
ఉత్సవ మూర్తులు వేణుగోపాల స్వామి, హనుమత్సమేత సీతారామలక్ష్మణులకు పూజలు నిర్వహిస్తున్న వేదపండితులు
పుట్టపర్తి: పుట్టపర్తి సత్యసాయి బాబా 89వ జయంత్యుత్సవాలు మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం ప్రశాంతి నిలయంలోని సాయి కుల్వంత్ సభామందిరంలో సత్యసాయి మహా సమాధి చెంత వేదపండితులు ప్రత్యేక పూజలు చేశారు. సీతారాముల కల్యాణోత్సవం, వేణుగోపాలస్వామికి పూజలు నిర్వహించారు. తర్వాత ప్రశాంతి నిలయం ఉత్తరగోపురం వద్ద నుంచివేణుగోపాలస్వామి రథోత్సవాన్ని సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యులు ఆర్‌జే రత్నాకర్‌రాజు, చక్రవర్తి, మద్రాస్ శ్రీనివాస్ ప్రారంభించారు. సీతారామ, లక్ష్మణ, హనుమంతులు ముందు ఊరేగగా.. ఆ వెనుకే వేణుగోపాలుడి రథం పురవీధుల గుండా తిరిగింది.
అనంతరం రత్నాకర్ రాజు విలేకరులతో మాట్లాడుతూ..89వ జయంతి కానుకగా పుట్టపర్తి, కొత్తచెరువు, బుక్కపట్నం మండలాల్లోని 118 గ్రామాలకు తాగునీరు అందించేందుకు రూ. 80 కోట్లతో పూర్తిచేసిన పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ఈనెల 23న ప్రారంభిస్తారన్నారు. సత్యసాయి జీవిత విశేషాలను తెలియజేసే ఆర్కియాలజీ భవన్‌ను వచ్చే సత్యసాయి ఆరాధనోత్సవాల నాటికి ప్రారంభిస్తామన్నారు. అంతకుముందు బాలవికాస్ విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నారుు. కార్యక్రమంలో సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ కార్యదర్శి ప్రసాద్‌రావు, మాజీ డీజీపీ హెచ్‌జే దొర, ప్రశాంతి కౌన్సిల్ చైర్మన్ నరేంద్రనాథ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఉత్సవాలు ఈ నెల 23వరకూ జరుగుతాయి.