satellite township
-
టీడీపీ కుట్రలకు చెక్..పేదల గూడుకు ఎందాకైనా
సీన్ 1: పేదలకు పక్కా ఇళ్లు ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయం మేరకు ఒంగోలు నగరంలో శాటిలైట్ టౌన్ షిప్ నిర్మించాలని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి యోచించారు. నిరుపేదలకు సొంత ఇంటికల నిజం చేయాలన్న సదుద్దేశంతో బాలినేని నగర సమీపంలో ప్రభుత్వ స్థలం అన్వేషించిమరీ లే అవుట్ తయారు చేయించారు. రాష్ట్రంలోనే ఏ జిల్లాలో లేనివిధంగా ఒకేచోట భారీ స్థాయిలో ఉన్న ప్రభుత్వ భూమిని గుర్తించి వేల సంఖ్యలో పేదలకు ఒకేచోట ఇళ్ల స్థలాలు ఇవ్వవచ్చని భావించి వడివడిగా చదును చేయించారు. యరజర్ల గ్రామంలోని 818 ఎకరాల్లో 24 వేల మందికి ఇళ్లు నిర్మించాలనుకున్నారు. సీన్ 2: ఇంత మంది పేదలకు ఇళ్లు కట్టిస్తే ప్రభుత్వానికి, బాలినేనికి ఎక్కడ పేరు వస్తుందోనని భావించిన తెలుగుదేశం పార్టీ కుట్రలకు తెరతీసింది. మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కుయుక్తులు పన్నారు. న్యాయపరమై ఇబ్బందులు సృష్టించి పేదలకు గృహాలను దూరం చేశారు. తన అనుచరుడు మక్కెన శ్రీనివాసరావు చేత హైకోర్టులో కేసు వేయించి స్టే తెచ్చారు. ఫలితంగా నిరుపేదల ఆశపై నీళ్లుజల్లారు. సీన్ 3: పేదలకు ఇళ్ల నిర్మాణం కోసం ఎందాకైనా వెళ్లాలని బాలినేని నిర్ణయించారు. పచ్చ కుట్రలను తిప్పికొట్టి నిరుపేదలను ఆదుకోవాలనుకున్నారు. నగర పరిసర ప్రాంతాల్లో 500 ఎకరాల ప్రైవేటు స్థలాన్ని సేకరించాలని రంగం సిద్ధం చేశారు. ఇదే విషయాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందుంచారు. సీఎం బాలినేని ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నగరం చుట్టూ ఉన్న ఆరు గ్రామాల్లో స్థలాలు ఎంపిక చేసేపనిలో పడ్డారు. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: పేదవారి సొంతింటి కల సాకారం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తలంచారు. వైఎస్సార్ జగనన్న కాలనీల్లో పెద్ద ఎత్తున గృహాలు నిర్మించేందుకు రంగం సిద్ధం చేశారు. ఒంగోలు నగరంలో పేదలకు ఒకే ప్రాంతంలో ఇళ్లు నిర్మించాలని ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రీజినల్ కో ఆర్డినేటర్ బాలినేని శ్రీనివాసరెడ్డి భావించారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఒక శాటిలైట్ సిటీని కట్టాలని, ఆమేరకు చర్యలు చేపట్టారు. యరజర్ల గ్రామంలోని 818 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని గుర్తించారు. దాదాపు 24 వేల మందికి సొంత ఇంటి కల నిజం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. హద్దురాళ్లు సైతం వేయించారు. పనులు వేగంగా జరుగుతున్న సమయంలో టీడీపీ నేతలు సైంధవుడిలా అడ్డుపడ్డారు. ఇంతమంది నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తే ఇక తన రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ భావించి కుట్రలకు తెరతీశారు. తన ప్రధాన అనుచరుడు అయిన ఒంగోలు మండలం సర్వేరెడ్డిపాలెం గ్రామానికి చెందిన మక్కెన శ్రీనివాసరావు చేత హైకోర్టులో కేసు వేయించాడు. దీంతో హైకోర్టు నిరుపేదలకు ఇచ్చే ఇళ్ల పట్టాలను ఇవ్వకుండా నిలుపుదల చేస్తూ స్టే ఆర్డర్ ఇచ్చింది. మైనింగ్ పేరుతో అడ్డుపుల్ల: యరజర్ల గ్రామంలోని ప్రస్తుతం ఇళ్లపట్టాలకు ఇవ్వాలని భావించిన స్థలం గతంలో ఐరన్ ఓర్ మైనింగ్‌కు ఇచ్చారంటూ మక్కెన శ్రీనివాసరావు హైకోర్టుకు వెళ్లాడు. అయితే గతంలో మైనింగ్‌కు ఇచ్చినప్పుడు ఇదే మక్కెన శ్రీనివాసరావు మైనింగ్‌కు ఇవ్వటానికి వీలులేదని ఆందోళనలు చేశాడు. మైనింగ్ లీజులు రద్దుచేసి ఐఐఐటీకి ఇవ్వాలని కూడా ఆందోళనలు చేపట్టాడు. ఇదంతా మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఆడుతున్న కుట్రలో భాగంగానే జరిగిందని అందరూ గుర్తించారు. టీడీపీ కుట్రలకు చెక్ నగరంలోని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్లు కట్టించాలని బాలినేని శ్రీనివాస రెడ్డి బలంగా భావించారు. ప్రైవేటు స్థలాన్ని కొనుగోలు చేసి ఇళ్లు నిర్మించాలన్న ప్రతిపాదనలను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందుంచారు. దీనికి ఆయన అంగీకరించారు. ఒంగోలు, కొత్తపట్నం మండలాల పరిధిలో 500 ఎకరాలు కేటాయించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. భూములు కొనేందుకు రూ.200 కోట్లు కేటాయించారు. ఆరు గ్రామాల్లో స్థలాల గుర్తింపు.. ఇళ్ల స్థలాలు ఇవ్వటానికి రెవెన్యూ అధికారులు ఇప్పటికే ఆరు గ్రామాల్లో స్థలాలను గుర్తించారు. మొత్తం దాదాపు 25 వేల మందికి ఇచ్చేలా స్థలాల ఎంపిక ప్రక్రియ ప్రారంభించారు. మల్లేశ్వరపురం, పెళ్లూరు, అగ్రహారం, సర్వేరెడ్డిపాలెం, వెంగముక్కల పాలెం, కరవది గ్రామాల్లో సర్వే నంబర్ల వారీగా స్థలాలను ఇప్పటికే గుర్తించారు. సర్వే నంబర్ల వారీగా అనుభవదారులు, హక్కుదారులను గుర్తించి వారి వద్ద నుంచి కొనుగోలు చేయటానికి రంగం సిద్ధం చేస్తున్నారు. పదిహేను రోజుల్లోపు ఆయా గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి ప్రభుత్వానికి నివేదిక పంపేందుకు సన్నాహాలు ముమ్మరం చేశారు. మార్చి నెలాఖరుకల్లా ఇళ్ల పట్టాలు ఇచ్చి తీరుతాం టీడీపీ నాయకులు ఎన్ని అడ్డంకులు కల్పించినా మార్చి నెలాఖరుకల్లా నిరుపేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చి ఆదుకుంటాం. సీఎం వైఎస్ జగన్‌కు ఇళ్ల పట్టాల విషయం చెప్పాను. కోర్టు అడ్డంకులు ఉన్నందున ప్రైవేటు స్థలాలైనా కొనుగోలు చేసి ఇద్దామని హామీ ఇచ్చారు. దీంతో ఒంగోలు నగర పరసర గ్రామాల్లో దాదాపు 500 ఎకరాలు కొనుగోలు చేసి ఇవ్వటానికి భూముల గుర్తింపు ప్రారంభించాం. అందుకోసం రూ.200 కోట్లు కేటాయించారు. ఇప్పటికే భూముల గుర్తింపు కార్యక్రమాన్ని రెవెన్యూ అధికారులు ప్రారంభించారు. – బాలినేని శ్రీనివాస రెడ్డి, ఒంగోలు ఎమ్మెల్యే -
త్వరలో భూ సమీకరణకు కొత్త విధానం!
సాక్షి, హైదరాబాద్: నగర, పట్టణ ప్రాంతాల్లో అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన ప్రాజెక్టుల కోసం రాష్ట్ర ప్రభుత్వం త్వరలో కొత్త భూ సమీకరణ (ల్యాండ్ పూలింగ్ ) విధానాన్ని తీసుకురానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు.. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో అమల్లో ఉన్న ఉత్తమ భూ సమీకరణ విధానాలు, పద్ధతులపై రాష్ట్ర పురపాలక శాఖ అధ్యయనం చేపట్టింది. ఆ శాఖ డైరెక్టర్ ఎన్.సత్యనారాయణ నేతృత్వంలోని అధికారుల బృందం ఒకటి గుజరాత్లో, కార్యదర్శి సి.సుదర్శన్‌రెడ్డి నేతృత్వంలోని మరో బృందం మహారాష్ట్రలో పర్యటించింది. ఆయా రాష్ట్రాల్లో అమలు చేస్తున్న ల్యాండ్ పూలింగ్ విధానాలపై బృందాలు అధ్యయనం జరిపాయి. అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు (ఉడాలు)/డీటీసీపీ (డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్)లు నిర్వహిస్తున్న పాత్రను పరిశీలించాయి. ఈనెల 15లోగా ఈ బృందాలు పురపాలక శాఖకు తమ నివేదికలు సమర్పించనున్నాయి. వీటిని పరిశీలించి, నిపుణులతో సంప్రదింపులు జరిపిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కొత్త భూ సమీకరణ విధానాన్ని ప్రకటించే అవకాశాలున్నాయి. శాటిలైట్ టౌన్లు, పేద, బడుగు, బలహీన వర్గాలకు గృహ నిర్మాణ ప్రాజెక్టుల నిర్మాణం వంటి అవసరాల కోసం ఈ కొత్త పాలసీని ప్రభుత్వం తీసుకొస్తోందని అధికారవర్గాలు తెలిపాయి. పురపాలికలు, ఉడాల ఆధ్వర్యంలోనే.. భూ సమీకరణ ద్వారా సేకరించిన భూముల్లో మౌలిక వసతుల అభివృద్ధి పనులను పురపాలికలు/ఉడాల ఆధ్వర్యంలోనే చేపట్టాలనే ప్రతిపాదనలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. ప్రైవేటు డెవలపర్లు అభివృద్ధి చేస్తున్న నిర్మాణ రంగ ప్రాజెక్టుల్లో రోడ్లు, డ్రైనేజీలు, నీటి సరఫరా పైప్లైన్లు కొద్ది రోజుల్లోనే దెబ్బతింటున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయా పనులు పూర్తిగా పురపాలికలు/ఉడాల ఆధ్వర్యంలోనే చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోందని అధికార వర్గాలు వెల్లడించాయి. -
‘ఔటర్’ చుట్టూ శాటిలైట్ టౌన్‌షిప్‌లు
• రెండు రోజుల్లో రింగ్ రోడ్‌కు ప్రణాళిక సిద్ధం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశం • హై స్పీడ్ సర్క్యులర్ రైల్వేలైన్‌కు ఆమోదం • డెవలపర్ల సహకారంతో మురికివాడల్లో ఇళ్ల నిర్మాణాలు • తొలివిడతలో గుంటూరు, విజయవాడ, తిరుపతిలోని మురికివాడలు ఎంపిక సాక్షి, అమరావతి: రాజధాని ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం పూర్తయితే దాని చుట్టూ శాటిలైట్ టౌన్‌షిప్‌లు అభివృద్ధి చెందుతాయని సీఎం చంద్రబాబు అన్నారు. అందువల్ల రాజధాని పరిధిలోని 2 ప్రధాన నగరాలతో పాటు చుట్టూ ఉండే పట్టణాలు, కొత్తగా వచ్చే శాటిలైట్ టౌన్‌షిప్‌లను 30 నుంచి 45 నిమిషాల్లో చేరుకునేలా రవాణా వ్యవస్థ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. బుధవారం తాత్కాలిక సచివాలయంలోని తన కార్యాలయంలో సీఆర్డీఏ వ్యవహారాలను సీఎం సమీక్షించారు. తెనాలి, గుడివాడ, నూజివీడు, సత్తెనపల్లి వంటి పట్టణాలతో పాటు చెన్నై–కోల్‌కతా, విజయవాడ–ముంబై, విజయవాడ–జగదల్పూర్ జాతీయ రహదారులు, కొత్తగా నిర్మించబోయే అమరావతి–అనంతపురం ఎక్స్‌ప్రెస్ వేకి అనుసంధానంగా ఔటర్ రింగ్ రోడ్ ఉండాలని సూచించారు. 2 రోజుల్లో ప్రణాళిక సిద్ధం చేయాలని, అనంతరం దీనిపై సమగ్ర నివేదిక తయారుచేసి కేంద్రానికి అందించాల్సి ఉంటుందని చెప్పారు. మురికివాడల రహిత నగరాలు, పట్టణాలు అభివృద్ధి చేసేందుకు గానూ డెవలపర్ల సహకారంతో ఇళ్ల నిర్మాణం చేపట్టాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. రైల్వే లైన్‌కు ఓకే: రాజధాని అమరావతిలో హై స్పీడ్ çసర్క్యులర్ రైల్వేలైన్ నిర్మాణానికి సీఎం ఆమోదం తెలిపారు. తాత్కాలిక సచివాలయం లో జరిగిన మున్సిపల్ శాఖ సమీక్షలో సీఎం దీనిపై చర్చించారు. మొత్తం 105 కిలోమీటర్ల పొడవునా సుమారు రూ.10 వేల కోట్లతో విజయవాడ–అమరావతి–గుంటూరు–తెనాలి –కృష్ణా కెనాల్ స్టేషన్–విజయవాడ మీదుగా ఈ రైల్వే లైన్ నిర్మించాల్సి ఉంటుందని అధికారులు సీఎం చంద్రబాబుకు వివరించారు. దీనిపై ఆయన మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్టుకు సంబంధించి త్వరితగతిన అనుమతులు పొందేందుకు, సహాయ సహకారాల కోసం కేంద్రంతో సంప్రదింపులు జరపాలని అధికారులను ఆదేశించారు. లంక రైతుల ఆశలపై నీళ్లు : రాజధాని పరిధిలోని లంక రైతుల ఆశలపై సీఎం చంద్రబాబు నీళ్లు చల్లారు. రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన ఇతర రైతులందరికీ ఇచ్చే ప్యాకేజీని లంక భూముల రైతులకు ఇవ్వడం కుదరదని తేల్చిచెప్పారు. ఇచ్చింది తీసుకోవాల్సిందేనని చెప్పేశారు. దీంతో దిగాలు చెందిన లంక రైతులు భారంగా వెనుతిరిగారు. సీఆర్డీఏ లంక రైతులకిచ్చే ప్యాకేజీలో భారీ తేడా ఉండటంతో వారు వ్యతిరేకిస్తున్నారు. వారు పలుమార్లు అధికారులు, మంత్రులను కలసి విన్నవించినా సానుకూల ప్రకటన రాలేదు. దీంతో నేరుగా సీఎంను కలసి విన్నవించుకున్నా వారి కోరిక నెరవేరలేదు. -
అనుబంధ రంగాలకు ‘ప్రాధాన్యత’
సాక్షి, హైదరాబాద్ : నూతన పారిశ్రామిక విధానానికి వస్తున్న స్పందన నేపథ్యంలో పరిశ్రమలకు అనుబంధంగా ఉండే రంగాలకు (పాధాన్యత రంగాలు) కూడా ప్రత్యేక పాలసీలు రూపొందించడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ ఏడాది డిసెంబర్ నాటికి పాలసీలపై కసరత్తు పూర్తి చేసి విధి విధానాలు ప్రకటించాలని నిర్ణయించింది. పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్రంలో ఉన్న అవకాశాలు, భౌగోళిక అనుకూలతలు, మానవ వనరులు, ముడి సరుకుల లభ్యత తదితరాలపై నిపుణులు ఇదివరకే ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. నివేదిక ఆధారంగా రాష్ట్రంలో 14 పారిశ్రామిక అనుబంధ రంగాల పురోభివృద్ధికి అవకాశముందని అంచనా వేసి పారిశ్రామిక విధానంలో అంతర్భాగంగా చేర్చారు. లైఫ్ సెన్సైస్, ఐటీ, ఇంజనీరింగ్, ఫుడ్ ప్రాసెసింగ్, ఆటోమొబైల్, టెక్స్టైల్, ప్లాస్టిక్, గృహోపకరణాలు, లోహ పరిశ్రమ, వజ్రాభరణాలు, వేస్ట్ మేనేజ్మెంట్, పునరుత్పాదక ఇంధనం, ఖనిజ ఆధారిత పరిశ్రమలు, రవాణా సౌకర్యాలకు సంబంధించిన రంగాలను ప్రాధాన్యత రంగాలుగా గుర్తించారు. నూతన పారిశ్రామిక విధానంలో భాగంగా ఇప్పటి వరకు రెండు విడతల్లో 36 పరిశ్రమలకు అనుమతులు ఇచ్చారు. వీటి ద్వారా రూ.2,588 కోట్ల పెట్టుబడులు, 8,638 మందికి ఉపాధి దక్కుతుందని అంచనా. ఈ నేపథ్యంలో గుర్తించిన 14 ప్రాధాన్యత రంగాలకు కూడా వేర్వేరుగా ప్రత్యేక పాలసీలు రూపొందిస్తే పెట్టుబడులు వెల్లువలా వస్తాయని రాష్ర్ట ప్రభుత్వం భావిస్తోంది. దీంతో ప్రతీ రంగానికి సంబంధించి ప్రభుత్వ విధానం, ప్రోత్సాహకాలు, రాయితీలు తదితరాలకు సంబంధించి ప్రత్యేక పాలసీల్లో పూర్తి స్పష్టత ఇవ్వనున్నారు. కాగా, పన్నుల వసూలు విధానంపై స్పష్టత లేకపోవడాన్ని పారిశ్రామిక వర్గాలు ప్రస్తావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొత్తగా రూపొందిస్తున్న ప్రత్యేక పాలసీల్లో ఈ అంశంపైనా స్పష్టత ఇవ్వనున్నారు. మౌలిక సదుపాయాలపైనా దృష్టి.. రాష్ట్రాన్ని పెట్టుబడుల ధామంగా మార్చేం దుకు ప్రత్యేక ప్రోత్సాహకాలు, రాయితీలు ఇవ్వడమే మార్గమని ప్రభుత్వం భావిస్తోం ది. పెట్టుబడులు ఆకర్షించేందుకే పరిమితం కాకుండా మౌలిక సౌకర్యాల కల్పనకు పెద్దపీట వేస్తామని చెప్తోంది. ఇందులో భాగంగా పారిశ్రామిక వాడలకు అనుబంధంగా ప్రత్యేక నివాస సముదాయాలు నిర్మించే ఆలోచనలో ఉంది. ఇటీవల జరిగిన సీఐఐ సమావేశంలో పారిశ్రామిక వాడల సమీపంలో శాటిలైట్ టౌన్‌షిప్‌ల ఏర్పాటు ఆలోచనను సీఎం ప్రస్తావించారు. ఇళ్ల నిర్మాణానికి పరిశ్రమలకే భూములు కేటాయించాలా లేక ప్రభుత్వమే నివాస సముదాయాలను అభివృద్ధి చేయాలా అనే అంశంపై కసరత్తు చేయనుంది. -
అదో కొత్త నగరం!
* సరికొత్త సిటీలను నిర్మిస్తున్న బిల్డర్లు * శాటిలైట్ టౌన్‌షిప్‌లుగా మారుతోన్న గ్రామాలు ప్లాట్లు, ఫ్లాట్లే కాదు.. విద్య, వైద్యం, మాల్స్, స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లు అన్నీ ఇక్కడే ఇప్పటివరకు బిల్డర్లు అంటే అపార్ట్మెంట్లు, విల్లాలు, డ్యూప్లెక్స్‌లు మాత్రమే నిర్మిస్తారని మనకు తెలుసు. కానీ, ఇప్పుడు ట్రెండ్ మారింది. ఏకంగా కొత్త నగరాలనే నిర్మిస్తున్నారు. విదేశాల్లో మాదిరిగా గ్రామాలకు గ్రామాలనే కొనేసి శాటిలైట్ టౌన్‌షిప్‌లను రూపొందిస్తున్నారు. ఈ సరికొత్త సిటీల్లో నివాస, వాణిజ్య సముదాయాలే కాదు విద్య, వైద్యం, షాపింగ్ మాళ్లు, క్రీడా అకాడమీలు సకలం కొలువుదీరనున్నాయి. దీంతో నగరం శరవేగంగా అభివృద్ధి చెందడంతో పాటు ఒత్తిడి కూడా తగ్గుతుందని నిపుణుల అభిప్రాయం. సాక్షి, హైదరాబాద్: 2011 జనాభా లెక్కల ప్రకారం.. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల జనాభా దాదాపు 90 లక్షలు. 2031 నాటికి 1.84 కోట్లకు చేరుకుంటుందని సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంట్ ప్లానింగ్ అండ్ టెక్నాలజీ సంస్థ అంచనా. అంటే అప్పటి ప్రజల మౌలిక అవసరాలు, ఇళ్ల కొరతను దృష్టిలో పెట్టుకొని నగరాన్ని అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. అభివృద్ధి అనేది ఒకే చోటకు పరిమితమైతే అందరూ ఆ వైపే పరుగులు తీస్తారు. దీంతో ఆయా ప్రాంతాలపై ఒత్తిడి పెరిగి అనేక రకాల సమస్యలకు దారి తీస్తుంది. అందుకే నగరం మొత్తం సమాంతరమైన అభివృద్ధి జరగాలని స్థిరాస్తి నిపుణులు చెబుతున్నారు. అందుకే శాటిలైట్ నగరాలను అభివృద్ధి చేస్తే నగరం శరవేగంగా అభివృద్ధి చెందడంతో పాటు నిరుద్యోగం, ట్రాఫిక్, ఇళ్ల కొరత వంటి అనేక రకాల సమస్యలకు పరిష్కారం లభిస్తుందంటున్నారు. గ్రామాలకు గ్రామాలే.. శాటిలైట్ టౌన్షిప్ వంటి మెగా ప్రాజెక్ట్‌లను నిర్మించాలంటే వేల ఎకరాల్లో స్థలం కావాలి. అందుకే శివారు ప్రాంతాలు, గ్రామాలను పూర్తిగా రియల్ వెంచర్లు, మెగా, శాటిలైట్ టౌన్‌షిప్‌లతో ముంచెత్తుతున్నారు. ప్రగతి గ్రూప్ చిలుకూరు, ప్రొద్దుటూరు, టంగుటూరు, గొల్లగూడెం, గొల్లపల్లి వంటి 15 గ్రామాల్లోని సుమారు 2 వేల ఎకరాల్లో దశల వారీగా మెగా ప్రాజెక్ట్‌ను నిర్మిస్తోంది. ఇప్పటికే ఇక్కడ ప్రగతి రిసార్ట్స్ కొలువుదీరింది. ప్రస్తుతం 200 ఎకరాల్లో లే అవుట్లను అభివృద్ధి పరుస్తున్నారు. రాంకీ ఎస్టేట్స్ అండ్ ఫామ్స్ లిమిటెడ్ మహేశ్వరం మండలంలోని శ్రీనగర్ గ్రామంలో 600 ఎకరాల్లో డిస్కవరీ సిటీ ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్‌ను నిర్మిస్తోంది. ఫార్చూన్ ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రై.లి. కందుకూరు మండలంలోని దాసర్లపల్లి, కర్తాల్ గ్రామాల్లో 3,600 ఎకరాల్లో ‘ఫార్చూన్ బటర్‌ఫ్లై సిటీ’ పేరుతో సరికొత్త శాటిలైట్ టౌన్‌షిప్‌ను నిర్మిస్తోంది. అన్నీ ఒక్క చోటే.. శాటిలైట్ టౌన్‌షిప్‌లుగా మారుతోన్న గ్రామాల్లో నివాస, వాణిజ్య సముదాయాలతో పాటు ప్రజలకు అవసరమైన విద్య, వైద్యం, వినోదం వంటి సకల సౌకర్యాలూ కల్పిస్తున్నారు. పాతికేళ్ల తర్వాత రాబోయే ప్రజల అవసరాలను ముందుగానే ఊహించి ఆయా ప్రాజెక్ట్‌లను నిర్మిస్తున్నారు. కేజీ నుంచి పీజీ స్థాయి వరకు అంతర్జాతీయ విద్యా సంస్థలు, ఆసుపత్రులు, షాపింగ్ మాళ్లు, ఐటీ, ఫార్మా వంటి అనేక రంగాల కార్యాలయాలు, ఇండోర్, అవుట్ డోర్ ఆట స్థలాలు, థీమ్ పార్క్ వంటివెన్నో కొలువుదీరుతున్నాయి. ఇప్పటికే డిస్కవరీ సిటీలో 5 ఎకరాల్లో ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ పాఠశాల నడుస్తోంది. అలాగే ఫార్చూన్ బటర్‌ఫ్లై ప్రాజెక్ట్‌లో ఫార్చూన్ బటర్‌ఫ్లై స్కూల్ మూడేళ్లుగా నడుస్తోంది. శాటిలైట్ నగరాలిలా.. * శాటిలైట్ నగరాల్లో మెరుగైన రవాణా వ్యవస్థ, రహదారులు, మురుగునీటి వ్యవస్థ, రక్షిత మంచినీరు, పార్కులు, సాంస్కృతిక సంస్థలు ఇలా అన్ని రంగాలకు వేదికగా ఉంటాయి. * నగరం నుంచి సుమారు 100 కి.మీ ల దూరంలో ఉన్న ముఖ్య పట్టణాలు, మండలాలను శాటిలైట్ నగరాలుగా అభివృద్ధి చేసి మౌలిక వసతులు కల్పిస్తారు. * శాటిలైట్ నగరాల నుంచి రాజధానికి చేరుకునేందుకు ఎంఎంటీఎస్, మెట్రో రైళ్ల పరిధిని విస్తరించాలి. * ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పించే కంపెనీలు, పరిశ్రమలను శాటిలైట్ నగరాల్లోనే ఏర్పాటు చేసేలా పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహించాలి. * పతి చిన్న పనికి నగరానికి పరుగులు తీయాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వ విభాగాల కార్యాలయాలను శాటిలైట్ నగరాల్లో ఏర్పాటు చేయాలి. * విద్య, వైద్యం, వృత్తి విద్యా కళాశాలలు, శిక్షణ సంస్థలను ఆయా నగరాల్లోనే ఏర్పాటు చేయాలి. 3,600 ఎకరాల్లో ‘ఫార్చూన్ బటర్‌ఫ్లై సిటీ’ సాక్షి, హైద రాబాద్: ఇంటి పక్కనే స్కూల్, అనారోగ్యం వస్తే ఆసుపత్రి, వీకెండ్స్‌లో ఎంజాయ్ చేయడానికి షాపింగ్ మాల్, మల్టీప్లెక్స్ ఇలా ప్రతీ ఒక్కటీ ఒక్క ప్రాజెక్ట్‌లోనే ఉంటే ఎంత బాగుంటుంది కాదూ. అచ్చం ఇలాంటి ప్రాజెక్ట్‌నే రూపొందిస్తున్నామని ఫార్చూన్ ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రై.లి. బీ శేషగిరిరావు సీఎండీ ‘సాక్షి రియల్టీ’కి చెప్పారు. * కందుకూరు మండలంలోని దాసర్లపల్లి, కర్తాల్ గ్రామాల్లో 3,600 ఎకరాల్లో ‘ఫార్చూన్ బటర్‌ఫ్లై సిటీ’ పేరుతో సరికొత్త శాటిలైట్ టౌన్‌షిప్‌ను నిర్మిస్తున్నాం. 3 వేల ఎకరాలు నివాస, 600 ఎకరాలు వాణిజ్య సముదాయాల కోసం కేటాయించాం. ఇందులో విద్యా సంస్థల కోసం 300 ఎకరాలు, వైద్యం అవసరాల కోసం వంద ఎకరాలు, వినోద, మాల్స్ కోసం 50 ఎకరాలు, స్పోర్ట్స్ అకాడమీ కోసం 25 ఎకరాలు కేటాయించాం. * నివాస సముదాయాల విభాగంలో.. 2,500 ఎకరాలు ఓపెన్ ప్లాట్స్ కోసం, 500 ఎకరాలు విల్లాల కోసం కేటాయించాం. ఇప్పటికే 600 ఎకరాల ప్లాట్లు, సుమారుగా 600లకు పైగా విల్లాలను విక్రయించామంటే ఇక్కడి అభివృద్ధిని, గిరాకీని అర్థం చేసుకోవచ్చు. * ఆగస్టు 15న సీనియర్ సిటిజన్స్ కోసమే సరికొత్త ప్రాజెక్ట్‌ను ప్రారంభిస్తున్నాం. ఫార్చూన్ ఎవరెస్ట్ పేరుతో మధ్య తరగతి ప్రజల కోసం, ఎన్నారైల కోసం ఫార్చూన్ ఎన్నారై టౌన్‌షిప్‌లను కూడా నిర్మిస్తాం. ఇక ధరల విషయానికొస్తే ప్రారంభ ధరలు ఓపెన్ ప్లాట్స్ అయితే గజానికి రూ.3,500, అలాగే విల్లా రూ.35 లక్షలుగా నిర్ణయించాం. 2018 డిసెంబర్ 31నాటికి మొత్తం ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తాం. -
మురికివాడల్లో 10వేల ఫ్లాట్లు, టౌన్షిప్
రాష్ట్రం మొత్తాన్ని మురికవాడల రహితంగా తీర్చి దిద్దాలన్న లక్ష్యంతో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఓ భారీ పథకానికి శ్రీకారం చుట్టారు. చెన్నైతో పాటు ఇతర నగరాల్లో రూ. 825 కోట్లతో మొత్తం పదివేల ఫ్లాట్లు కట్టించాలని, దాంతోపాటు కడంబూర్ సమీపంలో ఓ శాటిలైట్ టౌన్‌షిప్‌ను ఏర్పాటుచేయాలని తలపెడుతున్నారు. 2023 సంవత్సరానికల్లా ఒక్క మురికివాడ అన్నది కూడా లేకుండా చేయాలన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల యోజన కింద తమిళనాడు స్లమ్ క్లియరెన్స్ బోర్డు ఒకదాన్ని ఏర్పాటుచేసి, పదివేల ఫ్లాట్లను కట్టనున్నట్లు జయలలిత అసెంబ్లీలో ప్రకటించారు. తొలిదశలో వీటికి 825 కోట్ల రూపాయలు వెచ్చిస్తామన్నారు. ఇందులో కేంద్రం 50 శాతం వ్యయాన్ని భరిస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతాన్ని భరిస్తుంది, మరో పదిశాతాన్ని లబ్ధిదారులు భరించాల్సి ఉంటుంది. 48.06 కోట్ల రూపాయలతో నోచికుప్పం ప్రాంతంలో 534 ఫ్లాట్లు కట్టాలని జయలలిత ఆదేశించారు. ఇక కడంబూరు గ్రామంలో 222 ఎకరాల విస్తీర్ణంలో అన్ని సదుపాయాలతో కూడిన రెసిడెన్షియల్ టౌన్షిప్ ఒకదాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. అలాగే కోయంబేడు ప్రాంతంలో రూ.63.25 కోట్లతో ఒక సరికొత్త భవనాన్ని చెన్నై మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీకి కేటాయించారు.