పూర్తి వివరాలతో కౌంటర్ వేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
హైదరాబాద్: సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ భూముల విషయంలో యథాతథస్థితి(స్టేటస్ కో) కొనసాగించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ మొత్తం వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఇందుకుగాను రెండు వారాల గడువునిచ్చింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ విలాస్ అఫ్జల్ పుర్కర్ శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. గుంటూరు జిల్లా దాచేపల్లి, మాచవరం మండలాల పరిధిలో 613.47 హెక్టార్లలో తమకున్న మైనింగ్ లీజును రద్దు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత నెల 9న జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ డెరైక్టర్ ఆదిరాజు వేణుగోపాలరాజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం తెలిసిందే. ఈ వ్యాజ్యాన్ని జస్టిస్ విలాస్ అఫ్జల్ పుర్కర్ శుక్రవారం విచారించారు. పిటిషనర్ తరఫున న్యాయవాది ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. కేంద్రం నుంచి అనుమతులు రావడంలో జాప్యం వల్లే నిర్ణీత వ్యవధిలోపు సిమెంట్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయలేకపోయామని, కేంద్రం చేసిన జాప్యానికి తమను బాధ్యులుగా చేస్తూ రాష్ట్రప్రభుత్వం మైనింగ్ లీజును రద్దు చేసిందని తెలిపారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సతీమణి భారతి ఈ కంపెనీలో డెరైక్టర్‌గా ఉన్నారని, అందువల్లే ప్రభుత్వం రాజకీయ దురుద్దేశాలతో మైనింగ్ లీజు రద్దు చేసిందని ఆయన కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.
ప్లాంట్ పెట్టాలనుకున్న భూములు ప్రభుత్వ భూములు కావని బహిరంగ మార్కెట్‌లో కొనుగోలు చేసిందని వివరించారు. అడ్వొకేట్ జనరల్(ఏజీ) పి.వేణుగోపాల్ వాదనలు వినిపిస్తూ, నిర్ణీతవ్యవధిలోపు ప్లాంట్ ప్రారంభించలేదు కాబట్టే, నిబంధనల ప్రకారం లీజును రద్దు చేశామని చెప్పారు. ఒకవేళ పనులు ప్రారంభించకుంటే, కారణం చెప్పాలనీ, కానీ సరస్వతి యాజమాన్యం ఆ పని చేయలేదని అన్నారు. గడువిస్తే అన్ని వివరాలను కోర్టు ముందుంచుతామన్నారు. ఇందుకు న్యాయమూర్తి అంగీకరిస్తూ కౌంటర్ దాఖలుకు గడువిస్తూ ఆదేశించారు.
‘సరస్వతి’ భూములపై యథాతథస్థితి
Published Sat, Nov 8 2014 3:48 AM | Last Updated on Fri, Aug 31 2018 8:26 PM
Advertisement
Advertisement