ఆనందంగా ఉందన్నారు.
అనంతరం సా యం త్రం జరిన సభా కార్యక్రమంలో అన్నమయ్య కీర్తనాలపించిన గాయనీమణులతో పాటు నాగేశ్వరరావు (తబల), సుధాకర్ (మృదంగం),రమణయ్య (వయోలిన్) తదితర కళాకారులను ఘనంగా అభినందించారు. లయన్స్‌క్లబ్ అనంతపురం మెయిన్ జిల్లా అధ్యక్షురాలు ఫార్మాక్స్ విజయలక్ష్మీ ,వనితాక్లబ్ గూడూరు అనురాధ, ప్రఖ్యాత నాట్య విద్వాంసులు పట్నం శివప్రసాద్, హరిప్రసాద్ తదితరులు సంధ్యామూర్తిని ఘనంగా సన్మానించారు.
ఆకట్టుకున్న అన్నమయ్య
సంకీర్తనావళి
వేద పండితులు ఆలూరు హరికిషోర్ శర్మ ఆధ్వర్యంలో జరిగిన శ్రీ వేంకటేశ్వర ఆరాధనతో సంకీర్తనావళి ప్రారంభమైంది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీని వాసుడికి ఉత్సవ విగ్రహాల ముందు స్వామివారికి ప్రీతిపాత్రమైన అన్నమ య్య పద సంకీర్తనలలో బ్రహ్మ కడిగిన పాదము..., అదివో అల్లదివో శ్రీహరివాసము...కట్టెదుర వైకుంఠము...వంటి పాటలు ఆనందడోలికలలో ముంచెత్తాయి.అవ్యక్తానందాన్ని కల్గించిన రికా ర్డు స్థాయి సంకీర్తనాలన కార్యక్రమంలో ఎల్కేపి కార్యదర్శి నారాయణస్వామి, పాండురంగమూర్తి, అస్లాం బాషా, శ్రీ నిధి రఘు, ప్రసాద్, రమ పాల్గొన్నారు.
చిన్నారుల అద్భుత
నృత్య ప్రదర్శన
నృత్యకళానిలయం చిన్నారులు సంగీతంతో ప్రపంచ రికార్డు సాధనలో తమదైన ముద్రతో రాణించడమే కాకుండా అనంతరం జరిగిన కార్యక్రమంలో శాస్త్రీయ నృత్యాలతో ఆహూతులను అలరించారు.