షాబాద్: తెలంగాణలో నూతన పారిశ్రామికవిధానం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల పరిధిలోని సీతారాంపూర్‌లో 250 ఎకరాల్లో రూ.1,200 కోట్లతో కిటెక్స్ గ్రూప్స్ రెండో యూనిట్, చందనవెళ్లిలో రూ.272 కోట్లతో సింటెక్స్ మూడో యూనిట్‌కు గురువారం మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, ఎంపీ రంజిత్‌రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్ అనితారెడ్డి, ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, రోహిత్‌రెడ్డితో కలిసి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ దేశ, విదేశాల నుంచి రాష్ట్రానికి పెట్టుబడుల వరద వస్తోందని, సీఎం కేసీఆర్ చేస్తున్న కృషికి ఇదే నిదర్శనమన్నారు.
రాబోయే రోజుల్లో సీతారాంపూర్, చందనవెళ్లి గ్రామాలు పారిశ్రామిక ఖిల్లాలుగా మారుతాయని, ప్రపంచ చిత్రపటంలో ఇవి మార్మోగుతాయని చెప్పారు. షాబాద్‌లో తయారు చేసిన సింటెక్స్ డబ్బాలు ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసే అవకాశాలున్నాయన్నారు. టెక్స్‌టైల్స్, నాపరాయి పరిశ్రమలు పూర్తయితే వేలాది మంది మహిళలకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. అంతకుముందు ఆయన సీతారాంపూర్ చౌరస్తా వద్ద పార్టీ జెండాను ఆవిష్కరించారు. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు.
రెండు నెలల తర్వాత బీఆర్‌ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశంతో తెలంగాణలో పార్రిశామిక విధానం ముందుకు సాగుతోందని అన్నారు. త్వరలో పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తి చేసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామన్నారు. కార్యక్రమంలో వెల్స్‌పన్ సంస్థ అధినేత బాలకృష్ణ గోయెంకా, కిటెక్స్ జాకబ్, జిల్లా కలెక్టర్ హరీశ్, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment