పేరుకు ట్రస్ట్‌.. టీడీపీ ట్విస్ట్‌ | School Closed For Trust In Dwarakatirumala West Godavari | Sakshi
Sakshi News home page

పేరుకు ట్రస్ట్‌.. టీడీపీ ట్విస్ట్‌

Published Tue, Jul 2 2019 9:38 AM | Last Updated on Tue, Jul 2 2019 9:38 AM

School Closed For Trust In Dwarakatirumala West Godavari - Sakshi

ద్వారకాతిరుమల మండలం మద్దులగూడెం పంచాయతీ పరిధిలో శ్రీ సత్యసాయి అనాథ ఆశ్రమంగా మారిన ప్రభుత్వ పాఠశాల భవనం ఇదే..

సాక్షి, ద్వారకాతిరుమల (పశ్చిమ గోదావరి): టీడీపీ పాలనలో ఒక నేత ప్రభుత్వ పాఠశాలను విద్యార్థులకు దూరం చేశారు. దాని భవనాన్ని ఒక ప్రైవేటు ట్రస్టుకు కట్టబెట్టారు. అది ఆ ప్రాంత విద్యార్ధుల పాలిట శాపమైంది. ఇదంతా ఒక టీడీపీ నాయకుడి స్వార్ధ ప్రయోజనాల కారణంగానే జరిగాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ద్వారకా తిరుమల మండలంలోని మద్దులగూడెం పంచాయతీ పరిధిలో గతంలో ఒక ఎంపీపీ పాఠశాల ఉండేది. ఆ ప్రాంత విద్యార్ధులు ఆ పాఠశాలలోనే చదువుకునేవారు. నాలుగేళ్ల క్రితం ఒక టీడీపీ నేత ఒత్తిడి కారణంగా సంబంధిత అధికారులు పాఠశాలను మూసివేసినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ పాఠశాల భవనంలో శ్రీ సత్యసాయి ట్రస్టు ఆధ్వర్యంలో బాలికల అనాథ ఆశ్రమాన్ని ఏర్పాటు చేశారు.

ఏడెనిమిది మంది విద్యార్థులను ఏలూరు ఆశ్రమం నుంచి తీసుకొచ్చి ఇందులో ఉంచినట్లు స్థానికులు  చెబుతున్నారు. ప్రస్తుతం వారు కూడా అందులో లేరని, ట్రస్టుకు లెక్కలు చూపేందుకే ఈ ట్రిక్కులు ఉపయోగిస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. పాఠశాలను మూసేయడం వల్ల మద్దులగూడెం పంచాయతీకి చెందిన విద్యార్థులు నిత్యం కిలోమీటరు దూరంలో ఉన్న సీహెచ్‌.పోతేపల్లిలోని పాఠశాలకు కాలినడకన వెళుతున్నారు. స్థానిక గోద్రెజ్‌ ఆయిల్‌పామ్‌ ఫ్యాక్టరీకి నిత్యం ట్రాక్టర్లు, లారీల ద్వారా ఈ మార్గం గుండానే పామాయిల్‌ లోడులు వెళుతుంటాయి. దీంతో ఏ సమయంలో ఏం ప్రమాదం జరుగుతుందోనని పిల్లల తల్లిదండ్రులు భయాందోళన చెందుతున్నారు.

ట్రస్టుకు ఎలా ఇస్తారు?
ప్రభుత్వ భవనాన్ని ఒక ప్రైవేటు ట్రస్టుకు ఎలా ఇచ్చారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. బాలికల అనాథ ఆశ్రమం నడపాలనుకుంటే అందరికీ అనువైన ప్రాంతంలో ఏర్పాటు చేయాలి గానీ.. ఇలా మారుమూల గ్రామంలో ఏర్పాటు చేసి, ఎక్కడో ఉన్న విద్యార్థులను ఇక్కడ ఉంచడం హాస్యాస్పదమని గ్రామస్థులు అంటున్నారు. దీనిపై గ్రామానికి చెందిన పలువురు భవనం వద్ద సోమవారం నిరసన తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ భవనాన్ని స్వాధీనం చేసుకుని, తిరిగి పాఠశాలను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. దీనిపై ఎంపీడీవో ప్రసాద్‌ వివరణ ఇస్తూ 2016 మార్చిలో ఈ పాఠశాల భవనాన్ని శ్రీ సత్యసాయి డిజిటల్‌ సాధికారిత శిక్షణకు కేటాయిస్తూ మండల పరిషత్‌ తీర్మానించిందన్నారు. అయితే ఆ భవనం వద్ద ప్రస్తుతం అనాథ ఆశ్రమం బోర్డు ఉందని చెప్పారు

స్వలాభం కోసం పాఠశాల మూసేశారు
స్వలాభం కోసం శ్రీ సత్యసాయి ట్రస్టు పేరుతో పాఠశాలను మూసేశారు. డిజిటల్‌ సాధికారిత శిక్షణ కోసమని పొందిన ఈ పాఠశాల భవనంలో బాలికల అనాథాశ్రమాన్ని ఎలా నడుపుతున్నారో తెలియడం లేదు. 35 మంది అనాథ బాలికలు ఉన్నట్లు లెక్కల్లో చూపి, భవనాన్ని పొందారు. కానీ ఇందులో మొన్నటి వరకు కేవలం ఏడెనిమిది మంది మాత్రమే ఉన్నారు. ఇప్పుడు భవనం గేట్లకు తాళాలు పడ్డాయి. 
యాచమనేని నాగేశ్వరరావు, వైఎస్సార్‌ సీపీ నాయకుడు, సీహెచ్‌.పోతేపల్లి

చాలా ఇబ్బందిగా ఉంది
మద్దులగూడెంలో ఎంపీపీ పాఠశాల మూతపడటం వల్ల మా పిల్లలను సీహెచ్‌.పోతేపల్లిలోని పాఠశాలకు పంపుతున్నాం. సుమారు కిలోమీటరు దూరంలో ఉన్న ఆ పాఠశాలకు పిల్లలు నిత్యం నడిచి వెళుతున్నారు. ప్రభుత్వం కనికరించి, మూతపడ్డ పాఠశాలను మళ్లీ తెరిపించాలి.  
– చమటబోయిన రాంబాబు, మద్దులగూడెం, గ్రామస్థుడు

ఆందోళనగా ఉంది
మా పిల్లలను చదువు కోసం మద్దులగూడెం నుంచి సీహెచ్‌.పోతేపల్లిలోని ప్రభుత్వ పాఠశాలకు పంపుతున్నాను. అయితే పామాయిల్‌ లోడు లారీలు, ట్రాక్టర్లు తిరిగే ఈ రహదారిలో పిల్లలు నడిచి వెళ్లడం భయాన్ని కలిగిస్తోంది. ఏ సమయంలో ఏం జరుగుతుందోనని ఆందోళనగా ఉంటోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి మద్దులగూడెంలో మూతపడ్డ పాఠశాలను తెరవాలి. 
– ముసలి కల్యాణి, మద్దులగూడెం

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

భవనం వద్ద నిరసన తెలుపుతున్న స్థానికులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement