భవనానికి తాళం వేయడంతో వరండాలోనే ఉన్న విద్యార్థులు
జలదంకి: మండలంలోని జమ్మలపాళెం ఎస్సీ కాలనీ ప్రాథమిక పాఠశాల భవనానికి గురువారం తాళం పడింది. పాఠశాలకు నూతన భవనం మంజూరై నిర్మాణ పనులు పూర్తి కావడంతో నూతన భవనాన్ని బుధవారం స్కూల్ కాంప్లెక్స్ హెచ్‌ఎం కొండారెడ్డి, ఎస్‌ఎంసీ చైర్మన్ సుజాత ప్రారంభించారు. ఇది జమ్మలపాళెం సర్పంచ్ నక్కా మాధవరావుకు కోపం తెప్పించింది. ప్రొటోకాల్ ప్రకారం సర్పంచ్‌ను పిలవకుండా ప్రారంభించడంతో పాఠశాల భవనానికి సర్పంచ్ తాళం వేసినట్లు తెలుస్తోంది. దీంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు వరండాలోనే చదువులు కొనసాగించాల్సి వచ్చింది. శుక్రవారం కూడా విద్యార్థులు, ఉపాధ్యాయులు వరండాలోనే చదువులు కొనసాగిస్తారా అనేది తెలియాల్సి ఉంది. టీడీపీ సర్పంచ్ కావడంతో అధికారం ఉపయోగించి తిరిగి పాఠశాల భవనాన్ని ప్రారంభించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఈ విషయం వల్ల విద్యార్థులు వరండాలో చదువులు కొసాగించాల్సి వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment