మాజీ సర్పంచ్ అనుమానాస్పద మృతి | sarpanch Suspicious Death | Sakshi
Sakshi News home page

మాజీ సర్పంచ్ అనుమానాస్పద మృతి

Published Wed, Jan 29 2014 1:35 AM | Last Updated on Sat, Sep 2 2017 3:06 AM

sarpanch Suspicious Death

 జగ్గంపేట, న్యూస్‌లైన్ :కాట్రావులపల్లి మాజీ సర్పంచ్ సుంకర నారాయణ (70) అనుమానాస్పద స్థితిలో మరణించారు. జగ్గంపేట- పెద్దాపురం రోడ్డు మార్గంలో సీతానగరం సమీపంలో రోడ్డు పక్కన ముళ్లపొదల్లో ఆయన మృతదేహం మంగళవారం పోలీసులకు లభ్యమైంది. ఐదు రోజుల క్రితం ఆయన చనిపోయి ఉండవచ్చని, దీంతో మృతదేహం పూర్తిగా పాడైపోయి, దుర్గంధం వెదజల్లుతోంది. సీతానగరం వీఆర్‌ఓ ఎన్.వెంకట సత్యనారాయణ ఫిర్యాదు మేరకు సీఐ సుంకర మురళీమోహన్, ఎస్సై సురేష్‌బాబు సంఘటన స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహం పడి ఉన్న తీరును బట్టి బహిర్భూమికి వెళుతుండగా పక్షవాతం కానీ, గుండెపోటు కానీ, రక్తపోటు వల్ల కానీ ప్రాణం కోల్పోయి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. విష పురుగు కాటు వల్ల కూడా చనిపోయి ఉండవచ్చంటున్నారు.
 
 మృతదేహాన్ని బయటకు తీసే అవకాశం లేకపోవడంతో, పెద్దాపురం ప్రభుత్వాస్పత్రి వైద్యుడు సంఘటన స్థలంలోనే పోస్ట్‌మార్టం నిర్వహించారు. సుమారు 20 ఏళ్ల క్రితం ఉప సర్పంచ్‌గా వ్యవహరించిన నారాయణ అప్పట్లో సర్పంచ్ మరణించడంతో ఇన్‌చార్జి బాధ్యతలను చేపట్టారు. ఆయనకు భార్య నాగరత్నం, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉండగా, 40 ఏళ్ల క్రితమే వారికి దూరమై గ్రామంలో ఒంటరిగా నివసిస్తున్నారు. ఓ కుమారుడు మరణించగా, భార్య నాగరత్నం, మరో కుమారుడు శ్రీను రాజమండ్రిలో నివసిస్తున్నారు. కుమారుడు రాజమండ్రిలో ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. కుమార్తె లక్ష్మీకుమారి జగ్గంపేటలో ఉంటోంది. ఆస్తిని దుబారా చేయడం వల్లే ఆయన కుటుంబానికి దూరమైనట్టు తెలిసింది. అనుమానాస్పద మృతిగా ఎస్సై సురేష్‌బాబు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించడంతో, అంతిమ సంస్కారాల కోసం రాజమండ్రికి తీసుకువెళ్లారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement