సాక్షి, కొత్తగూడెం: మెరుగైన విద్యా బోధనకు నిర్వహించే స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు ఇక ప్రశ్నార్థకం కానున్నాయి. ప్రభుత్వ పాఠశాలల సముదాయ కార్యక్రమాల నిర్వహణ కోసం (స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు) రాజీవ్ విద్యామిషన్ ప్రతి ఏడాది విడుదల చేస్తున్న బడ్జెట్‌లో ఈసారి భారీ కోత విధిం చడమే ఇందుకు కారణం. జిల్లాలో 337 స్కూల్ కాంప్లెక్స్‌లు ఉన్నాయి. అరకొర నిధులతో వీటిలో సమావేశాల నిర్వహణ కష్టమేనని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు.
ఆర్వీఎం ద్వారా జిల్లాలో కొనసాగే స్కూల్ కాంప్లెక్స్ సమావేశాల నిర్వహణకు రెండేళ్ల క్రితం రూ. 27 వేలు కేటాయించగా.. ఈ విద్యా సంవత్సరంలో కేవలం రూ.10 వేలు మాత్రమే విడుదల చేసేందుకు నిర్ణయించారు.
ఈ విషయమై రాజీవ్ విద్యా మిషన్ ద్వారా ఆదేశాలు వెలువడ్డాయి. మరో రెండు, మూడు రోజుల్లో ఈ నిధులు విడుదల చేసే అవకాశం ఉంది. ఒకేసారి భారీ మొత్తంలో రూ. 17 వేలు తగ్గించడంతో స్కూల్ కాంప్లెక్స్ సమావేశాల నిర్వహణ ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి నెలకొంది. పాఠశాలల నిర్వహణలో క్షేత్రస్థాయి సమస్యల పరిష్కారానికి, మెరుగైన విద్యా బోధనకు ఉపయోగ పడే సమావేశాలకు నిధులలో కోత విధించడంతో ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేయడంతో పాటు ఆర్వీఎం ఉన్నతాధికారులు తీసుకున్న నిర్ణయం పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. 2009లో ప్రభుత్వం ఒక జడ్పీ ఉన్నత పాఠశాలలను ఎంపిక చేసుకొని దాని సమీపంలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలను కలిపి స్కూల్ కాంప్లెక్స్‌గా ఏర్పాటు చేశారు. ఇటువంటి స్కూల్ కాంప్లెక్స్‌లు జిల్లాలో 337 వరకు ఉన్నాయి. ఈ కాంప్లెక్స్ పరిధిలో ఉన్న పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులంతా ప్రతినెల సమావేశమై ఆయా పాఠశాలల్లో అమలవుతున్న మధ్యాహ్న భోజనం, పూర్తయిన సిలబస్, ప్రశ్నపత్రాల తయారీ, గ్రాంట్ల ఖర్చు వివరాలు, విద్యార్థులకు వైద్య పరీక్షల విధానంపై, రాష్ట్ర, జిల్లా అధికారులు నిర్వహించే టెలీకాన్ఫరెన్స్‌లపై సమీక్షలు నిర్వహిస్తారు. ఆయా పాఠశాలల్లోని సమస్యలను మండల, జిల్లా విద్యాధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు ఈ సమావేశాలు ఎంతో ఉపయోగపడుతున్నాయి. అంతేగాక ఈ సమావేశాల్లో ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, సీఆర్పీలు విద్యా బోధనపై జిల్లా స్థాయిలో తీసుకున్న శిక్షణ విషయాలను ఉపాధ్యాయులకు వివరిస్తారు.
లక్ష్యం నెరవేరేదెలా..?
ఏటా ఆర్వీఎం నుంచి రూ. వందల కోట్లు నిధుల విడుదలవుతున్నా అనుకున్న స్థాయిలో మాత్రం లక్ష్యం నెరవేరడం లేదు. అయితే అసలు నిధులకు కోత విధిస్తే ఎలా..? అని సంబంధిత కాంప్లెక్స్ స్కూల్ ఉపాధ్యాయులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ప్రతి విద్యా సంవత్సరానికిగాను 10 స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు నిర్వహించాలి. వీటి నిర్వహణకు ఆర్వీఎం విడుదల చేస్తున్న నిధులను ఖర్చు చేస్తారు. వాటిలో రూ.5,500 లతో రికార్డులు, స్టేషనరీ, డివీడీల కొనుగోలు, ఉపాధ్యాయుల బోధనకు ఉపయోగించే రెఫరెన్స్ పుస్తకాల కొనుగోలు, సమావేశాలకు వచ్చే ఉపాధ్యాయులకు అల్పాహారం, డాంక్యుమెంటేషన్, తాగునీరు.., రూ.4,500 లతో ఉపాధ్యాయులకు రవాణా ఖర్చులు, ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల సందర్శనకు వెళ్లేందుకు ఉన్నత పాఠశాలల హెచ్‌ఎంలకు, సెక్రటరీలకు రవాణా ఖర్చులు.., లైబ్రరీ పుస్తకాల కొనుగోలు కోసం రూ. 12 వేలు ఖర్చు చేయాలని ఆర్వీఎం ఆదేశాలున్నాయి.
నిబంధనలను జారీ చేసిన ఆర్వీఎం నిర్దేశానుసారం ఖర్చు చేస్తేనే రూ. 22 వేలు నిధులు కావాల్సి వస్తుంది. అయితే ఏదో రకంగా సర్దుకోవాలంటూ కోతలు విధించి ఇప్పుడు రూ. 10వేలు అందజేసేందుకు సిద్ధం కావడంతో ఉపాధ్యాయులు బిత్తరపోతున్నారు. అసలు ఈ నిధులు మూడు కాంప్లెక్స్‌ల నిర్వహణకు కూడా సరిపోవని మిగతా కాంప్లెక్స్‌లు ఎలా నిర్వహించాలని ఆయా పాఠశాలల హెచ్‌ఎంలు తలపట్టుకుంటున్నారు. గతంలో మాదిరిగా నిధులు విడుదల చేస్తేనే..విద్యా సంవత్సరంలో కాంప్లెక్స్‌ల పర్యవేక్షణ సరిగా జరుగుతుందని, లేకపోతే అరకొరగా కేటాయించిన నిధులు కూడా నిష్ర్పయోజనం అయ్యే అవకాశం ఉందని పలువురు అంటున్నారు
స్కూల్ కాంప్లెక్స్ నిధులలో కోత
Published Sun, Sep 1 2013 2:28 AM | Last Updated on Thu, Jul 11 2019 5:12 PM
Advertisement
Advertisement