సాక్షి, అమరావతి : టెండర్ నోటిఫికేషన్ జారీ చేయక ముందే కాంట్రాక్టర్లతో బేరసారాలు జరిపారు. అడిగిన మేరకు కమీషన్ ఇచ్చేందుకు అంగీకరించిన కాంట్రాక్టర్‌కు మాత్రమే పనులు దక్కేలా నిబంధనలతో టెండర్ నోటిఫికేషన్ జారీ చేయించారు. ఇద్దరు కాంట్రాక్టర్లు షెడ్యూళ్లు దాఖలు చేశారు. ఒక కాంట్రాక్టర్‌పై సాంకేతిక (టెక్నికల్) బిడ్‌లో అనర్హత వేటు వేశారు. బరిలో ఒక్క కాంట్రాక్టరే మిగలడంతో నిబంధనల ప్రకారం ఆర్థిక(ఫైనాన్స్) బిడ్ తెరవకూడదు. ఎందుకంటే పోటీ లేకపోవడం వల్ల అధిక (ఎక్సెస్) ధరలకు పనులు అప్పగించాల్సిన పరిస్థితి వస్తుంది. ఒకే షెడ్యూలు మిగిలినప్పుడు ఆర్థిక బిడ్ తెరవ కుండా టెండర్ రద్దు చేసి మళ్లీ టెండర్లు నిర్వహించాలని ప్రభుత్వం జీవో 174లో స్పష్టంగా పేర్కొంది. నిబంధనలను తుంగలో తొక్కిన ప్రభుత్వ పెద్దలు అధికారులపై ఒత్తిడి తెచ్చి ఫైనాన్స్ బిడ్‌ను తెరిపించారు.
అస్మదీయ కాంట్రాక్టర్ 4.57 శాతం అధిక ధరకు కోట్ చేసినట్లు వెల్లడైంది. ఆ టెండర్లను ఆమోదిం చాలని కమిషనర్ ఆఫ్ టెండర్స్ (సీవోటీ)పై ఒత్తిడి తెస్తున్నారు. ఈ వ్యవహారంలో రూ. 150 కోట్లకుపైగా ముడుపులు చేతులు మారనున్నాయి. సీఎం చంద్రబాబు కనుసన్నల్లో ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు, జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సాగిస్తున్న ఈ అక్రమాలకు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం వేదికైంది. పోలవరం ఎడమ కాలువ ద్వారా 63.4 టీఎంసీల గోదావరి జలాలను మళ్లించి విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో 8 లక్షల ఎకరాలకు సాగునీళ్లు, 30 లక్షల మంది దాహార్తి తీర్చాలన్న లక్ష్యంతో రూ.7,214.1 కోట్ల అంచనాతో ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకాన్ని జనవరి 2, 2009న దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి మంజూరు చేశారు. ఆయన హఠాన్మరణంతో ఈ పథకం మరుగున పడింది.
అంచనా వ్యయం పెంచేసి..
ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకాన్ని మరుగున పడేయడంపై ప్రజలు ఆందోళన బాట పట్టడంతో ప్రభుత్వం దిగివచ్చింది. రూ. 2,022.20 కోట్లతో ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం తొలి దశను గతేడాడి సెప్టెంబర్ 5న మంజూరు చేసింది. పోలవరం ఎడమ కాలువ 162.409 కి.మీ. నుంచి పది టీఎంసీలను మళ్లించి విశాఖపట్నం జిల్లాలో 9 మండలాల్లోని 1.30 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించాలని నిర్ణయించారు. కానీ.. 2009లో ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఈ పనుల అంచనా వ్యయం రూ.801.03 కోట్లు మాత్రమే. అంటే అంచనా వ్యయాన్ని రూ.1,221.17 కోట్లు పెంచినట్లు స్పష్టమవుతోంది.
ఆ తర్వాత తొలి దశ పనులను రెండు ప్యాకేజీలుగా విడగొట్టారు. ఈ పనులను తన వియ్యంకుడు పుట్టా సుధాకర్ యాదవ్ వ్యాపార భాగస్వామి అయిన హెచ్‌ఈఎస్–ఇన్‌ఫ్రాకు అప్పగించాలని సీఎం చంద్రబాబును మంత్రి యనమల మొదట్లోనే కోరినట్లు అధికారవర్గాలు వెల్లడించాయి. యనమల ప్రతిపాదన మేరకు గత ఫిబ్రవరిలో ఉత్తరాంధ్ర సుజల స్రవంతి తొలి దశలో మొదటి ప్యాకేజీ (పోలవరం ఎడమ కాలువ 162.409 కి.మీ. నుంచి 3.5 కి.మీ.ల ప్రధానకాలువ తవ్వకం, లైనింగ్, 3.5 టీఎంసీల సామర్థ్యంతో పెదపూడి రిజర్వాయర్) పనులకు రూ.268.92 కోట్ల అంచనా వ్యయంతో టెండర్లు పిలిచారు. 4.85 శాతం అధిక ధరలకు అంటే 281.96 కోట్లకు హెచ్‌ఈఎస్ సంస్థకు కట్టబెట్టారు.
రెండో ప్యాకేజీలోనూ అదే దందా..
ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం తొలి దశలో రెండో ప్యాకేజీ పనుల (పెదపూడి రిజర్వాయర్‌లోకి రెండు దశల్లో నీటిని ఎత్తిపోయడం, 1.30 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించడం)కు రూ. 603.87కోట్ల అంచనా వ్యయంతో ఈపీసీ విధానంలో జూన్ 8న టెండర్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ టెండర్లలో ఇతరులు ఎవరికీ పాల్గొనే అవకాశమే లేకుండా చేసేందుకు 1.30 లక్షల ఎకరాల ఆయకట్టులో కేవలం 15,118 ఎకరాలకు మాత్రమే పైపుల ద్వారా నీళ్లందించాలని ప్రతిపాదించారు. అంటే.. పైపుల ద్వారా ఆయకట్టుకు నీళ్లు అందించిన అనుభవమున్న కాంట్రాక్టర్లకు మాత్రమే టెండర్లలో పాల్గొనడానికి అర్హులనే నిబంధన పెట్టేందుకే దీనిని చొప్పించారని స్పష్టమవుతోంది. ఆ నిబంధన మేరకే హెచ్‌ఈఎస్ సంస్థ మెగా సంస్థతో జట్టు కట్టి జాయింట్ వెంచర్ (జేవీ) ఏర్పాటు చేసేలా చక్రం తిప్పారు.
దానితో షెడ్యూల్ దాఖలు చేయించారు. ఎన్‌సీసీ సంస్థ మరో షెడ్యూల్ దాఖలు చేసింది. ఈనెల 2న టెక్నికల్ బిడ్ తెరిచారు. ఎన్‌సీసీ సంస్థ దాఖలు చేసిన షెడ్యూల్‌లో తప్పులు ఉన్నాయంటూ ఆ సంస్థపై అనర్హత వేటు వేశారు. అంటే బరిలో హెచ్‌ఈఎస్–మెగా (జేవీ) మాత్రమే మిగిలింది. షెడ్యూలు ప్రకారం ఈనెల 4న ప్రైస్ బిడ్ తెరవాలి. ఒకే ఒక సంస్థ బరిలో మిగిలిన నేపథ్యంలో నిబంధనల మేరకు ప్రైస్ బిడ్ తెరవకూడదని అధికారులు నిర్ణయించారు. కానీ.. మంత్రులు దేవినేని, యనమల అధికారులపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చి ఈనెల 12న ప్రైస్ బిడ్ తెరిపించినట్లు తెలుస్తోంది. ఇందులో 4.57 శాతం అధిక ధరలకు ఆ సంస్థ కోట్ చేసింది. ఆ సంస్థకే పనులు అప్పగించడానికి అనుమతి కోరుతూ సీవోటీకి సోమవారం అధికారులు ప్రతిపాదనలు పంపారు.
సీవోటీ ఆమోదముద్రే తరువాయి..
ఉత్తరాంధ్ర సుజల స్రవంతి తొలి దశ రెండో ప్యాకేజీ టెండర్లను ఆమోదించాలంటూ సీఎం చంద్రబాబు, ఇద్దరు మంత్రులు సీవోటీపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెస్తున్నట్లు అధికారవర్గాలు పేర్కొన్నాయి. నిబంధనల ప్రకారం సింగిల్ బిడ్ టెండర్లను తిరస్కరించాలి. కానీ.. ఒత్తిడి తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఆ టెండర్లను ఆమోదించే అవకాశం ఉందని అధికారవరర్గాలు వెల్లడించాయి. 2017–18 ఎస్‌ఎస్‌ఆర్ ధరలను పరిగణనలోకి తీసుకుంటే రెండో ప్యాకేజీ పనుల్లో జమ్మాదులపాలెం, తీడ పంప్ హౌస్‌ల పనులకు రూ. 243 కోట్లకు మించి ఖర్చు కాదని అధికారవర్గాలే చెబుతున్నాయి.
లీడింగ్ ఛానల్ తవ్వకం పనులకు రూ. 50.73 కోట్లు, 1.30 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించే డిస్ట్రిబ్యూటరీ పనులకు రూ. 130 కోట్లకు మించి వ్యయం కాదు. అంటే.. మొత్తం 423.13 కోట్లకు మించి ఖర్చు కాదు. కానీ.. పనుల వ్యయాన్ని రూ. 603.87 కోట్లకు పెంచేసి టెండర్లు పిలవడం, వాటిని 4.57 అధిక ధరలకు కాంట్రాక్టర్‌కు అప్పగించడం ద్వారా రూ. 150 కోట్లకుపైగా కమీషన్‌లు రాబట్టుకోవడానికి ప్రభుత్వ పెద్దలు స్కెచ్ వేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment