sujala sravanthi scheme
-
గాలేరు–నగరి.. హంద్రీ–నీవా అనుసంధానం
సాక్షి, అమరావతి: గాలేరు–నగరి సుజల స్రవంతి పథకంతో హంద్రీ–నీవా సుజల స్రవంతి రెండో దశ అనుసంధానం, చిత్రావతి రిజర్వాయర్ నుంచి నీటిని ఎత్తిపోసి పులివెందుల, లింగాల మండలాల్లోని చెరువులను నింపడంతోపాటు యూసీఐఎల్ (యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్) ప్రభావిత ఏడు గ్రామాల ప్రజలకు నీటిని అందించేందుకు చేపట్టిన ప్రాజెక్టులకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం వైఎస్సార్ జిల్లా రాయచోటిలో శంకుస్థాపన చేయనున్నారు. ఈ రెండు పథకాల ద్వారా కృష్ణా వరద జలాలను ఒడిసిపట్టి వైఎస్సార్ కడప, చిత్తూరు జిల్లాల్లో మెట్ట ప్రాంతాలను సస్యశ్యామలం చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. 1.41లక్షల ఎకరాలు సస్యశ్యామలం వైఎస్సార్ కడప జిల్లా గాలివీడు మండలం వెలిగల్లు వద్ద పాపాఘ్ని నదిపై 4.56 టీఎంసీల సామర్థ్యంతో వెలిగల్లు జలాశయాన్ని నిర్మించారు. కానీ, నదీ పరీవాహక ప్రాంతంలో వర్షాభావ పరిస్థితులవల్ల ఇది నిండటంలేదు. దీనివల్ల ఆయకట్టుకు నీళ్లందించలేని దుస్థితి నెలకొనడంతోపాటు చక్రాయిపేట మండలంలోని కాలేటివాగు జలాశయానికి కూడా నీరు చేరడంలేదు. అలాగే, హంద్రీ–నీవా సుజల స్రవంతి సామర్థ్యం తక్కువగా ఉండటంతో ఆ ప్రాజెక్టు రెండో దశలో భాగమైన శ్రీనివాసపురం రిజర్వాయర్, అడవిపల్లి రిజర్వాయర్లకు కూడా నీళ్లందించడం కష్టతరంగా మారింది. ఈ నేపథ్యంలో.. కృష్ణా వరద జలాలను ఒడిసి పట్టి, ఆ జలాశయాలను నింపడం ద్వారా మెట్ట ప్రాంతాల్లోని 1.41 లక్షల ఎకరాలను సస్యశ్యామలం చేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సంకల్పించారు. వెలిగల్లుకు కృష్ణా జలాలు కృష్ణా వరద నీటిని ఒడిసి పట్టడానికి గాలేరు–నగరి సుజల స్రవంతి పథకం సామర్థ్యాన్ని పెంచాలని ముఖ్యమంత్రి ఇప్పటికే ఆదేశించారు. గాలేరు–నగరి ప్రధాన కాలువ 56 కి.మీ. పాయింట్ నుంచి రోజుకు 2 వేల క్యూసెక్కుల చొప్పున కాలేటివాగు జలాశయంలోకి ఎత్తిపోసి ఆయకట్టుకు నీళ్లందిస్తారు. అలాగే, కాలేటివాగు జలాశయం నుంచి రోజుకు 450 క్యూసెక్కులను ఎత్తిపోసి.. చక్రాయిపేట, రామాపురం, లక్కిరెడ్డిపల్లె మండలాల్లోని చెరువులను నింపుతారు. ఇదే జలాశయం నుంచి రోజుకు 1,550 క్యూసెక్కుల చొప్పున లిఫ్ట్‌చేసి.. హంద్రీ–నీవా ప్రధాన కాలువలోకి 473 కి.మీ. వద్ద పోస్తారు. ఈ జలాలతో వెలిగల్లు, శ్రీనివాసపురం, అడవిపల్లి జలాశయాలను నింపి ఆయకట్టుకు నీళ్లందిస్తారు. కాగా, గాలేరు–నగరి ప్రధాన కాలువ నుంచి 48 రోజుల్లో 8.164 టీఎంసీలను తరలించేలా ఈ పథకం పనులు చేపట్టడానికి అవసరమైన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) తయారీ పనులను ఇప్పటికే సర్వే సంస్థకు అప్పగించారు. ఈ పథకం పనులు చేపట్టడానికి రూ.1,272 కోట్లు అవసరం అవుతాయని అంచనా. యురేనియం సమస్యకు విరుగుడు పులివెందుల, లింగాల మండలాల్లో వర్షాభావ పరిస్థితులవల్ల చెరువుల్లోకి నీరు చేరడంలేదు. యురేనియం పరిశ్రమవల్ల మబ్బుచింతలపల్లి, కనంపల్లి, తుమ్మలపల్లి, కొట్టాలు భూమయ్యగారిపల్లి, రాచకుంటపల్లి, వేల్పుల గ్రామాల్లో భూగర్భ జలాలు కలుషితమవడంవల్ల ఆ గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్య పరిష్కారానికి చిత్రావతి రిజర్వాయర్ నుంచి రోజుకు 350 క్యూసెక్కుల చొప్పున రెండు టీఎంసీలను తరలించి.. పులివెందుల, లింగాల మండలాల్లో చెరువులను నింపి, యురేనియం ప్రభావిత గ్రామాలకు జలాలను సరఫరా చేసి 25వేల ఎకరాలను సస్యశ్యామలం చేయాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయించారు. ఈ పథకం పనులు చేపట్టడానికి వీలుగా సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) తయారీ బాధ్యతలను ఇప్పటికే సర్వే సంస్థకు అప్పగించారు. ఈ పథకం పనులు చేపట్టడానికి రూ.108 కోట్లు అవసరం అవుతాయని ప్రాథమికంగా అంచనా వేశారు. -
రూ.150 కోట్ల అవినీతి స్రవంతి
సాక్షి, అమరావతి : టెండర్ నోటిఫికేషన్ జారీ చేయక ముందే కాంట్రాక్టర్లతో బేరసారాలు జరిపారు. అడిగిన మేరకు కమీషన్ ఇచ్చేందుకు అంగీకరించిన కాంట్రాక్టర్‌కు మాత్రమే పనులు దక్కేలా నిబంధనలతో టెండర్ నోటిఫికేషన్ జారీ చేయించారు. ఇద్దరు కాంట్రాక్టర్లు షెడ్యూళ్లు దాఖలు చేశారు. ఒక కాంట్రాక్టర్‌పై సాంకేతిక (టెక్నికల్) బిడ్‌లో అనర్హత వేటు వేశారు. బరిలో ఒక్క కాంట్రాక్టరే మిగలడంతో నిబంధనల ప్రకారం ఆర్థిక(ఫైనాన్స్) బిడ్ తెరవకూడదు. ఎందుకంటే పోటీ లేకపోవడం వల్ల అధిక (ఎక్సెస్) ధరలకు పనులు అప్పగించాల్సిన పరిస్థితి వస్తుంది. ఒకే షెడ్యూలు మిగిలినప్పుడు ఆర్థిక బిడ్ తెరవ కుండా టెండర్ రద్దు చేసి మళ్లీ టెండర్లు నిర్వహించాలని ప్రభుత్వం జీవో 174లో స్పష్టంగా పేర్కొంది. నిబంధనలను తుంగలో తొక్కిన ప్రభుత్వ పెద్దలు అధికారులపై ఒత్తిడి తెచ్చి ఫైనాన్స్ బిడ్‌ను తెరిపించారు. అస్మదీయ కాంట్రాక్టర్ 4.57 శాతం అధిక ధరకు కోట్ చేసినట్లు వెల్లడైంది. ఆ టెండర్లను ఆమోదిం చాలని కమిషనర్ ఆఫ్ టెండర్స్ (సీవోటీ)పై ఒత్తిడి తెస్తున్నారు. ఈ వ్యవహారంలో రూ. 150 కోట్లకుపైగా ముడుపులు చేతులు మారనున్నాయి. సీఎం చంద్రబాబు కనుసన్నల్లో ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు, జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సాగిస్తున్న ఈ అక్రమాలకు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం వేదికైంది. పోలవరం ఎడమ కాలువ ద్వారా 63.4 టీఎంసీల గోదావరి జలాలను మళ్లించి విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో 8 లక్షల ఎకరాలకు సాగునీళ్లు, 30 లక్షల మంది దాహార్తి తీర్చాలన్న లక్ష్యంతో రూ.7,214.1 కోట్ల అంచనాతో ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకాన్ని జనవరి 2, 2009న దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి మంజూరు చేశారు. ఆయన హఠాన్మరణంతో ఈ పథకం మరుగున పడింది. అంచనా వ్యయం పెంచేసి.. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకాన్ని మరుగున పడేయడంపై ప్రజలు ఆందోళన బాట పట్టడంతో ప్రభుత్వం దిగివచ్చింది. రూ. 2,022.20 కోట్లతో ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం తొలి దశను గతేడాడి సెప్టెంబర్ 5న మంజూరు చేసింది. పోలవరం ఎడమ కాలువ 162.409 కి.మీ. నుంచి పది టీఎంసీలను మళ్లించి విశాఖపట్నం జిల్లాలో 9 మండలాల్లోని 1.30 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించాలని నిర్ణయించారు. కానీ.. 2009లో ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఈ పనుల అంచనా వ్యయం రూ.801.03 కోట్లు మాత్రమే. అంటే అంచనా వ్యయాన్ని రూ.1,221.17 కోట్లు పెంచినట్లు స్పష్టమవుతోంది. ఆ తర్వాత తొలి దశ పనులను రెండు ప్యాకేజీలుగా విడగొట్టారు. ఈ పనులను తన వియ్యంకుడు పుట్టా సుధాకర్ యాదవ్ వ్యాపార భాగస్వామి అయిన హెచ్‌ఈఎస్–ఇన్ఫ్రాకు అప్పగించాలని సీఎం చంద్రబాబును మంత్రి యనమల మొదట్లోనే కోరినట్లు అధికారవర్గాలు వెల్లడించాయి. యనమల ప్రతిపాదన మేరకు గత ఫిబ్రవరిలో ఉత్తరాంధ్ర సుజల స్రవంతి తొలి దశలో మొదటి ప్యాకేజీ (పోలవరం ఎడమ కాలువ 162.409 కి.మీ. నుంచి 3.5 కి.మీ.ల ప్రధానకాలువ తవ్వకం, లైనింగ్, 3.5 టీఎంసీల సామర్థ్యంతో పెదపూడి రిజర్వాయర్) పనులకు రూ.268.92 కోట్ల అంచనా వ్యయంతో టెండర్లు పిలిచారు. 4.85 శాతం అధిక ధరలకు అంటే 281.96 కోట్లకు హెచ్‌ఈఎస్ సంస్థకు కట్టబెట్టారు. రెండో ప్యాకేజీలోనూ అదే దందా.. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం తొలి దశలో రెండో ప్యాకేజీ పనుల (పెదపూడి రిజర్వాయర్‌లోకి రెండు దశల్లో నీటిని ఎత్తిపోయడం, 1.30 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించడం)కు రూ. 603.87కోట్ల అంచనా వ్యయంతో ఈపీసీ విధానంలో జూన్ 8న టెండర్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ టెండర్లలో ఇతరులు ఎవరికీ పాల్గొనే అవకాశమే లేకుండా చేసేందుకు 1.30 లక్షల ఎకరాల ఆయకట్టులో కేవలం 15,118 ఎకరాలకు మాత్రమే పైపుల ద్వారా నీళ్లందించాలని ప్రతిపాదించారు. అంటే.. పైపుల ద్వారా ఆయకట్టుకు నీళ్లు అందించిన అనుభవమున్న కాంట్రాక్టర్లకు మాత్రమే టెండర్లలో పాల్గొనడానికి అర్హులనే నిబంధన పెట్టేందుకే దీనిని చొప్పించారని స్పష్టమవుతోంది. ఆ నిబంధన మేరకే హెచ్‌ఈఎస్ సంస్థ మెగా సంస్థతో జట్టు కట్టి జాయింట్ వెంచర్ (జేవీ) ఏర్పాటు చేసేలా చక్రం తిప్పారు. దానితో షెడ్యూల్ దాఖలు చేయించారు. ఎన్సీసీ సంస్థ మరో షెడ్యూల్ దాఖలు చేసింది. ఈనెల 2న టెక్నికల్ బిడ్ తెరిచారు. ఎన్సీసీ సంస్థ దాఖలు చేసిన షెడ్యూల్లో తప్పులు ఉన్నాయంటూ ఆ సంస్థపై అనర్హత వేటు వేశారు. అంటే బరిలో హెచ్‌ఈఎస్–మెగా (జేవీ) మాత్రమే మిగిలింది. షెడ్యూలు ప్రకారం ఈనెల 4న ప్రైస్ బిడ్ తెరవాలి. ఒకే ఒక సంస్థ బరిలో మిగిలిన నేపథ్యంలో నిబంధనల మేరకు ప్రైస్ బిడ్ తెరవకూడదని అధికారులు నిర్ణయించారు. కానీ.. మంత్రులు దేవినేని, యనమల అధికారులపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చి ఈనెల 12న ప్రైస్ బిడ్ తెరిపించినట్లు తెలుస్తోంది. ఇందులో 4.57 శాతం అధిక ధరలకు ఆ సంస్థ కోట్ చేసింది. ఆ సంస్థకే పనులు అప్పగించడానికి అనుమతి కోరుతూ సీవోటీకి సోమవారం అధికారులు ప్రతిపాదనలు పంపారు. సీవోటీ ఆమోదముద్రే తరువాయి.. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి తొలి దశ రెండో ప్యాకేజీ టెండర్లను ఆమోదించాలంటూ సీఎం చంద్రబాబు, ఇద్దరు మంత్రులు సీవోటీపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెస్తున్నట్లు అధికారవర్గాలు పేర్కొన్నాయి. నిబంధనల ప్రకారం సింగిల్ బిడ్ టెండర్లను తిరస్కరించాలి. కానీ.. ఒత్తిడి తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఆ టెండర్లను ఆమోదించే అవకాశం ఉందని అధికారవరర్గాలు వెల్లడించాయి. 2017–18 ఎస్ఎస్ఆర్ ధరలను పరిగణనలోకి తీసుకుంటే రెండో ప్యాకేజీ పనుల్లో జమ్మాదులపాలెం, తీడ పంప్ హౌస్‌ల పనులకు రూ. 243 కోట్లకు మించి ఖర్చు కాదని అధికారవర్గాలే చెబుతున్నాయి. లీడింగ్ ఛానల్ తవ్వకం పనులకు రూ. 50.73 కోట్లు, 1.30 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించే డిస్ట్రిబ్యూటరీ పనులకు రూ. 130 కోట్లకు మించి వ్యయం కాదు. అంటే.. మొత్తం 423.13 కోట్లకు మించి ఖర్చు కాదు. కానీ.. పనుల వ్యయాన్ని రూ. 603.87 కోట్లకు పెంచేసి టెండర్లు పిలవడం, వాటిని 4.57 అధిక ధరలకు కాంట్రాక్టర్‌కు అప్పగించడం ద్వారా రూ. 150 కోట్లకుపైగా కమీషన్లు రాబట్టుకోవడానికి ప్రభుత్వ పెద్దలు స్కెచ్ వేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
రాజకీయాలకు అతీతంగా పోరాటం
హంద్రీ నీవా పూర్తికి రూ.7వేల కోట్లు కేటాయించాలి రాయలసీమ అభివృద్ధి వేదిక డిమాండ్ రాజకీయాలకు అతీతంగా పోరాటం హంద్రీ నీవా పూర్తికి రూ.7వేల కోట్లు కేటాయించాలి రాయలసీమ అభివృద్ధి వేదిక డిమాండ్ అనంతపురం సెంట్రల్ : జిల్లా అభివృద్ధికి రాజకీయాలకు అతీతంగా పోరాడేందుకు సమాయత్తం కావాలని రాయలసీమ అభివృద్ధి వేదిక కన్వీనర్, ఎమ్మెల్సీ గేయానంద్ అన్నారు. వేదిక డిమాండ్లను ప్రభుత్వ దృ ష్టికి తీసుకెళ్లేందుకు జెడ్పీ కార్యాలయంలో శుక్రవారం మంత్రి పల్లె రఘునాథరెడ్డి, జెడ్పీ చైర్మన్ చమన్‌లతో సమావేశమయ్యారు. గేయానంద్‌తోపాటు, వేదిక సలహాదారుడు సింగమనేని నారాయణ మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ ప్రభుత్వం జిల్లా అభివృద్ధికి హార్టీకల్చర్ హబ్, పారిశ్రామిక వాడలు, ఖనిజ ఆధారిత పరిశ్రమలు, హంద్రీ నీవా పూర్తి, తదితర అనేక హామీలు ఇచ్చిందన్నారు. ఇందులో ఏ ఒక్కటీ కార్యరూపం దాల్చలేదన్నారు. హంద్రీ నీవా సుజల స్రవంతి పథకానికి రూ.7వేల కోట్లు కేటాయిస్తే తప్పా పూర్తయ్యే దాఖలాలు లేవని వివరించారు. జిల్లా అభివృద్ధికి ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టేందుకు మన వాణిని గటి ్టగా వినిపించాలని సూచించారు. మంత్రి పల్లె రఘునాథరెడ్డి మాట్లాడుతూ జిల్లాకు పరిశ్రమలు తీసుకురావడానికి కృషి చేస్తున్నామని వివరించారు. జెడ్పీ చైర్మన్ చమన్ మాట్లాడుతూ జిల్లా అభివృద్ధిపై చర్చించేందుకు ప్రత్యేకంగా ఒక వేదికను ఏర్పాటు చేసి, అందరి అభిప్రాయాలతో ముందుకెళ్తే మంచి ఫలితాలు వస్తాయన్నారు. మానవహక్కుల వేదిక నాయకులు ఎస్ఎం బాషౠ, సైన్స్ ఉద్యమ కార్యకర్త డాక్టర్ ప్రసూన, ప్రభుత్వ వైద్యుల సంఘం నాయకులు డాక్టర్ వీరభద్రయ్య తదితరులు పాల్గొన్నారు. -
సుజల కష్టాలు
సుజల స్రవంతి పథకం జిల్లా అధికారులకు, పరిశ్రమలకు చిక్కులు తెచ్చి పెడుతోంది. పథకానికి నిధులివ్వకుండా సర్కార్ తప్పించుకోవడంతో ఆ భారం వీరిపై పడ్డంతో లబోదిబోమంటున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు పరిశ్రమలను ఒప్పించాల్సిన బాధ్యత ఉండడంతో ఏంచేయాలో తెలీక తలలు పట్టుకుంటున్నారు. ప్రభుత్వం చేయాల్సిన పనిని తమపై నెట్టడంతో పరిశ్రమల యాజమాన్యాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సాక్షి, విశాఖపట్నం : సుజల స్రవంతి పథకానికి అక్టోబర్ 2 నుంచి ప్రభుత్వం స్వీకారం చుట్టనుంది. రూ.2 కే 20లీటర్లు ఇచ్చే ఈ పథకానికి అవసరమయ్యే మినరల్వాటర్ప్లాంట్లను ప్రభుత్వం కొనుగోలుచేయకుండా వాటిని సేకరించాల్సిన బాధ్యతను జిల్లాకలెక్టర్లపైనే పెట్టింది. ప్లాంట్ల కొనుగోలుకు అవసరమయ్యే మొత్తాన్ని ప్రముఖ పరిశ్రమలు,కంపెనీలే భరించేలా అధికారులు పర్యవేక్షించాలని ఆదేశించింది. దీంతో ఇప్పుడు జిల్లా కలెక్టర్‌తోపాటు గ్రామీణ నీటిసరఫరా, జిల్లా పరిశ్రమలశాఖ తల పట్టుకుంటున్నాయి. దాతల రూపంలో ఒక్కో కంపెనీకి ఒక్కో గ్రామాన్ని అప్పగించి వారిచేత ప్లాంట్లు కొనుగోలు చేయించడం వీరి పని. అయితే ఇప్పుడు ఆచరణలో తలెత్తుతోన్న ఇబ్బందులతో వీరంతా అగచాట్లు పడుతున్నారు. ప్లాంట్ సామర్థ్యం ఆధారంగా ఒక్కోప్లాంట్‌కు రూ.2 లక్షల నుంచి రూ.10లక్షవరకు ఉంటోంది. కంపెనీల వెంట అధికారులు పరుగులు తీస్తున్నారు. వారితో సమావేశాలు నిర్వహించి గ్రామాలను ఎంపిక చేసుకుని అక్కడ ప్లాంట్ పెట్టే బాధ్యత కంపెనీలకు అప్పగిస్తున్నారు. ప్రభుత్వ తీరుతో చాలా పరిశ్రమలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. గతేడాదిగా వరుసగా సమైక్య ఉద్యమం, వరుస విద్యుత్‌కోతలు, ఆర్డర్లు లేకపోవడం, బ్యాంకురుణాలు చెల్లించలేక ఆర్థికసంక్షోభంలో కూరుకుపోవడం, ప్రభుత్వం నుంచి సబ్సిడీ బకాయిలు రాకపోవడంతో చాలా పరిశ్రమలు రకరకాల కష్టాలు ఎదుర్కొంటున్నాయి. ఈతరుణంలో సుజల స్రవంతి పథకానికి తాము ప్లాంట్లు కొనివ్వలేమని ఖరాఖండీగా చెబుతున్నాయి. మరికొన్నయితే అధికారుల నుంచి తర్వాత ఇబ్బందులు తలెత్తుతాయనే భయంతో ఆర్థికంగా కష్టమైనా మౌనంగా భరిస్తున్నాయి. ఇప్పుడు మినరల్ వాటర్ ప్లాంట్లను కొనుగోలు చేసి ఇవ్వకపోతే ఆతర్వాత ప్రోత్సాహకాల పరంగా సర్కార్ నుంచి ఇబ్బందులు తలెత్తుతాయేమోనని భయపడుతున్నాయి. ఇప్పటికే స్టీల్‌ప్లాంట్, హెచ్‌పీసీఎల్ వంటి ప్రభుత్వ రంగ సంస్థలు ముందుకురాగా, విశాఖడెయిరీ కూడా వాటర్ప్లాంట్లు కొనుగోలుకు సహకరించాలని నిర్ణ యించింది. చాలాపెద్దగ్రామాలు ఉండిపోవడం..అధికారులు అదేపనిగా కొన్ని ప్రైవేటు కంపెనీలను అడుగుతుంటే అవి మాత్రం తమను వదిలేయండంటూ మొరపెట్టుకుంటుండడం విశేషం.