సాక్షి, హైదరాబాద్ : నూతన పారిశ్రామిక విధానానికి వస్తున్న స్పందన నేపథ్యంలో పరిశ్రమలకు అనుబంధంగా ఉండే రంగాలకు (పాధాన్యత రంగాలు) కూడా ప్రత్యేక పాలసీలు రూపొందించడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ ఏడాది డిసెంబర్ నాటికి పాలసీలపై కసరత్తు పూర్తి చేసి విధి విధానాలు ప్రకటించాలని నిర్ణయించింది. పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్రంలో ఉన్న అవకాశాలు, భౌగోళిక అనుకూలతలు, మానవ వనరులు, ముడి సరుకుల లభ్యత తదితరాలపై నిపుణులు ఇదివరకే ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు.
నివేదిక ఆధారంగా రాష్ట్రంలో 14 పారిశ్రామిక అనుబంధ రంగాల పురోభివృద్ధికి అవకాశముందని అంచనా వేసి పారిశ్రామిక విధానంలో అంతర్భాగంగా చేర్చారు. లైఫ్ సెన్సైస్, ఐటీ, ఇంజనీరింగ్, ఫుడ్ ప్రాసెసింగ్, ఆటోమొబైల్, టెక్స్‌టైల్, ప్లాస్టిక్, గృహోపకరణాలు, లోహ పరిశ్రమ, వజ్రాభరణాలు, వేస్ట్ మేనేజ్‌మెంట్, పునరుత్పాదక ఇంధనం, ఖనిజ ఆధారిత పరిశ్రమలు, రవాణా సౌకర్యాలకు సంబంధించిన రంగాలను ప్రాధాన్యత రంగాలుగా గుర్తించారు. నూతన పారిశ్రామిక విధానంలో భాగంగా ఇప్పటి వరకు రెండు విడతల్లో 36 పరిశ్రమలకు అనుమతులు ఇచ్చారు.
వీటి ద్వారా రూ.2,588 కోట్ల పెట్టుబడులు, 8,638 మందికి ఉపాధి దక్కుతుందని అంచనా. ఈ నేపథ్యంలో గుర్తించిన 14 ప్రాధాన్యత రంగాలకు కూడా వేర్వేరుగా ప్రత్యేక పాలసీలు రూపొందిస్తే పెట్టుబడులు వెల్లువలా వస్తాయని రాష్ర్ట ప్రభుత్వం భావిస్తోంది. దీంతో ప్రతీ రంగానికి సంబంధించి ప్రభుత్వ విధానం, ప్రోత్సాహకాలు, రాయితీలు తదితరాలకు సంబంధించి ప్రత్యేక పాలసీల్లో పూర్తి స్పష్టత ఇవ్వనున్నారు. కాగా, పన్నుల వసూలు విధానంపై స్పష్టత లేకపోవడాన్ని పారిశ్రామిక వర్గాలు ప్రస్తావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొత్తగా రూపొందిస్తున్న ప్రత్యేక పాలసీల్లో ఈ అంశంపైనా స్పష్టత ఇవ్వనున్నారు.
మౌలిక సదుపాయాలపైనా దృష్టి..
రాష్ట్రాన్ని పెట్టుబడుల ధామంగా మార్చేం దుకు ప్రత్యేక ప్రోత్సాహకాలు, రాయితీలు ఇవ్వడమే మార్గమని ప్రభుత్వం భావిస్తోం ది. పెట్టుబడులు ఆకర్షించేందుకే పరిమితం కాకుండా మౌలిక సౌకర్యాల కల్పనకు పెద్దపీట వేస్తామని చెప్తోంది. ఇందులో భాగంగా పారిశ్రామిక వాడలకు అనుబంధంగా ప్రత్యేక నివాస సముదాయాలు నిర్మించే ఆలోచనలో ఉంది. ఇటీవల జరిగిన సీఐఐ సమావేశంలో పారిశ్రామిక వాడల సమీపంలో శాటిలైట్ టౌన్‌షిప్‌ల ఏర్పాటు ఆలోచనను సీఎం ప్రస్తావించారు. ఇళ్ల నిర్మాణానికి పరిశ్రమలకే భూములు కేటాయించాలా లేక ప్రభుత్వమే నివాస సముదాయాలను అభివృద్ధి చేయాలా అనే అంశంపై కసరత్తు చేయనుంది.
అనుబంధ రంగాలకు ‘ప్రాధాన్యత’
Published Thu, Aug 20 2015 2:03 AM | Last Updated on Sun, Sep 3 2017 7:44 AM
Advertisement
Advertisement