మంత్రిగారి మాయ.. కమీషన్ల యావ | Minister Devineni Uma strategy to collect Rs 85 crore commission | Sakshi
Sakshi News home page

మంత్రిగారి మాయ.. కమీషన్ల యావ

Published Mon, Mar 4 2019 3:55 AM | Last Updated on Mon, Mar 4 2019 3:55 AM

Minister Devineni Uma strategy to collect Rs 85 crore commission - Sakshi

టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేయకముందే కోటరీ కాంట్రాక్టర్లతో సమావేశమైన మంత్రి దేవినేని ఉమా.. ఎక్కువ కమీషన్‌ ఇచ్చేందుకు ముందుకొచ్చిన ఆస్థాన కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించాలని నిర్ణయించారు. మంత్రి ఆదేశాల మేరకు.. ఆ కాంట్రాక్టర్‌కు పనులు దక్కేలా నిబంధనలతో టెండర్‌ నోటిఫికేషన్‌ జారీచేశారు. సింగిల్‌ బిడ్‌ దాఖలైతే.. జీవో 94 ప్రకారం టెండర్‌ను రద్దుచేయాల్సిన పరిస్థితి ఉత్పన్నమవుతుంది. దీంతో ఎంపిక చేసిన కాంట్రాక్టర్‌తోపాటు మరో కాంట్రాక్టర్‌తో ఐదు శాతంలోపు అంటే.. 4.89 శాతానికి ఒకరు.. 4.99 శాతానికి మరొకరితో షెడ్యూలు దాఖలు చేయించేలా ఒప్పందం చేసుకున్నారు. 4.89 శాతం ఎక్సెస్‌కు షెడ్యూలు దాఖలు చేసే కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించి.. తద్వారా రూ.85 కోట్ల మేర కమీషన్లు వసూలు చేసుకోవడానికి మంత్రి పావులు కదుపుతున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. 

సాక్షి, అమరావతి: నీటి లభ్యతపై హైడ్రాలజీ విభాగం క్లియరెన్స్‌ ఇవ్వలేదు.. అయినా 50 వేల ఎకరాలకు నీళ్లందించే ఎత్తిపోతలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేశారు. రూ.325 కోట్లతో పూర్తయ్యే పనుల అంతర్గత అంచనా విలువ (ఐబీఎం)ను రూ.495 కోట్లుగా నిర్ణయించి ఈపీసీ (ఇంజనీరింగ్‌ ప్రొక్యూర్‌మెంట్‌ అండ్‌ కన్‌స్ట్రక్షన్‌) విధానంలో ఎంపిక చేసిన కాంట్రాక్టర్‌కే పనులు దక్కేలా టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేయించారు. అనంతరం రూ.85 కోట్ల మేర కమీషన్లు వసూలు చేసుకోవడానికి ప్రణాళిక రచించారు. రాష్ట్ర జలవనరుల శాఖా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కోటా కింద సీఎం చంద్రబాబునాయుడు మంజూరు చేసిన కోటపాడు– చనుబండ–విస్సన్నపేట ఎత్తిపోతల పథకం ఈ దందాకు కేంద్రంగా మారింది. వివరాల్లోకి వెళ్తే..

గోదావరి నది నుంచి 15.50 టీఎంసీల నీటిని పశ్చిమగోదావరి జిల్లాలోని మెట్ట ప్రాంతంలో రెండు లక్షల ఎకరాలకు నీళ్లందించడానికి 2008లో రూ.1,700.57 కోట్లతో చింతలపూడి ఎత్తిపోతలను ప్రభుత్వం చేపట్టింది. ఈ పథకం సామర్థ్యాన్ని 50 టీఎంసీలకు పెంచి.. పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లో నాగార్జునసాగర్‌ ఎడమ కాలువ కింద 2.8 లక్షల ఎకరాల ఆయకట్టును స్థీరికరించే పనులకు సెప్టెంబరు 3, 2016న రూ.4,909 కోట్లతో అనుమతిచ్చారు. ఇప్పుడు చింతలపూడి ఎత్తిపోతల కింద 4.80 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లివ్వకుండా దానిని పక్కన పెట్టి.. ఆ నీటిని పోలవరం కుడి కాలువ మీదుగా ప్రకాశం బ్యారేజీకి తరలించి.. అక్కడి నుంచి నాగార్జునసాగర్‌ కుడి కాలువలోకి ఎత్తిపోసే పనులను గోదావరి–పెన్నా నదుల అనుంధానం తొలి దశ పేరుతో రూ.6,020 కోట్లతో ఇటీవల పనులు చేపట్టారు. తాజాగా చింతలపూడి ఎత్తిపోతల ప్రధాన కాలువపై కృష్ణాజిల్లా చాట్రాయి మండలంలో 89.90 కి.మీ వద్ద 50 క్యూసెక్కులను ఎత్తిపోసేలా కోటపాడు, 98.20 కి.మీ వద్ద 100 క్యూసెక్కులు ఎత్తిపోసేలా చనుబండ, 100.50 కి.మీ వద్ద మూడు దశల్లో 800 క్యూసెక్కులు ఎత్తిపోసేలా విస్సన్నపేట ఎత్తిపోతల ద్వారా విస్సన్నపేట, ముసునూరు, రెడ్డిగూడెం, చాట్రాయి, నూజివీడు మండలాల్లో 50 వేల ఎకరాలకు నీళ్లందించడానికి రూ.698.90 కోట్లతో పథకాన్ని చేపట్టడానికి సర్కార్‌ అనుమతిచ్చింది.

ఒకే దెబ్బకు రెండు పిట్టలు..
కృష్ణాజిల్లా వ్యాప్తంగా టీడీపీపై ప్రజా వ్యతిరేకత పెల్లుబుకుతుంటే.. ఇదే జిల్లా మైలవరం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి దేవినేని ఉమాపై ఆ వ్యతిరేకత తారస్థాయికి చేరింది. నీళ్లు ఇస్తున్నట్లు మాయచేసి ప్రజా వ్యతిరేకతను తగ్గించుకోవడంతోపాటు భారీఎత్తున కమీషన్లు కొట్టేయడానికే ఎన్నికలకు ముందు తన కోటా కింద దేవినేని ఉమా ఈ ఎత్తిపోతల పథకాన్ని మంజూరు చేయించుకున్నట్లు ఆ శాఖ అధికార వర్గాలే చెబుతున్నాయి. మరోవైపు.. ఈ ఎత్తిపోతలకు హైడ్రాలజీ విభాగం అనుమతివ్వలేదు. ఇదేమీ పట్టించుకోకుండా కేవలం కమీషన్ల కోసమే ఈ ఎత్తిపోతలపై ముందుకెళ్తున్నారని అధికారులు ఆరోపిస్తున్నారు. 

రూ.170 కోట్లు పెంచేశారు..
ఇదిలా ఉంటే.. కోటపాడు–చనుబండ–విస్సన్నపేట ఎత్తిపోతల పథకంలో భాగంగా చింతలపూడి ప్రధాన కాలువపై 89.90 కి.మీ వద్ద కోటపాడు సమీపంలో 1.42 క్యూమెక్కుల నీటిని ఎత్తిపోసేందుకు రూ.45 కోట్లు.. అలాగే, 98.20 కి.మీ వద్ద చనుబండ సమీపంలో 2.832 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోసే పనులకు రూ.90 కోట్లు.. 100.50 కి.మీ వద్ద విస్సన్నపేట–1 ఎత్తిపోతలలో భాగంగా 9.911 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోసేందుకు, విస్సన్నపేట–2 ఎత్తిపోతల కింద 8.495 క్యూమెక్కుల నీటిని,  విస్సన్నపేట–3లో 4.247 క్యూసెక్కుల నీటిని తరలించేందుకు రూ.190 కోట్లకు మించి వ్యయంకాదని అధికారులు తేల్చారు. అంటే.. ఈ మొత్తం ఎత్తిపోతల పనులను రూ.325 కోట్లతో పూర్తిచేయవచ్చు. కానీ, రూ.495 కోట్లతో టెండర్‌ నోటిఫికేషన్‌ జారీచేయడం గమనార్హం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement