సత్యం కేసు తుది తీర్పు తేదీ మళ్లీ వాయిదా
హైదరాబాద్ : సత్యం కంప్యూటర్స్ కుంభకోణం కేసులో తుది తీర్పు వెల్లడించే తేదీని నాంపల్లి సీబీఐ కోర్టు మరోసారి వాయిదా వేసింది. తుది తీర్పు వెల్లడించే తేదీని జులై 28న ప్రకటిస్తామని 25వ అడిషినల్ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి బీవీఎల్ఎన్ చక్రవర్తి గురువారం తెలిపారు.
కాగా కోట్లాది రూపాయల కుంభకోణం కేసులో సత్యం కంప్యూటర్ సర్వీసెస్ పై గత ఐదున్నర సంవత్సరాలు విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో విచారణ ఇప్పటికే పూర్తయింది. తీర్పును వెల్లడించడానికి 216 మంది సాక్ష్యులను విచారించి, 3038 డాక్యుమెంట్లను పరిశీలించారు. 2009లో జనవరి 7 తేదిన ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది.
కోట్లాది రూపాయలను సర్దుబాటు చేసేందుకు సత్యం కంపెనీకి చెందిన ఖాతాలను తారుమారు చేశానని మీడియా ముందుకు వచ్చి కంపెనీ మాజీ చైర్మన్ రామలింగరాజు ఒప్పుకోవడం ప్రపంచ కార్పోరేట్ వ్యవస్థ నివ్వెరపోయిన సంగతి తెలిసిందే. కాగా మనీలాండరింగ్ ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్(ఈడీ) చార్జిషీట్ దాఖలు చేసిన నేపథ్యంలో రామలింగరాజు కోర్టుకు హాజరు అయ్యారు.