టీడీపీ నాయకులు కుయుక్తులతో హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్న యరజర్ల వద్ద ఏర్పాటు చేసిన శాటిలైట్ టౌన్‌షిప్ లేఅవుట్
సీన్ 1: పేదలకు పక్కా ఇళ్లు ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయం మేరకు ఒంగోలు నగరంలో శాటిలైట్ టౌన్ షిప్ నిర్మించాలని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి యోచించారు. నిరుపేదలకు సొంత ఇంటికల నిజం చేయాలన్న సదుద్దేశంతో బాలినేని నగర సమీపంలో ప్రభుత్వ స్థలం అన్వేషించిమరీ లే అవుట్ తయారు చేయించారు. రాష్ట్రంలోనే ఏ జిల్లాలో లేనివిధంగా ఒకేచోట భారీ స్థాయిలో ఉన్న ప్రభుత్వ భూమిని గుర్తించి వేల సంఖ్యలో పేదలకు ఒకేచోట ఇళ్ల స్థలాలు ఇవ్వవచ్చని భావించి వడివడిగా చదును చేయించారు. యరజర్ల గ్రామంలోని 818 ఎకరాల్లో 24 వేల మందికి ఇళ్లు నిర్మించాలనుకున్నారు.
సీన్ 2: ఇంత మంది పేదలకు ఇళ్లు కట్టిస్తే ప్రభుత్వానికి, బాలినేనికి ఎక్కడ పేరు వస్తుందోనని భావించిన తెలుగుదేశం పార్టీ కుట్రలకు తెరతీసింది. మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కుయుక్తులు పన్నారు. న్యాయపరమై ఇబ్బందులు సృష్టించి పేదలకు గృహాలను దూరం చేశారు. తన అనుచరుడు మక్కెన శ్రీనివాసరావు చేత హైకోర్టులో కేసు వేయించి స్టే తెచ్చారు. ఫలితంగా నిరుపేదల ఆశపై నీళ్లుజల్లారు.
సీన్ 3: పేదలకు ఇళ్ల నిర్మాణం కోసం ఎందాకైనా వెళ్లాలని బాలినేని నిర్ణయించారు. పచ్చ కుట్రలను తిప్పికొట్టి నిరుపేదలను ఆదుకోవాలనుకున్నారు. నగర పరిసర ప్రాంతాల్లో 500 ఎకరాల ప్రైవేటు స్థలాన్ని సేకరించాలని రంగం సిద్ధం చేశారు. ఇదే విషయాన్ని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముందుంచారు. సీఎం బాలినేని ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నగరం చుట్టూ ఉన్న ఆరు గ్రామాల్లో స్థలాలు ఎంపిక చేసేపనిలో పడ్డారు.
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: పేదవారి సొంతింటి కల సాకారం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తలంచారు. వైఎస్సార్ జగనన్న కాలనీల్లో పెద్ద ఎత్తున గృహాలు నిర్మించేందుకు రంగం సిద్ధం చేశారు. ఒంగోలు నగరంలో పేదలకు ఒకే ప్రాంతంలో ఇళ్లు నిర్మించాలని ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రీజినల్ కో ఆర్డినేటర్ బాలినేని శ్రీనివాసరెడ్డి భావించారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఒక శాటిలైట్ సిటీని కట్టాలని, ఆమేరకు చర్యలు చేపట్టారు. యరజర్ల గ్రామంలోని 818 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని గుర్తించారు. దాదాపు 24 వేల మందికి సొంత ఇంటి కల నిజం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. హద్దురాళ్లు సైతం వేయించారు. పనులు వేగంగా జరుగుతున్న సమయంలో టీడీపీ నేతలు సైంధవుడిలా అడ్డుపడ్డారు. ఇంతమంది నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తే ఇక తన రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ భావించి కుట్రలకు తెరతీశారు. తన ప్రధాన అనుచరుడు అయిన ఒంగోలు మండలం సర్వేరెడ్డిపాలెం గ్రామానికి చెందిన మక్కెన శ్రీనివాసరావు చేత హైకోర్టులో కేసు వేయించాడు. దీంతో హైకోర్టు నిరుపేదలకు ఇచ్చే ఇళ్ల పట్టాలను ఇవ్వకుండా నిలుపుదల చేస్తూ స్టే ఆర్డర్ ఇచ్చింది.
మైనింగ్ పేరుతో అడ్డుపుల్ల:
యరజర్ల గ్రామంలోని ప్రస్తుతం ఇళ్లపట్టాలకు ఇవ్వాలని భావించిన స్థలం గతంలో ఐరన్ ఓర్ మైనింగ్‌కు ఇచ్చారంటూ మక్కెన శ్రీనివాసరావు హైకోర్టుకు వెళ్లాడు.
అయితే గతంలో మైనింగ్‌కు ఇచ్చినప్పుడు ఇదే మక్కెన శ్రీనివాసరావు మైనింగ్‌కు ఇవ్వటానికి వీలులేదని ఆందోళనలు చేశాడు. మైనింగ్ లీజులు రద్దుచేసి ఐఐఐటీకి ఇవ్వాలని కూడా ఆందోళనలు చేపట్టాడు. ఇదంతా మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఆడుతున్న కుట్రలో భాగంగానే జరిగిందని అందరూ గుర్తించారు.
టీడీపీ కుట్రలకు చెక్
నగరంలోని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్లు కట్టించాలని బాలినేని శ్రీనివాస రెడ్డి బలంగా భావించారు. ప్రైవేటు స్థలాన్ని కొనుగోలు చేసి ఇళ్లు నిర్మించాలన్న ప్రతిపాదనలను సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముందుంచారు. దీనికి ఆయన అంగీకరించారు. ఒంగోలు, కొత్తపట్నం మండలాల పరిధిలో 500 ఎకరాలు కేటాయించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. భూములు కొనేందుకు రూ.200 కోట్లు కేటాయించారు.
ఆరు గ్రామాల్లో స్థలాల గుర్తింపు..
ఇళ్ల స్థలాలు ఇవ్వటానికి రెవెన్యూ అధికారులు ఇప్పటికే ఆరు గ్రామాల్లో స్థలాలను గుర్తించారు. మొత్తం దాదాపు 25 వేల మందికి ఇచ్చేలా స్థలాల ఎంపిక ప్రక్రియ ప్రారంభించారు. మల్లేశ్వరపురం, పెళ్లూరు, అగ్రహారం, సర్వేరెడ్డిపాలెం, వెంగముక్కల పాలెం, కరవది గ్రామాల్లో సర్వే నంబర్ల వారీగా స్థలాలను ఇప్పటికే గుర్తించారు. సర్వే నంబర్ల వారీగా అనుభవదారులు, హక్కుదారులను గుర్తించి వారి వద్ద నుంచి కొనుగోలు చేయటానికి రంగం సిద్ధం చేస్తున్నారు. పదిహేను రోజుల్లోపు ఆయా గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి ప్రభుత్వానికి నివేదిక పంపేందుకు సన్నాహాలు ముమ్మరం చేశారు.
మార్చి నెలాఖరుకల్లా ఇళ్ల పట్టాలు ఇచ్చి తీరుతాం
టీడీపీ నాయకులు ఎన్ని అడ్డంకులు కల్పించినా మార్చి నెలాఖరుకల్లా నిరుపేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చి ఆదుకుంటాం. సీఎం వైఎస్ జగన్‌కు ఇళ్ల పట్టాల విషయం చెప్పాను. కోర్టు అడ్డంకులు ఉన్నందున ప్రైవేటు స్థలాలైనా కొనుగోలు చేసి ఇద్దామని హామీ ఇచ్చారు. దీంతో ఒంగోలు నగర పరసర గ్రామాల్లో దాదాపు 500 ఎకరాలు కొనుగోలు చేసి ఇవ్వటానికి భూముల గుర్తింపు ప్రారంభించాం. అందుకోసం రూ.200 కోట్లు కేటాయించారు. ఇప్పటికే భూముల గుర్తింపు కార్యక్రమాన్ని రెవెన్యూ అధికారులు ప్రారంభించారు.
– బాలినేని శ్రీనివాస రెడ్డి, ఒంగోలు ఎమ్మెల్యే
Comments
Please login to add a commentAdd a comment