సుజల స్రవంతి పథకం జిల్లా అధికారులకు, పరిశ్రమలకు చిక్కులు తెచ్చి పెడుతోంది. పథకానికి నిధులివ్వకుండా సర్కార్ తప్పించుకోవడంతో ఆ భారం వీరిపై పడ్డంతో లబోదిబోమంటున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు పరిశ్రమలను ఒప్పించాల్సిన బాధ్యత ఉండడంతో ఏంచేయాలో తెలీక తలలు పట్టుకుంటున్నారు. ప్రభుత్వం చేయాల్సిన పనిని తమపై నెట్టడంతో పరిశ్రమల యాజమాన్యాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
సాక్షి, విశాఖపట్నం : సుజల స్రవంతి పథకానికి అక్టోబర్ 2 నుంచి ప్రభుత్వం స్వీకారం చుట్టనుంది. రూ.2 కే 20లీటర్లు ఇచ్చే ఈ పథకానికి అవసరమయ్యే మినరల్‌వాటర్‌ప్లాంట్లను ప్రభుత్వం కొనుగోలుచేయకుండా వాటిని సేకరించాల్సిన బాధ్యతను జిల్లాకలెక్టర్లపైనే పెట్టింది. ప్లాంట్ల కొనుగోలుకు అవసరమయ్యే మొత్తాన్ని ప్రముఖ పరిశ్రమలు,కంపెనీలే భరించేలా అధికారులు పర్యవేక్షించాలని ఆదేశించింది. దీంతో ఇప్పుడు జిల్లా కలెక్టర్‌తోపాటు గ్రామీణ నీటిసరఫరా, జిల్లా పరిశ్రమలశాఖ తల పట్టుకుంటున్నాయి.
దాతల రూపంలో ఒక్కో కంపెనీకి ఒక్కో గ్రామాన్ని అప్పగించి వారిచేత ప్లాంట్లు కొనుగోలు చేయించడం వీరి పని. అయితే ఇప్పుడు ఆచరణలో తలెత్తుతోన్న ఇబ్బందులతో వీరంతా అగచాట్లు పడుతున్నారు. ప్లాంట్ సామర్థ్యం ఆధారంగా ఒక్కోప్లాంట్‌కు రూ.2 లక్షల నుంచి రూ.10లక్షవరకు ఉంటోంది. కంపెనీల వెంట అధికారులు పరుగులు తీస్తున్నారు. వారితో సమావేశాలు నిర్వహించి గ్రామాలను ఎంపిక చేసుకుని అక్కడ ప్లాంట్ పెట్టే బాధ్యత కంపెనీలకు అప్పగిస్తున్నారు. ప్రభుత్వ తీరుతో చాలా పరిశ్రమలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.
గతేడాదిగా వరుసగా సమైక్య ఉద్యమం, వరుస విద్యుత్‌కోతలు, ఆర్డర్లు లేకపోవడం, బ్యాంకురుణాలు చెల్లించలేక ఆర్థికసంక్షోభంలో కూరుకుపోవడం, ప్రభుత్వం నుంచి సబ్సిడీ బకాయిలు రాకపోవడంతో చాలా పరిశ్రమలు రకరకాల కష్టాలు ఎదుర్కొంటున్నాయి. ఈతరుణంలో సుజల స్రవంతి పథకానికి తాము ప్లాంట్లు కొనివ్వలేమని ఖరాఖండీగా చెబుతున్నాయి. మరికొన్నయితే అధికారుల నుంచి తర్వాత ఇబ్బందులు తలెత్తుతాయనే భయంతో ఆర్థికంగా కష్టమైనా మౌనంగా భరిస్తున్నాయి. ఇప్పుడు మినరల్ వాటర్ ప్లాంట్లను కొనుగోలు చేసి ఇవ్వకపోతే ఆతర్వాత ప్రోత్సాహకాల పరంగా సర్కార్ నుంచి ఇబ్బందులు తలెత్తుతాయేమోనని భయపడుతున్నాయి.
ఇప్పటికే స్టీల్‌ప్లాంట్, హెచ్‌పీసీఎల్ వంటి ప్రభుత్వ రంగ సంస్థలు ముందుకురాగా, విశాఖడెయిరీ కూడా వాటర్‌ప్లాంట్లు కొనుగోలుకు సహకరించాలని నిర్ణ యించింది. చాలాపెద్దగ్రామాలు ఉండిపోవడం..అధికారులు అదేపనిగా కొన్ని ప్రైవేటు కంపెనీలను అడుగుతుంటే అవి మాత్రం తమను వదిలేయండంటూ మొరపెట్టుకుంటుండడం విశేషం.
సుజల కష్టాలు
Published Wed, Sep 3 2014 12:34 AM | Last Updated on Sat, Sep 2 2017 12:46 PM
Advertisement