డాక్టర్ కోరుకొండ గోపి
మునగపాక (యలమంచిలి): ఇష్టపడి కష్టపడి పనిచేస్తే ఏరంగంలో అయినా రాణించగలమని నిరూపిస్తున్నారు.. మునగపాకకు చెందిన డాక్టర్ కోరుకొండ గోపి. దర్శకుడు పూరీ జగన్నాథ్ తదుపరి చిత్రం మిస్‌యూ డార్లింగ్‌లో రెండు పాటలు రాసే అవకాశాన్ని దక్కించుకున్నారు. గతంలో గోపి సినిమా పాటల రచయితగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడంతో పరిశీలించిన పూరీ జగన్నాథ్ అసిస్టెంట్ డైరెక్టర్ రవికుమార్ సినిమాకు సంబందించిన కథ చెబుతూ పాటలు రాయమన్నారు. దీంతో గోపీ అవకాశం వచ్చిందే తడవుగా పరీక్షల్లో తప్పిన హీరో తమ్ముడు ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధపడే సందర్భంలో ‘తమ్ముడూ పరీక్షల్లో తప్పడం నీ తప్పు కాదురా..’ అనే పాటతో పాటు హీరోయిన్ అందాలను వర్ణిస్తూ మరోపాటను రాసారు.
దీంతో రెండు పాటలను పూరీ జగన్నాథ్ ఎంపిక చేశారు. ప్రస్తుతం గోపీకృష్ణ సింహాద్రి ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్‌గా వ్యవహరిస్తున్నారు. రెండుసార్లు జాతీయ స్థాయిలోనూ, మరో రెండుసార్లు రాష్ట్ర స్థాయిలోనూ ఉత్తమ ఉపాధ్యాయునిగానూ అవార్డులు అందుకున్నారు. అలాగే స్వీయ రచనలో మానవ కంప్యూటర్ సంబంధాలు, కల్చరల్ రూరల్ టెక్నాలజీ పుస్తకాలు ఎంతో ప్రాచుర్యం పొందాయి. అంతేకాకుండా పలు టెలీ ఫిల్మ్‌లు కూడా షూట్ చేశారు. వర్ధమాన సంఘటనలను ఇతివృత్తంగా తీసుకొని టెలిఫిల్మ్‌లు షూట్ చేయడం అలవాటుగా మారింది. గ్రామీణ ప్రాంతానికి చెందిన గోపీకి పాటలు రాసే అవకాశం రావడం పట్ల కుటుంబ సభ్యులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment