- ప్రహరీ నిర్మాణంపై సర్పంచ్ అభ్యంతరం
- ఎంపీపీ కార్యాలయం నుంచి సర్పంచ్ గెంటివేత
బుచ్చెయ్యపేట : మండల టీడీపీ నా యకుల మధ్య వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. గతంలో మాజీ ఎంపీపీ బత్తు ల తాతయ్యబాబు, ప్రస్తుత మండల ఉపాధ్యక్షుడు దాడి సూరినాగేశ్వరరావు, మాజీ జెడ్పీటీసీలు గోకివాడ కోటీశ్వరరావు, వియ్యపు అప్పారావు, విశాఖ డెయిరీ డెరైక్టర్ గేదెల సత్యనారాయణ, తదితరుల మధ్య వర్గవిభేదాలు బయటపడ్డాయి. తాజాగా పోలేపల్లి టీడీపీ సర్పంచ్ సీతా వెంకటరమణ, గ్రామ టీడీపీ పాలసంఘం అధ్యక్షుడు సీతా నర్సింహనాయుడుల మధ్య విభేదాలు బయటపడ్డాయి.
ఇటీవల బంజరు భూములకు సర్పంచ్ అనుమతి కోరగా, ఎమ్మెల్యే ద్వారా డి ఫారం పట్టాలు అవ్వకుండా నర్సింహనాయుడు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో పంచాయతీ అనుమతి లేకుండా పాల సంఘానికి నర్సింహనాయుడు ప్రహరీ నిర్మాణ పనులు చేపట్టగా, సర్పంచ్ సీతా వెంకటరమణ పంచాయతీ అధికారుల ద్వారా అడ్డుకున్నాడు. దీనిపై సోమవారం బుచ్చెయ్యపేట ఎంపీపీ కార్యాలయంలో ఇరువురిమధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
అభివృద్ధి పనులకు ఎవరూ అడ్డరాదని వైస్ ఎంపీపీ, డెయిరీ డెరైక్టర్, మాజీ జెడ్పీటీసీలు సర్పంచ్ సీతా వెంకటరమణకు సూచిం చారు. అయితే తమ గ్రామ రాజకీయాల్లోకి ఎవరు తల దూర్చినా సహించమంటూ సర్పం చ్, మండల నాయకులు సూచించారు. దీనిపై ఇరువర్గాలవారి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి తోపులాట వరకు వెళ్లింది. కానీ, డెయిరీ చైర్మన్‌ను, ఎమ్మెల్యేను విమర్శిస్తావా అంటూ సదరు నాయకులు సర్పంచ్ సీతా వెంకటరమణను ఎంపీపీ కార్యాలయం గది నుంచి బయటకు తోసేశారు.
తాను తమ గ్రామ నాయకుల్ని విమర్శిస్తే, తనపై తప్పును రుద్దడానికి ఎమ్మెల్యేను, డెయిరీ చైర్మన్‌ను దూషించానని చెప్పడం సిగ్గులేని తనమంటూ సర్పంచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, కార్యాలయంలోనే నాయకులు రచ్చకెక్కడంపై మండల అధికారులు ఎవరికి కొమ్ము కాయాలో తెలియక అయోమయంలో పడ్డారు.