‘ఔటర్’ చుట్టూ శాటిలైట్ టౌన్‌షిప్‌లు
• రెండు రోజుల్లో రింగ్ రోడ్‌కు ప్రణాళిక సిద్ధం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశం
• హై స్పీడ్ సర్క్యులర్ రైల్వేలైన్‌కు ఆమోదం
• డెవలపర్ల సహకారంతో మురికివాడల్లో ఇళ్ల నిర్మాణాలు
• తొలివిడతలో గుంటూరు, విజయవాడ, తిరుపతిలోని మురికివాడలు ఎంపిక
సాక్షి, అమరావతి: రాజధాని ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం పూర్తయితే దాని చుట్టూ శాటిలైట్ టౌన్‌షిప్‌లు అభివృద్ధి చెందుతాయని సీఎం చంద్రబాబు అన్నారు. అందువల్ల రాజధాని పరిధిలోని 2 ప్రధాన నగరాలతో పాటు చుట్టూ ఉండే పట్టణాలు, కొత్తగా వచ్చే శాటిలైట్ టౌన్‌షిప్‌లను 30 నుంచి 45 నిమిషాల్లో చేరుకునేలా రవాణా వ్యవస్థ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
బుధవారం తాత్కాలిక సచివాలయంలోని తన కార్యాలయంలో సీఆర్‌డీఏ వ్యవహారాలను సీఎం సమీక్షించారు. తెనాలి, గుడివాడ, నూజివీడు, సత్తెనపల్లి వంటి పట్టణాలతో పాటు చెన్నై–కోల్‌కతా, విజయవాడ–ముంబై, విజయవాడ–జగదల్‌పూర్ జాతీయ రహదారులు, కొత్తగా నిర్మించబోయే అమరావతి–అనంతపురం ఎక్స్‌ప్రెస్ వేకి అనుసంధానంగా ఔటర్ రింగ్ రోడ్ ఉండాలని సూచించారు. 2 రోజుల్లో ప్రణాళిక సిద్ధం చేయాలని, అనంతరం దీనిపై సమగ్ర నివేదిక తయారుచేసి కేంద్రానికి అందించాల్సి ఉంటుందని చెప్పారు. మురికివాడల రహిత నగరాలు, పట్టణాలు అభివృద్ధి చేసేందుకు గానూ డెవలపర్ల సహకారంతో ఇళ్ల నిర్మాణం చేపట్టాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
రైల్వే లైన్‌కు ఓకే: రాజధాని అమరావతిలో హై స్పీడ్ çసర్క్యులర్ రైల్వేలైన్ నిర్మాణానికి సీఎం ఆమోదం తెలిపారు. తాత్కాలిక సచివాలయం లో జరిగిన మున్సిపల్ శాఖ సమీక్షలో సీఎం దీనిపై చర్చించారు. మొత్తం 105 కిలోమీటర్ల పొడవునా సుమారు రూ.10 వేల కోట్లతో విజయవాడ–అమరావతి–గుంటూరు–తెనాలి –కృష్ణా కెనాల్ స్టేషన్–విజయవాడ మీదుగా ఈ రైల్వే లైన్ నిర్మించాల్సి ఉంటుందని అధికారులు సీఎం చంద్రబాబుకు వివరించారు. దీనిపై ఆయన మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్టుకు సంబంధించి త్వరితగతిన అనుమతులు పొందేందుకు, సహాయ సహకారాల కోసం కేంద్రంతో సంప్రదింపులు జరపాలని అధికారులను ఆదేశించారు.
లంక రైతుల ఆశలపై నీళ్లు : రాజధాని పరిధిలోని లంక రైతుల ఆశలపై సీఎం చంద్రబాబు నీళ్లు చల్లారు. రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన ఇతర రైతులందరికీ ఇచ్చే ప్యాకేజీని లంక భూముల రైతులకు ఇవ్వడం కుదరదని తేల్చిచెప్పారు. ఇచ్చింది తీసుకోవాల్సిందేనని చెప్పేశారు. దీంతో దిగాలు చెందిన లంక రైతులు భారంగా వెనుతిరిగారు. సీఆర్‌డీఏ లంక రైతులకిచ్చే ప్యాకేజీలో భారీ తేడా ఉండటంతో వారు వ్యతిరేకిస్తున్నారు. వారు పలుమార్లు అధికారులు, మంత్రులను కలసి విన్నవించినా సానుకూల ప్రకటన రాలేదు. దీంతో నేరుగా సీఎంను కలసి విన్నవించుకున్నా వారి కోరిక నెరవేరలేదు.