సభలు.. సమావేశాలు.. సదస్సులు.. కార్యక్రమం ఏదైనా సర్పంచ్ ప్రతినిధి దర్శనమిస్తాడు. ఈయన ఎవరని ఆరా తీస్తే ఫలానా సర్పంచ్‌కు భర్త అనో..
సాక్షి, కర్నూలు: సభలు.. సమావేశాలు.. సదస్సులు.. కార్యక్రమం ఏదైనా సర్పంచ్ ప్రతినిధి దర్శనమిస్తాడు. ఈయన ఎవరని ఆరా తీస్తే ఫలానా సర్పంచ్‌కు భర్త అనో.. తమ్ముడనో.. బంధువనో సమాధానం వస్తుంది. అదేంటి ఆమె ఇళ్లు కదల్లేదా అంటే.. కాదు ఇంటికే పరిమితం చేశారనే విషయం ఆ తర్వాత గానీ తెలిసిరాదు. ఇటీవల ముగిసిన సర్పంచ్ ఎన్నికల్లో జిల్లాలోని 883 పంచాయతీల్లో అత్యధికంగా 486 స్థానాల్లో మహిళలే గెలుపొందారు. ఇందులో సుమారు వంద మందికి పైగా ఏకగ్రీవమయ్యారు. 50 శాతం రిజర్వేషన్ కల్పనతో సాధించిన విజయమిది. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఎన్నికలు పూర్తి కావడమే తరువాయి, వీరి తరఫున రక్త సంబంధీకులు రంగంలోకి దిగిపోయారు. ‘ఆమె’ తరఫున అధికారాన్ని అందిపుచ్చుకొని పెత్తనం చెలాయిస్తున్నారు. ఓర్వకల్లులోని మహిళా ఐక్య సంఘంలో మొదటి విడతగా నిర్వహిస్తున్న సర్పంచ్‌ల శిక్షణ శిబిరానికి ఆదోని, కౌతాళం, కోసిగి, పెద్దకడబూరు మండలాలకు చెందిన 55 మందిని ఆహ్వానించగా 42 మంది పాల్గొన్నారు.
ఆదోని మండలం పెద్దహరివాణం, కౌతాళం మండలలో లింగాలదిన్నె, బాపురం, పొదలకుంట, మరో తొమ్మిది గ్రామాల సర్పంచ్‌లు గైర్హాజరయ్యారు. వీరి స్థానంలో కుటుంబసభ్యులు రావడంపై శిక్షణాధికారి మండిపడ్డారు. కొత్తగా ఎన్నికైన మహిళా సర్పంచ్‌లకు అధికారాలు, విధులు తెలియజేసే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన శిక్షణకు వారినే పంపాల్సి ఉన్నా.. అధిక శాతం కుటుంబ సభ్యులు, బంధువులు హాజరవడం మహిళలు తమకు లభించిన అవకాశాన్ని ఏమాత్రం ఉపయోగించుకుంటున్నారో తెలియజేస్తోంది.
గత ఆగస్టు 2న ప్రమాణస్వీకారం చేయడంతో వీరిలో అధిక శాతం మహిళా సర్పంచ్‌లు ఇంటికే పరిమితమయ్యారు. పాలనాపరమైన అనుభవ లేమి నేపథ్యంలో కొంతవరకు కుటుంబ సభ్యులలు సహాయపడినా పర్వాలేదు కానీ.. మొత్తంగా అధికారాన్నే లాగేసుకోవడం మహిళా సాధికారతను కాలరాయడమే అనే భావన సర్వత్రా వ్యక్తమవుతోంది. ఒక కుటుంబం అభివృద్ధిలో స్త్రీ పాత్ర ఎంతో ముఖ్యమైనది. ప్రతి పురుషుని విజయంలో ‘ఆమె’ తోడ్పాటు ఎనలేనిది. ఈ నేపథ్యంలో గ్రామాభివృద్ధిలోనూ మహిళలను భాగస్వాములను చేస్తే మెరుగైన ఫలితాలు సాధ్యమనే విషయం అందరూ గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
మహిళా సర్పంచ్‌లు ఉన్న చోట ఇదీ పరిస్థితి
హలహార్వి మండలంలో ఏడుగురు మహిళా సర్పంచ్‌లు ఉన్నారు. వీరు వ్య వసాయం, ఇతర పనులకు వెళ్తుండగా.. భర్తలు చక్రం తిప్పుతున్నారు.
కౌతాళం మండలంలోని 12 పంచాయతీల్లో మహిళ సర్పంచ్‌లు డమ్మీగా మిగిలిపోయారు.
కోడుమూరు నియోజకవర్గంలోని కృష్ణాపురం, పులకుర్తి గ్రామాల్లో సర్పంచ్‌ల కుమారులు అన్నీ తామూ వ్యవహరిస్తున్నారు.
వెంకటగి గ్రామ సర్పంచ్ ఎస్సీ కావడంతో ఆమె గెలుపులో కీలకంగా వ్యవహరించిన ఓ నేత పెత్తనం సాగిస్తున్నారు. ఆమె వినకపోతే ఖర్చు పెట్టిన రూ.6 లక్షలు తిరిగివ్వాలని కోరుతున్నట్లు సమాచారం.
ఆలూరు, మొలగవెల్లి, బన్నూరు, బిల్లేకల్, కమ్మరచేడు పంచాయతీల్లో భర్తలు, కుమారుల ఆధిపత్యం కనిపిస్తోంది.
కర్నూలు రూరల్ మండలంలోని పంచలింగాల, దిగువపాడు, నందనపల్లె, ఇ.తాండ్రపాడు, గొందిపర్ల, దేవమాడ, శివరాంపురం, పడిదెంపాడు, నిడ్డూరు గ్రామాల్లో వారి భర్తలే పాలనా వ్యవహారాలు చూస్తున్నారు. ఆర్.కొంతపాడులో సర్పంచ్ అల్లుడు అన్నీ తానై నడిపిస్తున్నాడు.
పత్తికొండ మండలంలోని దేవనబండ సర్పంచ్ తరపున ఆ గ్రామ టీడీపీ నేత పెత్తనం చెలాయిస్తున్నాడు. కోతిరాళ్ల సర్పంచ్ శిరీష కర్నూలులో డిగ్రీ చదువుతున్నారు. ఈమె స్థానంలో తండ్రి నగేష్ వ్యవహారాలను చక్కబెడుతున్నారు.