
ఇదీ సంక్రాంతి సంబరాల్లో భాగమేనా?
ప్రభుత్వం ఓ వైపు సంక్రాంతి సంబరాలకు ఏర్పాట్లు చేస్తోంది. గ్రామ, మండల స్థాయిలో కమిటీలు వేసి చిన్నారులతోపాటు యువతకు, మహిళలకు వివిధ రకాల పోటీలు నిర్వహించి సంబరాలను ఘనంగా నిర్వహించడానికి ఇప్పటికే అధికార యంత్రాంగాన్ని సన్నద్ధం చేసింది. ఇది శుభ పరిణామమే అయినా.. మరోవైపు మద్యం విక్రయూలు పెంచాలని టార్గెట్ విధించడంతో ఎక్సైజ్ అధికారుల కనుసన్నల్లో సిండికేట్లు రెచ్చిపోతున్నారు. గ్రామాలకు విచ్చలవిడిగా మద్యం సరఫరా చేస్తున్నారు.
నందిగాం: గ్రామాల్లో బెల్ట్ షాపులు, దాబాల్లో మద్యం విక్రయాలు మరింత ఊపందుకున్నాయి. ముఖ్యంగా నందిగాం మండల గ్రామాల్లో ఎక్కడికక్కడ మద్యం విక్రయూలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. జాతీయ రహదారి పక్కన ఉన్న దాబాల్లోనూ మద్యం జోరుగా విక్రయిస్తున్నారు. సిండికేట్ వ్యాపారులు ఆటోల్లో మద్యం నిల్వలను గ్రామాలకు తర లించి విక్రయూలను ప్రోత్సహిస్తున్నారు. ఎక్సైజ్ అధికారుల నిఘా కరువవ్వడంతో సంక్రాంతి నేపథ్యంలో వ్యాపారులు చెలరేగిపోతున్నారు. ఎక్సైజ్ అధికారులే ప్రభుత్వ టార్గెట్ పూర్తి చేయించాలన్న ఉద్దేశంతో గ్రామాల్లో మద్యం అమ్మకాలు చేపట్టాలని వ్యాపారులకు చెబుతున్నారని సమాచారం. దీంతో కిల్లీ బడ్డీలు, పాన్‌షాపుల్లోనూ మద్యం విక్రయాలు విరివిగా జరుపుతున్నారు. సంక్రాంతి సమయంలో విక్రయూలు మరింత జోరందుకోనున్నాయి. ఫలితంగా గ్రామాల్లో అంశాంతి నెలకొంటుందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నిద్దరోతున్న నియంత్రణ కమిటీలు
గ్రామాల్లో బెల్టు దుకాణాలు నిర్వహించకుండా గత ఏడాది జూన్‌లో మండల, గ్రామస్థాయి కమిటీలు నియమించారు. మండల స్థాయిలో ఎంపీపీ, జెడ్పీటీసీ సభ్యులు, తహశీల్దారు, ఎంపీడీవో, ఎక్సైజ్ ఎస్సై, సివిల్ ఎస్సైలు ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. గ్రామ స్థాయిలో సర్పంచి, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, గ్రామైక్య సంఘ అధ్యక్షులు, వీఆర్వో, పంచాయతీ కార్యదర్శి కమిటీలో ఉన్నారు. ప్రతినెలా సమావేశాలు ఏర్పాటు చేసి గ్రామాల్లో మద్యం విక్రయూలు జరగకుడా వీరు బాధ్యత వహించాలి. అయితే ఈ కమిటీలు మద్యం విక్రయాల గురించి అసలు పట్టించుకోవడమే లేదు.