చేవెళ్ల రూరల్, న్యూస్‌లైన్: వేలకువేలు ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థుల భద్రతపై దృష్టి సారించడం లేదు. బస్సుల్లో పరిమితికి మించి విద్యార్థులను తరలించడం, సరిపడు బస్సులు నడపకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. వేగంగా వెళ్తున్న పాఠశాల బస్సు అదుపుతప్పి బోల్తాపడింది. అదృష్టవశాత్తు స్వల్పగాయాలతో విద్యార్థులు బయటపడ్డారు. యాజమాన్యం తీరుపై విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడ్డారు. ఈ సంఘటన చేవెళ్ల మండలం కుమ్మెర శివారులో సోమవారం చోటుచేసుకుంది. విద్యార్థులు, ప్రత్యక్షసాక్షుల కథనం ప్రకారం.. చేవెళ్ల మండల కేంద్రంలో శ్రీసత్య సాయి గ్రామర్ స్కూల్ ఉంది.
సోమవారం ఉదయం పాఠశాలకు చెందిన బస్సు మండలంలోని గొల్లగూడ, కమ్మెట, గొల్లపల్లి, ధర్మాసాగర్ గ్రామాల్లోంచి దాదాపు 30 మంది విద్యార్థులను ఎక్కించుకొని అదే రూటులో ఉన్న కుమ్మెర, ముడిమ్యాల గ్రామాలకు వెళ్తోంది. బస్సు వేగంగా ఉండడం, డ్రైవర్ నిర్లక్ష్యంతో బస్సు కుమ్మెర శివారులో బోల్తాపడింది. దీంతో తీవ్ర భయాందోళనకు గురైన విద్యార్థులు హాహాకారాలు చేశారు. పక్క పొలాల్లో పనిచేస్తున్న రాజు, యాదగిరి గమనించి ఘటనా స్థలానికి వచ్చారు. బస్సు అద్దాలను పగులగొట్టి పిల్లలను సురక్షితంగా బయటకు రప్పించారు. ప్రమాదంలో కొందరు పిల్లలు స్వల్పగాయాలపాలయ్యారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. విద్యార్థులను రక్షించాల్సిన డ్రైవర్ శ్రీనివాస్ బస్సును అక్కడే వదిలేసి పరారయ్యాడు
పాఠశాల ఎదుట ఆందోళన..
పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని విద్యార్థుల తల్లిదండ్రులు స్కూల్ ఎదుట ఆందోళనకు దిగారు. ఒకానొకదశలో ప్రిన్సిపాల్ ఏరని పాఠశాల ఆఫీసులో, తరగతి గదుల్లో వెతికారు. అనంతరం విషయం తెలుసుకున్న ప్రిన్సిపాల్ ప్రభాకర్ అక్కడికి వచ్చారు. విద్యార్థుల భద్రతకు చర్యలు తీసుకుంటామని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన బస్సు డ్రైవర్‌ను తొలగిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. వారంరోజుల్లో బస్సుల సంఖ్య పెంచుతామని చెప్పడంతో ఆందోళనకారులు శాంతించి వెళ్లిపోయారు.
ఉన్నతాధికారులకు
నివేదిక పంపుతాం..
బస్సు బోల్తా విషయం తెలుసుకున్న జిల్లా విద్యాధికారులు చేవెళ్ల మండల విద్యాధికారి శ్రీశైలంను వివరణ కోరారు. దీంతో ఎంఈఓ పాఠశాలకు సందర్శించి వివరాలు సేకరించారు. విద్యార్థులకు సరిపడు బస్సులు లేవని, దీంతో రెండు ట్రిప్పుల కోసం బస్సు వేగంగా వస్తుండగా ప్రమాదం జరిగి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఘటనపై పూర్తి నివేదికను ఉన్నతాధికారులకు నివేదిక పంపుతామని చెప్పారు.
స్కూల్ బస్సు బోల్తా
Published Tue, Aug 27 2013 3:47 AM | Last Updated on Sat, Sep 15 2018 4:12 PM
Advertisement