=ఎన్నికల ముందు నోటిఫికేషన్? టెట్ సన్నాహాలతో కదలిక
=జిల్లాలో 1370 పోస్టుల భర్తీ
=స్కూల్ అసిస్టెంట్లు - 233, ఎస్జీటీలు - 1086
సాక్షి, విశాఖపట్నం : ఉపాధ్యాయ నియామకాలకు సన్నాహాలతో బీఎడ్, డీఎడ్ అభ్యర్థుల్లో ఉరుకులు పరుగులు ప్రారంభమయ్యాయి. కోచింగ్ సెంటర్లలో రద్దీ పెరిగింది. జిల్లాలో ప్రస్తుతమున్న క్లియర్ వేకెన్సీలు, బ్యాక్‌లాగ్ ఖాళీలతోపాటు ఈ ఏడాది ఫిబ్రవరిలో జీవో 43 ప్రకారం జిల్లాకు కేటాయించిన పోస్టుల్ని కూడా రానున్న డీఎస్సీలో భర్తీ చేయనున్నారు. ఈ మేరకు జిల్లాలో 1370 పోస్టుల భర్తీకి నోటిఫై చేస్తూ పాఠశాల విద్యాశాఖ డెరైక్టరేట్‌కు జిల్లా విద్యాశాఖ గతంలోనే నివేదిక పంపింది. ఇందులో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 233, పండితులు 36, పీఈటీలు 15, ఎస్జీటీలు 1086 ఉన్నాయి. చిత్తూరు తర్వాత అత్యధిక పోస్టులు విశాఖలోనే ఉండటం గమనార్హం.
కొత్త కేటాయింపులే ఎక్కువ
వివిధ కేటగిరీల్లో అన్ని సబ్జెక్టులు కలిపి జిల్లాలో ఉన్న ఖాళీలు కేవలం 443 మాత్రమే. ఇందులో 239 పోస్టులు గత డీఎస్సీల్లో ఆయా రోస్టర్లో అర్హులైన అభ్యర్థుల్లేక మిగిలిపోయాయి. వీటిలో 193 ఎస్జీటీలే. ఈ ఏడాది ఫిబ్రవరిలో జారీ చేసిన జీవో నంబరు.43 ప్రకారం జిల్లాకు 820 ఎస్జీటీ పోస్టులు, 183 గణితం, 184 సోషల్ స్కూల్ అసిస్టెంట్ పోస్టుల్ని మంజూరు చేశారు. నిబంధనల మేరకు వీటిలో 70 శాతం పదోన్నతిపై భర్తీ చేయాల్సి ఉంది.
మిగిలిన వాటిని డీఎస్సీకి నోటిఫై చేశారు. దీంతో ఇప్పటికే ఉన్న ఖాళీలతోపాటు, కొత్త పోస్టులు 820 ఎస్జీటీ, గణితం(55), సోషల్(55) స్కూల్ అసిస్టెంట్ ఖాళీలు కలిపి మొత్తం 1370 పోస్టులు డీఎస్సీలో అభ్యర్థులకు అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ నాలుగుమాసాల కిందటి మాట. ఈ మధ్య కాలంలో మరి కొన్ని పోస్టులు పదవీ విరమణ, మరణం తదితర కారణాలతో ఖాళీ అయ్యాయి. కొత్తగా మరోసారి నోటిఫై చేస్తే వివిధ కేటగిరీలో మరో 50 వరకు పోస్టులు పెరిగే అవకాశాలున్నట్టు అధికారుల అంచనా.
టెట్‌కు 22,464 మంది
రాష్ట్ర విభజన వివాదంతో ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) వాయిదాపడుతూ వస్తోంది. దీన్ని త్వరితగతిన నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. జిల్లా నుంచి టెట్ పేపర్-1కు 2,109మంది,పేపర్-2కు 19,787 మంది, రెండింటికీ కలిపి 568 మంది కలిపి మొత్తం 22,464 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరితోపాటు ఇప్పటికే టెట్‌లో అర్హత పొందినవారు కూడా వేల సంఖ్యలో ఉన్నారు. వారిలో కొందరు మార్కులు పెంచుకునేందుకు మళ్లీ టెట్‌కు దరఖాస్తు చేసుకున్నారు. తాజా డీఎస్సీలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు గణితం, సోషల్ మినహా మిగిలిన సబ్జెక్టుల్లో పెద్దగా లేవు. ఉన్నవాటిలో కూడా బ్యాక్‌లాగ్ ఖాళీలే ఎక్కువ. దీంతో గత డీఎస్సీ మాదిరి ఈ సారి కూడా డీఎడ్ అభ్యర్థులకే ఎక్కువగా కలిసిరానుంది.
ఇక డీఎస్సీ !
Published Fri, Dec 6 2013 1:50 AM | Last Updated on Sat, Sep 15 2018 5:09 PM
Advertisement
Advertisement