నిర్మానుష్యంగా ఉన్న సర్రాయి గ్రామం
విశాఖపట్నం, డుంబ్రిగుడ(అరకులోయ): మండలంలోని లివిటిపుట్టు గ్రామ సమీపంలో ఈ నెల 23న మాటువేసి అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను మావోయిస్టులు హతమార్చినప్పటి నుంచి సర్రాయి గ్రామంలో గిరిజనులు తీవ్రభయాందోళనల మధ్య బిక్కుబిక్కుమంటూ గుడుపుతున్నారు. ఎవరు ఎప్పుడు వస్తారో, ఎవర్ని తీసుకెళ్తారో తెలియక ఆందోళన చెందుతున్నారు. నిద్రకు దూరమవుతున్నారు. గ్రామానికి చెందిన సుమారు తొమ్మిది మంది గిరిజనులను సోమవారం వేకువ జాము న పోలీసులు తీసుకెళ్లి విచారించి, సాయంత్రం విడిచిపెట్టారు.మంగళవారం కూడా గ్రామస్తులందరూ విచారణకు రావాలని పోలీసులు ఆదేశించండంతో వారు భయంతో వణికి పోతున్నారు. ఈ గ్రామంలో 80 కుటుంబాలకు చెందిన 400 మంది జీవిస్తున్నారు. ఈ గ్రామంలో నిర్వహించనున్న సమావేశానికి వెళుతుండగా మార్గమధ్యంలో లివిటిపుట్టు వద్ద కిడారి, సోమలను మావోయిస్టులు హత్యచేసినప్పటి నుంచి వీరికి కష్టాలు ప్రారంభమయ్యాయి.
ముమ్మరంగా కూంబింగ్: మరో వైపు విశాఖ మన్యంతో పాటు ఏవోబీలో గ్రేహౌండ్స్ దళా లు,స్పెషల్ పార్టీ పోలీసులు సీఆర్‌పీఎఫ్ జవాన్లు ముమ్మరంగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. మా వోయిస్టుల ప్రాబల్యం ఉన్న ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు. మండలంలో దాదాపు అన్ని గ్రామాలు, సమీప అటవీ ప్రాంతంలో భారీగా పోలీసులు మోహరించారు. దీంతో మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాల్లో సాయంత్రం అయితే చాలు ఎవరూ బయటకు రావడం లేదు.
సమావేశం ఉందని తెలియదు: తమ గ్రామంలో సమావేశం ఉందని ఆ రోజు ఉదయం వరకు తెలియదని, టెంటు సామగ్రి, కుర్చీలు వచ్చిన తరువాత తెలిసిందని సర్రాయి గ్రామస్తులు తెలిపారు. అప్పటికే ఎక్కువ మంది చర్చిలకు వెళ్లిపోయామని, హత్యల సమాచారం తమకు మధ్యాహ్నం తెలిసిందని వారు చెబుతున్నారు.
ఒడిశా అధికారులతో చర్చలు
అరకులోయ: తమకు సవాల్ విసిరిన మావోయిస్టులను పూర్తిస్థాయిలో ఏరివేయడమే లక్ష్యంగా పోలీసు ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. ఈమేరకు ఇటీవల ఒడిశా డీజీపీ, మల్కన్‌గిరి,కోరాపుట్ జిల్లాల పోలీసు ఉన్నతాధికారులతో ఏపీ డీజీపీ ఠాకూర్ ఫోన్‌లో చర్చించినట్టు తెలిసింది.లివిటిపుట్టు సంఘటనలో పాల్గొన్న మావోయిస్టుల దండు ఇంకా సురక్షిత ప్రాంతాలకు వెళ్లలేదని, ఏవోబీలో తలదాచుకున్నారనే పక్కా సమాచారంతో పోలీసు పార్టీలు అడవీప్రాంతాన్ని జల్లెడ పడుతున్నాయి. మావోయిస్టులను పూర్తిగా మట్టుబెట్టాలనే వ్యూహంతో పోలీసు పార్టీలు అడవుల్లో అడుగులు వేస్తున్నాయి. ఏజెన్సీలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలోని అన్ని పోలీసు స్టేషన్లు,అవుట్ పోస్టులలో సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఒడిశాలోని పోలీసు పార్టీలు కూడా తమ అటవీ ప్రాంతాల్లో కూంబింగ్ నిర్వహిస్తున్నాయి హత్యలు జరిగిన తరువాత మావోయిస్టులు ఏ ప్రాంతానికి వెళ్లారన్న సమాచారాన్ని కూడా పోలీసులు సేకరించినట్టు తెలుస్తోంది
సహకరించిన వారిపై డీఐజీ ఆరా
చింతపల్లి: అరుకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివెరి సోమల హత్య నేపథ్యంలో పోలీసు యంత్రాంగం మావోయిస్టులపై పూర్తి దృష్టి సారించింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో వారి కదలికలపై పోలీసు అధికారులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి విశాఖరేంజ్ డీఐజీ శ్రీకాంత్, జిల్లా రాహుల్‌దేవ్ శర్మలు అత్యంత రహస్యంగా మండల కేంద్రానికి వచ్చి స్థానిక పోలీస్ స్టేషన్‌లో రాత్రి బసచేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. స్థానిక పోలీసు అధికారుల వద్ద మావోయిస్టులకు సంబంధించిన సమాచారం. ఈ ప్రాంతంలో మావోయిస్టులకు సహకరించే వారి వివరాలు అడిగితెలుసుకున్నట్టు తెలిసింది. పోలీస్ స్టేషన్లలో భద్రతను కట్టుదిట్టం చేయడంతో పాటు, పోలీసులు అప్రమత్తంగా ఉండాలని సూచించినట్టు భోగట్టా.
మావోయిస్టుల దూకుడుకు అడ్డుకట్టు వేసేందుకు తీసుకోవలసిన చర్యలపై చర్చించినట్టు çతెలిసింది. కిడారి హత్య, అనంతరం చోటుచేసుకున్న ఘటనల్లో పోలీసుల వైఫల్యం ఉన్నట్టు ఇటీవల డీజీపీ ఠాకూర్ ప్రకటించడంతో జిల్లా పోలీస్ అధికారులు మావోయిస్టులను ఆగడాలకు అడ్డుకట్టు వేయడమే లక్ష్యంగా పూర్తి నిఘా పెట్టినట్టు సమాచారం. హత్యల సంఘటన తరువాత డీజీపీతో కలిసి గత నెల 27 చింతపల్లి వచ్చిన డీఐజీ తాజాగా మరోసారి సందర్శించారు. పోలీసు బలగాల కూబింగ్ ముమ్మరం చేయడంతో పాటు మావోయిస్టుల కదలికలపై స్వయంగా జిల్లా పోలీస్ అధికారులు దృష్టిపెట్టడంతో మ న్యం వాతావరణం వేడెక్కుతోంది. ఏ నిమిషానికి ఏం జరుగుతందోనని మారుమూల ప్రాం తాల గిరిజనులు ఆందోళన చెందుతున్నారు.
కృష్ణదేవిపేట, గొలుగొండ పోలీస్‌స్టేషన్ల తనిఖీ
గొలుగొండ(నర్సీపట్నం): ఏజెన్సీకి ముఖ ద్వారమైన కృష్ణదేవిపేట, గొలుగొండ పోలీస్ స్టేషన్లను డీఐజీ శ్రీకాంత్, విశాఖ రూరల్ ఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వీరి పర్యటనను గోప్యంగా ఉంచారు.డీఐజీ, ఎస్పీని ఎవరూ కలవకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. పోలీసు స్టేషన్ల భద్రతపై డీఐజీ, ఎస్పీలు ఆరా తీసినట్టు తెలిసింది. ఈ రెండు పోలీస్ స్టేషన్ల పరిధిలో గతంలో మావోయిస్టులు పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో పోలీసులు, మావోయిస్టులు మృతి చెందారు. ఈ సంఘటనలు దృష్టిలో పెట్టుకొని భద్రత చర్యలపై ఆరా తీసినట్టు తెలిసింది. మావోయిస్టుల హిట్ లిస్టులో ఉన్న నాయకులకు భద్రతపై కూడా ఆరా తీసినట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment