సాక్షి, అమరావతి: ఎంబీబీఎస్‌లో చేరికకు నిర్వహించిన ‘నీట్’ ఫలితాలు జూన్ మొదటి వారంలో వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో భారతీయ వైద్యమండలి ఎంబీబీఎస్ సీట్ల భర్తీకి షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈమేరకు అన్ని రాష్ట్రాల వైద్య ఆరోగ్యశాఖల అధికారులకు, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు పంపింది. ఈ ఏడాది దేశవ్యాప్తంగా 26.20 లక్షల మందికి పైగా విద్యార్థులు ‘నీట్’ రాసిన విషయం తెలిసిందే. అందులో ఆంధ్రప్రదేశ్ నుంచి 49 వేల మందికి పైగా రాస్తే, తెలంగాణ నుంచి 50 వేల పైచిలుకు రాశారు.
మొదటి వారంలో ఫలితాలు...
జూన్ మొదటివారంలో నీట్ ఫలితాలు విడుదల చేసేందుకు సీబీఎస్‌ఈ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్) సమాయత్తమవుతోంది. వచ్చే నెల 7వ తేదీ లోగా ఫలితాలు వెల్లడించనున్నారు. తొలుత దేశవ్యాప్త ర్యాంకులు వెల్లడిస్తారు. ఆ తర్వాత వారంలో రాష్ట్రస్థాయి ర్యాంకులు ప్రకటిస్తారు.
500 మార్కులు దాటితేనే...
ఈ ఏడాది నీట్‌లో 500 మార్కులు దాటితే ప్రభుత్వ సీటు వస్తుందన్న వ్యాఖ్యలు పలువురు అభ్యర్థులు వ్యక్తం చేస్తు న్నారు. ఈ ఏడాది ఉన్నది 1,900 సీట్లయితే అందులో 15 శాతం జాతీయ ఫూల్‌లోకి వెళతాయి. మిగిలినవి 1,625 సీట్లు మాత్రమే.
మరో రెండువేల సీట్లు ప్రైవేటు వైద్య కళాశాలలో ఉంటే అందులో 50 శాతం అంటే వెయ్యి సీట్లు మాత్రమే కన్వీనర్ కోటా కిందకు వస్తాయి. అంటే మొత్తం 2,625 సీట్లకు మాత్రమే అభ్యర్థులు పోటీపడాలి. ప్రభుత్వ, కన్వీనర్ సీట్లకు మాత్రమే పోటీ చూసుకుంటే ఒక్కో సీటుకు 18.6 మంది పరీక్ష రాసినట్టు తేలింది. యాజమాన్య, ఎన్‌ఆర్‌ఐ కోటా కింద మరో వెయ్యి సీట్ల వరకు ఉంటాయి. వీటికి కూడా నీట్‌లో అర్హత సాధించాక ప్రత్యేక కౌన్సెలింగ్ ద్వారా సీట్లు భర్తీ చేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment