మురికివాడల్లో 10వేల ఫ్లాట్లు, టౌన్షిప్
రాష్ట్రం మొత్తాన్ని మురికవాడల రహితంగా తీర్చి దిద్దాలన్న లక్ష్యంతో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఓ భారీ పథకానికి శ్రీకారం చుట్టారు. చెన్నైతో పాటు ఇతర నగరాల్లో రూ. 825 కోట్లతో మొత్తం పదివేల ఫ్లాట్లు కట్టించాలని, దాంతోపాటు కడంబూర్ సమీపంలో ఓ శాటిలైట్ టౌన్షిప్ను ఏర్పాటుచేయాలని తలపెడుతున్నారు. 2023 సంవత్సరానికల్లా ఒక్క మురికివాడ అన్నది కూడా లేకుండా చేయాలన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల యోజన కింద తమిళనాడు స్లమ్ క్లియరెన్స్ బోర్డు ఒకదాన్ని ఏర్పాటుచేసి, పదివేల ఫ్లాట్లను కట్టనున్నట్లు జయలలిత అసెంబ్లీలో ప్రకటించారు. తొలిదశలో వీటికి 825 కోట్ల రూపాయలు వెచ్చిస్తామన్నారు.
ఇందులో కేంద్రం 50 శాతం వ్యయాన్ని భరిస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతాన్ని భరిస్తుంది, మరో పదిశాతాన్ని లబ్ధిదారులు భరించాల్సి ఉంటుంది. 48.06 కోట్ల రూపాయలతో నోచికుప్పం ప్రాంతంలో 534 ఫ్లాట్లు కట్టాలని జయలలిత ఆదేశించారు. ఇక కడంబూరు గ్రామంలో 222 ఎకరాల విస్తీర్ణంలో అన్ని సదుపాయాలతో కూడిన రెసిడెన్షియల్ టౌన్షిప్ ఒకదాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. అలాగే కోయంబేడు ప్రాంతంలో రూ.63.25 కోట్లతో ఒక సరికొత్త భవనాన్ని చెన్నై మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీకి కేటాయించారు.