ఫన్‌డగొచ్చిందోచ్..
సంక్రాంతి పండగ వచ్చిందంటే చాలు పిల్లలకు ముందుంగా గుర్తుకొచ్చేది పతంగి (గాలిపటం). అను నిత్యం పుస్తకాలతో కుస్తీలు పట్టే చిన్నారులు సంక్రాంతి సెలవులు వచ్చాయంటే గాలిపటాలతో సందడి చేస్తుంటారు. ఒకప్పుడు గాలిపటం అంటే న్యూస్ పేపర్ తీసుకుని రెండు చీపురుపుల్లలతో స్వయంగా తయారు చేసుకునేవారు. దానికి బొడ్డుముడి వేసి మైనం పూత పూసిన దారపు రీళ్ళు ప్రత్యేకంగా తయారు చేసుకునేవారు. వాటితో గాలి పటాల పోటీలు నిర్వహించుకునేవారు. ప్రస్తుతం పిల్లలకు గాలిపటం తయారు చేసుకునే తీరికే దొరకడం లేదు. దీంతో గాలిపటాల పరిశ్రమ ఒకటి ప్రత్యేకంగా ఏర్పడింది. గాలి పటాల వ్యాపారం రూ.కోట్ల టర్నోవర్‌కు చేరుకుంది. గాలిపటాలకు పుట్టిల్లయిన చైనా నుంచి రకరకాల గాలిపటాలను దిగుమతి చేసుకుని మరీ విక్రయిస్తున్నారంటే గాలిపటం ప్రాముఖ్యం ఎంతలా ప్రాచుర్యంలోకి వచ్చిందో తెలుస్తుంది. - విశాఖపట్నం
విశాఖ నగరంలోని అల్లిపురం ప్రాంతం గాలిపటాలకు హోల్‌సేల్ మార్కెట్‌గా వెలుగొందుతోంది. కోల్‌కతాలోని మిదియా బూర్జి ప్రాంతం నుంచి వీటిని తీసుకువస్తుంటారు. చైనా నుంచి కంటెయినర్స్ ద్వారా విభిన్న రూపాలలో తయారవుతున్న గాలిపటాలు తీసుకువచ్చి విక్రయిస్తున్నారు. ఇక్కడ రూ.3 నుంచి రూ.3000 విలువ గల గాలిపటాలు కూడా ఇక్కడ లభ్యమవుతున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ నగరంతో పాటు, జిల్లా నుంచి అనేక మంది ఇక్కడ నుండే గాలిపటాలను తీసుకుపోయి అమ్మకాలు జరుపుతున్నారు. నగరంలో పెద్దపెద్ద షాపులవారు వీరి వద్దనే కొనుగోలు చేస్తుంటారు.
ఆకట్టుకునే మోడల్స్: గాలిపటాలు ప్రస్తుతం పిల్లల అభిరుచులకు తగ్గట్టుగా డోరోమెన్, చోటాభీమ్, సై ్పడర్‌మెన్, యాంగ్రీబర్డ్ వంటి కార్టూన్ కేరక్టర్‌లతో పాటు ప్రధాని మోడీ, అమితాబ్ వంటి ప్రముఖుల ఫొటోలతో కూడా రకరకాల గాలిపటాలు సైజుల వారిగా తయారు చేస్తున్నారు. కార్టూన్ కేరక్టర్స్‌ను పిల్లలు ఇష్టపడుతుండడంతో డిమాండ్ ఎక్కువగా ఉందని వ్యాపారులు అంటున్నారు. అదే విధంగా చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్న గాలి పటాలు వివిధ రూపాలలో అలరిస్తున్నాయి. గ్రద్ద, స్పైడర్‌మాన్, తూనీగ, గబ్బిలం, డేగ, బటర్‌ఫై ్ల, డ్రాగన్ తదితర రకాలకు ఎక్కువ గిరాకీ ఉంది. వీటి ధరలు సైజులను బట్టి రూ.100 నుంచి రూ.300 వరకు ఉన్నాయి.
దార పురీళ్లు ప్రత్యేకం: గాలిపటానికి ఆధారం దారం. గాలిపటానికి ఉపయోగించే దారం చుట్టుకునే వాటిని పల్లేట్ అంటారు. ఇవి రూ.20 నుండి రూ.450 ధరల్లో దొరుకుతున్నాయి.
పిల్లలూ జర జాగ్రత్త!
గాలి పటాలు ఎగరేసే సమయంలో పిల్లలు జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా పిల్లలు గాలిపటాల ఎగురవే సేందుకు మార్కెట్లో చైనా త్రెడ్, బరేలి, పాండా, కోల్‌కతా మాంజా, టైగర్ మాంజా, మహాబలి మాంజా, మోనో ఫైటర్, మోనో ఫిల్ గోల్డ్ వంటి రకరకాల దారాలు దొరుకుతున్నాయి. అవి కాకుండా స్థానికంగా పిల్లలు గాలిపటాల పోటీలకు మాంజా దారాలు స్వయంగా తయారు చేసుకుంటుంటారు. ఈ దారంతో పిల్లలు తగిన జాగ్రత్తలు వహించాల్సి ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. దారానికి గాజుపెంకులు కలిపినప్పుడు, పట్టించినపుడు చేతులకు గ్లౌజులు ధరించాలి.
పోటీల సమయంలో కూడా గ్లౌజులు వాడడం మంచిది.పోటీల సమయంలో దారాన్ని స్పీడుగా వదిలే సమయంలోను, లాగే సమయంలో చేతులు తెగి గాయాలు అయ్యే అవకాశం ఉన్నందున గ్లౌజులు వేసుకోవడం ఉత్తమం.మోనో ఫైటర్, మోనో ఫిల్ గోల్డ్ వంటి దారాలు ఉపయోగించే సమయంలోను గ్లౌజులు ఉపయోగిస్తే చేతులు రక్షణ ఉంటుంది. చిన్న పిల్లలు గాలిపటాలు ఎగరేసే సమయంలో తల్లిదండ్రులు ప్రక్కనే ఉండడం మంచిది. గాలిపటం విద్యుత్ స్తంభాలు, కొబ్బరిచెట్లుకు చిక్కుకున్న సమయాల్లో వాటిని ఎక్కే ప్రయత్నాలు మానుకోవాలి.కర్రలతో గాలిపటాలను లాగే ప్రయత్నాలు చేయరాదు. మేడలపై నుంచి ఇనుప చువ్వలు, కర్రలతో తీసే ప్రయత్నం చేయరాదు. రహదారులపైన, మేడలపైన గాలిపటాలను ఎగురవేయరాదు.